
సాక్షి,తిరుపతి: తిరుపతిలో ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకుపైగా వ్యాసాలను కలిగి ఉండడం విశేషం.
సదస్సు సందర్భంగా "తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు", "సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల", "వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు" వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అదనంగా, "తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి" అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో వికీపీడియా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంచి ప్రజలకు వికీపీడియాపై అవగాహన కల్పించారు.
"తెలుగు వికీపీడియా బడి" పేరుతో త్వరలో ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా వికీపీడియాలో భాగస్వాములు కావచ్చని తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకుడిగా యర్రా రామారావు సత్కారం పొందారు. వికీ పునస్కార గ్రహీతల్లో ఎన్.ఆర్. గుళ్ళపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, స్వరలాసిక, టి. సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ. మహేష్, బి.కె. విశ్వనాధ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment