అంతర్జాలం.. అద్భుత మాయాజాలం..
అంతర్జాలం.. అద్భుత మాయాజాలం..
Published Wed, Jan 11 2017 10:16 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
అందులో ఉన్నదంతా ప్రామాణికం అనుకోవద్దు
సాహిత్యపీఠంలో అంతర్జాలంలో తెలుగు సాహిత్యంపై జాతీయ సదస్సు
వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ప్రముఖులు
రాజమహేంద్రవరం కల్చరల్ : అంతర్జాలం అద్భుతాలను సృష్టించడం నిజమే.. కానీ అందులో ఉన్నదంతా పూర్తిగా ప్రామాణికం కాదని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అన్నారు. బుధవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు సాహిత్యపీఠం, మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రింట్ జర్నలిజం, ఎలక్ట్రానిక్ జర్నలిజం, వెబ్ జర్నలిజంల నుంచి సెల్ జర్నలిజంలోకి వెళుతున్నామని, అరచేతిలోకి సాహిత్యం, సమాచారం అందుబాటులోకి వచ్చే యుగంలో ఉన్నామని అన్నారు. కాలంతో నడవడం విశేషం కాదని, కాలం కన్నా ఒక అడుగు ముందు నడుద్దామని సత్యనారాయణ అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా భాషను ఆధునికీకరించుకోవాలని, లేకపోతే భాష మనుగడ సాగించదన్నారు. తమిళులు ఎయిర్ హోస్టెస్ అనే పదాన్ని గగన సఖి అని మార్చుకున్నారని, ఫైల్స్ పదానికి దస్త్రాలు, ఇంటర్నెట్‌ను అంతర్జాలమని ఇలా పారితోషిక పదాలు మనకు తెలుగులో లేకపోలేదని, మనకు సత్తా ఉన్నా సంకల్పమే లేదన్నారు. భాష అనేది కేవలం భావవ్యక్తీకరణ సాధన మాత్రమే కాదు, ఒక జాతి నాగరికత, సంస్కృతి, జాతి సాహిత్యం, జీవన విధానమని ఆయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ నేతలు పెరిగిపోతున్నారు, దాతలు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాలం ప్రభావంతో ప్రపంచం చిన్న గ్రామంగా మారిపోయిందన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ పుట్ల హేమలత మాట్లాడుతూ అంతర్జాలంలో సాహిత్యం మరింతగా వికసించాలని కోరారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి జి.యోహాన్‌బాబు మాట్లాడుతూ అంతర్జాలంలో సాహిత్య వికాసానికి మరిన్ని కొత్త మార్గాలు తెరుచుకోవాలని కోరారు. రోటేరియన్ పట్టపగలు వెంకట రావు మాట్లాడుతూ సాహిత్యపీఠానికి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పరిశోధకురాలు ఎండ్లూరి మానస స్వాగత వచనాలు పలికారు. మరో పరిశోధకురాలు రాచర్లగౌతమి వందన సమర్పణ చేశారు. ఆద్యంతం ప్రారంభ సదస్సు వక్తల ఛలోక్తులతో నడిచింది.
Advertisement
Advertisement