న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా వాదన ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ (ఐటీఏటీ) గెలవలేదు. గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్‌కు జమచేసిన ప్రకటనల ఆదాయంపై గూగుల్ ఇండియా పన్ను చెల్లించాలన్న ఆదాయపన్ను శాఖ డిమాండ్‌ను ఐటీఏటీ సమర్థించింది. ఈ మేరకు ఐటీఏటీ బెంగళూరు బెంచ్ 331 పేజీలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది.
గూగుల్ ఇండియా పంపించే ఆదాయం రాయల్టీ కనుక, అది పన్ను పరిధిలోకి వస్తుందని ఆదాయపన్ను శాఖ చేసిన వాదనను ట్రిబ్యునల్ సమర్థించింది. అయితే, ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేస్తామని గూగుల్ తెలిపింది.
ప్రకటనల స్పేస్‌ను కొనుగోలు చేసి దాన్ని తిరిగి భారత్‌లో ప్రకటనదారులకు గూగుల్ యాడ్‌వర్డ్స్ కార్యక్రమం కింద విక్రయిస్తున్నామని... అలా ఆర్జించిన ఆదాయాన్నే గూగుల్ ఐర్లాండ్‌కు పంపిస్తున్నామని... కాబట్టి ఇది పన్ను పరిధిలోకి రాదని గూగుల్ తన పిటిషన్‌లో పేర్కొంది. 2012–13 ఆర్థిక సంవత్సరానికిగాను మూలం వద్ద పన్ను కోయకుండా గూగుల్ ఇండియా రూ.1,114.91 కోట్లను గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్‌కు చెల్లించినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది.
దీంతో రూ.258.84 కోట్లు చెల్లించాలని కోరుతూ ట్యాక్స్ డిమాండ్‌ను జారీ చేసింది. అయితే, గూగుల్ యాడ్‌వర్డ్స్ కార్యక్రమానికి తాను ఏకైక డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నానని, గూగుల్ ఐర్లాండ్‌కు చెల్లించే డిస్ట్రిబ్యూషన్ ఫీజును ‘హక్కు బదిలీ’ లేదా పేటెంట్‌ను వినియోగించుకునే హక్కుగా చూడరాదని, దీన్ని రాయల్టీగా భావించి పన్ను వేయరాదని గూగుల్ ఇండియా వాదిస్తోంది. ఈ వాదనతో ఐటీఏటీ ఏకీభవించలేదు.
Comments
Please login to add a commentAdd a comment