ట్రా'ఫికర్‌'కు డ్యాష్‌బోర్డుతో చెక్‌ | Google india dahs board will now give traffic jam alerts | Sakshi
Sakshi News home page

ట్రా'ఫికర్‌'కు డ్యాష్‌బోర్డుతో చెక్‌

Published Thu, Nov 3 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

ట్రా'ఫికర్‌'కు డ్యాష్‌బోర్డుతో చెక్‌

ట్రా'ఫికర్‌'కు డ్యాష్‌బోర్డుతో చెక్‌

♦ గూగుల్‌ ఇండియా సంస్థ సహకారం     
♦ 15 నిమిషాల్లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం  


బెంగళూరు:
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన బెంగళూరులో రోడ్లపైకి వాహనాలు పోటెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రతీరోజు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విపరీతంగా చోటుచేసుకుంటున్న ట్రాఫిక్‌జామ్‌లు పద్మవ్యూహాన్ని తలపిస్తూ ప్రజలకు నరకప్రాయమవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు చోటుచేసుకుంటుండడంతో ట్రాఫిక్‌ పోలీసులకు కూడా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి తలకు మించిన భారమవుతోంది.  సమస్యను పరిష్కరించడంలో భాగంగా నగర పోలీసులు డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకు గూగుల్‌ఇండియా సంస్థ సహకారం అందిస్తోంది. ఈ డ్యాష్‌ బోర్డు ద్వారా నగరంలోని 45 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల సరిహద్దులు, రోడ్లు, సిగ్నల్స్, ముఖ్యమైన జంక్షన్ల పేర్లతో పాటు ఆ ప్రాంతాల్లోని వాహనరద్దీని కూడా తెలుసుకోవచ్చు.


ఆయా ప్రాంతాల్లోని  రోడ్లపై ఏర్పడ్డ ట్రాఫిక్‌ జామ్‌లతో పాటు ఖాళీగా ఉన్న రోడ్ల వివరాల గురించి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల దీపాల ద్వారా ట్రాఫిక్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ట్రాఫిక్‌పోలీసులు తమ స్మార్ట్‌ఫోన్లలో డ్యాష్‌బోర్డ్‌ను  ఇన్స్టాల్‌ చేసుకోవడం ద్వారా ట్రాఫిక్‌ రద్దీ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్‌ నిర్వహణ కేంద్రం (టీఎంసీ) లోని సిబ్బంది కూడా డ్యాష్‌బోర్డ్‌ ద్వారా ట్రాఫిక్‌ రద్దీ సమాచారాన్ని మానిటరింగ్‌ చేస్తూ ట్రాఫిక్‌జామ్‌ చోటు చేసుకున్న ప్రాంత వివరాలను ఆ ప్రాంతానికి చెందిన ట్రాఫిక్‌ విభాగపు కానిస్టేబుల్‌ నుంచి డీసీపీ స్థాయి వరకూ చేరుతుంది. దీంతో సమస్యను త్వరగా పరిష్కరించడానికి వీలువుందని పోలీసులు భావిస్తున్నారు.  ఈ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్‌ సమస్య తీవ్రతను అనుసరించి ఏఏ అధికారి సదరు ప్రాంతానికి వెళ్లాలన్న విషయంపై కూడా నిబంధనలను పోలీసు శాఖ ఇప్పటికే రూపొందించింది. దీనిపై ఇక ట్రాఫిక్‌జామ్‌కు సంబంధించిన సమాచారం రాగానే ఆ ప్రాంతానికి చెందిన ఇన్స్పెక్టర్‌ 15నిమిషాల్లో అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌జామ్‌ సమస్య 30నిమిషాలకు పైగా చోటుచేసుకుంటే ఏసీపీ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. 45నిమిషాలు లేదా గంట పాటు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కాకుంటే ట్రాఫిక్‌ డీసీపీతో పాటు ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌కమీషనర్‌ స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి చర్యలు తీసుకుంటారు.
 
సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు 
‘డ్యాష్‌బోర్డ్‌’ ద్వారా ట్రాఫిక్‌ జామ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. ట్రాఫిక్‌జామ్‌కు సంబంధించిన వివరాలు తెలియగానే ఆ ప్రాంతానికి చేరుకొని సిగ్నలింగ్‌తో పాటు వాహనదారులకు ఖాళీగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను సూచించడం ద్వారా ట్రాఫిక్‌జామ్‌ను క్లియర్‌ చేయడానికి సులభతరమవుతుంది’.
–ఆర్‌.హితేంద్ర, నగర ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమీషనర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement