ఇండియా బాడ్మింటన్ సెన్సేషన్... రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ లో రజత పతకాన్ని సాధించిన సింధు... 'మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ అథ్లెట్' గా గూగుల్ సెర్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. 58 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ రెండో స్థానంలో ఉన్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నోజోమీ ఒకుహారాను ఓడించి ఫైనల్స్ కు చేరుకున్న పీవీ సింధును భారత్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. సింధు తర్వాతి స్థానంలో సాక్షి మాలిక్ ఉండగా... అగ్రశోధనల్లో కిదాంబి శ్రీకాంత్, వినేష్ పోగట్ కూడా ఉన్నట్లు తెలిపింది. అలాగే ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో పోటీచేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ కూడా టాప్ సెర్చ్ జాబితాలో ఒకరిగా నిలిచింది. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, లలితా బాబర్, వికాస్ కృష్ణన్ లు గూగుల్ టాప్ సెర్స్ లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాల్యాండ్ లతోపాటు గోవా, పుదుచ్ఛేరి, హర్యానా, ఉత్తరాఖండ్ లు టాప్ 10 సెర్స్ ప్రాంతాలుగా గుర్తించిన గూగుల్.. ఒలింపిక్స్ పై సెర్స్ చేసిన దేశాల్లో భారత్ 11వ స్థానంలో నిలిచినట్లు గూగుల్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
రియో ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంలో భారతీయులు ఎక్కువగా బాడ్మింటన్ గురించి, రెజ్లింగ్ గురించి వెతికారని కూడా గూగుల్ తెలిపింది. అయితే వీరితోపాటు.. ఇటీవల రియోలో గోల్డ్ మెడల్ సాధించిన, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసైన్ బోల్ట్ గురించి కూడా ఇండియాలో అత్యధిక జనాభా వెతికినట్లు వెల్లడించింది. విదేశీ క్రీడాకారుల్లో బోల్ట్ తర్వాత చైనా షట్లర్ లిన్ డాన్, ఒకుహారా, స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్ ల గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తన ప్రకటనలో తెలిపింది.
'మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ అథ్లెట్' గా సింధు..!
Published Sat, Aug 20 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement