న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున ఎస్‌ఎంఎస్‌లు పంపిణీ చేయడం ద్వారా ఐదు స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లలో మ్యానిపులేషన్‌కు పాల్పడినందుకు 135 సంస్థలపై సెబీ చర్యలు తీసుకుంది. అడ్డంగా సంపాదించినందుకు రూ.126 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సెక్యూరిటీస్ మార్కెట్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, 7ఎన్‌ఆర్ రిటైల్ లిమిటెడ్, డార్జిలింగ్ రోప్‌వే కంపెనీ లిమిటెడ్, జీబీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విషాల్ ఫ్యాబ్రిక్స్ షేర్లను కొనుగోలు చేయాలంటూ ఆయా సంస్థలు ఇన్వెస్టర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించినట్టు సెబీ గుర్తించింది.
మూడు పెద్ద బృందాలు కలసికట్టుగా ఈ ముందస్తు పథకాన్ని నడిపించినట్టు పేర్కొంది. ‘‘ఈ పథకంలో భాగంగా ముందు ఆయా షేర్ల ధరలను పెంచుతూ వెళ్లారు. మానిపులేటివ్ ట్రేడ్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. షేరు ధర పెరుగుతుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంది. ధరలను పెంచిన తర్వాత బై కాల్స్ ను ప్రసారం చేశారు. హనీఫ్ షేక్ అనే వ్యక్తి సూత్రధారిగా దీన్ని నడిపించాడు. బై కాల్స్ చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు రావడంతో వీరు తమవద్దనున్న షేర్లను అధిక ధరల వద్ద అమ్ముకుని బయటపడ్డారు. తద్వారా భారీ లాభాలను ఆర్జించారు’’అని సెబీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment