హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఇంటర్నెట్‌లో స్థానిక భాషల హవా నడుస్తోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ వంటి దేశీయ భాషల్లో కంటెంట్‌ను వాడుతున్న వినియోగదార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో భారత్‌లో నెటిజన్ల సంఖ్య అంచనాలను మించి దూసుకెళుతోందని గూగుల్ వెల్లడించింది.
దేశీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్న యూజర్లు ప్రస్తుతం 23.4 కోట్లకుపైమాటే. ఏటా వీరి వృద్ధి రేటు 18 శాతముంది. 2021 నాటికి వీరి సంఖ్య 53.6 కోట్లను దాటనుందని గూగుల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ షాలినీ గిరీష్ బుధవారమిక్కడ తెలిపారు. అదే ఇంగ్లిషు కంటెంట్‌ను వాడుతున్న యూజర్ల సంఖ్య 17.5 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ సంఖ్య మూడేళ్లలో 19.9 కోట్లకు చేరనుంది.
ఏడాదిన్నరలో పెను మార్పు..
దేశీయ ఇంటర్నెట్ రంగంలో గత 18–20 నెలల్లో కనీవినీ ఎరుగనంత మార్పు చూస్తున్నామని గూగుల్ ఆగ్నేయాసియా, భారత్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అన్నారు. ‘టెలికం కంపెనీలు డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 40 కోట్లను దాటింది. ఇప్పుడు నెలకు 80 లక్షల నుంచి ఒక కోటి మంది కొత్త యూజర్లు చేరుతున్నారు. ఈ స్థాయి వృద్ధి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు.
కొత్త యూజర్లలో 10 మందిలో తొమ్మిది మంది స్థానిక భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్నారు. 28 శాతం మంది వాయిస్ సెర్చ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం యూట్యూబ్‌లో 10 లక్షల సబ్‌స్క్రైబర్లున్న తెలుగు క్రియేటర్ ఒకటి మాత్రమే. ఇప్పుడు ఈ స్థాయి తెలుగు క్రియేటర్ల సంఖ్య 25కు చేరుకుంది. ఇంటర్నెట్‌ను అందరికీ చేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. గూగుల్ ఉత్పాదనలను స్థానిక భాషల్లో అందుబాటులోకి తెస్తున్నాం’ అని చెప్పారు.
రెండో స్థానంలో తెలుగు..
ఇంటర్నెట్ సెర్చెస్ మూడింట రెండు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని షాలినీ గిరీష్ వెల్లడించారు. ‘తెలుగు సెర్చెస్ రెండు రెట్ల వేగంతో పెరుగుతున్నాయి. స్థానిక భాషల్లో వినియోగదార్ల పరంగా తెలుగు రెండో స్థానంలో ఉంది. లోకల్ లాంగ్వేజ్‌లో ఉన్న కంటెంట్‌ను 68 శాతం మంది యూజర్లు విశ్వసిస్తున్నారు.
డిజిటల్ ప్రకటనల రంగం భారత్‌లో 2021 నాటికి సుమారు రూ.29,500 కోట్లకు చేరనుంది. ప్రస్తుతం ఇది రూ.13,400 కోట్లు ఉంది. స్థానిక భాషల ప్రకటనల వ్యాపారం వాటా ప్రస్తుతమున్న 5 శాతం నుంచి మూడేళ్లలో 35 శాతానికి చేరడం ఖాయం’ అని వివరించారు.
తెలుగు ప్రకటనలకు మద్దతు..
దేశీయ భాషల్లో కంటెంట్‌కు డిమాండ్ అధికం అవుతున్న నేపథ్యంలో గూగుల్ ప్రకటనల ఉత్పాదనలైన యాడ్‌వర్డ్స్, యాడ్‌సెన్స్ సాంకేతిక సౌలభ్యాన్ని తెలుగు భాషలోని ప్రకటనలకూ విస్తరించింది. దీంతో మరిన్ని తెలుగు ప్రకటనలు ఇక నుంచి దర్శనమీయనున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ప్రకటనకర్తలు మరింత మంది తెలుగు యూజర్లకు చేరువ అవుతారు. కంటెంట్ డెవలపర్లు, పబ్లిషర్లకు డిజిటల్ యాడ్స్ రంగంలో మెరుగైన వ్యాపార అవకాశాలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు హిందీ, బెంగాళీ, తమిళం భాషలకు మాత్రమే ఈ సాంకేతిక సౌలభ్యం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment