పేరుకు స్మాల్‌ క్యాప్‌..మిడ్‌ క్యాప్‌ సంస్థల్లో పెట్టుబడెందుకు? | why small cap funds invest in mid cap companies | Sakshi
Sakshi News home page

పేరుకు స్మాల్‌ క్యాప్‌..మిడ్‌ క్యాప్‌ సంస్థల్లో పెట్టుబడెందుకు?

Published Mon, Oct 7 2024 9:04 AM | Last Updated on Mon, Oct 7 2024 12:30 PM

why small cap funds invest in mid cap companies

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎందుకు కేటాయింపులు చేస్తుంటాయి? – వంశీ గౌడ్‌

నిజానికి స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ పెట్టుబడులు అన్నింటినీ స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లోనే పెట్టేయవు. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధమైనది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు పెట్టుబడుల పరంగా కొంత వెసులుబాటు కల్పించింది. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది. మిగిలిన 35 శాతాన్ని ఏ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయాలన్నది పూర్తిగా ఫండ్‌ మేనేజర్‌ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా ఈ 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌లో ఏ విభాగానికి కేటాయించాలన్నది ఫండ్‌ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఆటుపోట్లు ఎక్కువ. లిక్విడిటీ సమస్యలు కూడా ఉంటాయి. అందుకని పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఇతర మార్కెట్‌ క్యాప్‌ విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌లను అధిగమించొచ్చు.

28 స్మాల్‌క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్స్‌ను గమనిస్తే.. అవి తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 82 శాతాన్ని స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు, 13 శాతాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించాయి. కేవలం ఆరు పథకాలే మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 15 శాతానికి మించి పెట్టుబడులు కేటాయించాయి. వాటి పనితీరు మిశ్రమంగా ఉంది. మూడు పథకాలు నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250కి మించి పనితీరు చూపించాయి. మరో మూడు బెంచ్‌ మార్క్‌ పనితీరు స్థాయిలో రాబడులు అందించాయి. కేవలం జేఎం స్మాల్‌ క్యాప్‌ ఫండ్, టాటా స్మాల్‌క్యాప్, ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్, డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ పథకాలే 90 శాతానికి పైగా స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి.

ఇదీ చదవండి: అక్టోబర్‌ నుంచి అమలవుతున్న ఆరు మార్పులు ఇవే..

నా వద్ద రూ.35 లక్షలు ఉన్నాయి. 8 నుంచి 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏడు పథకాల పరిధిలో ఇన్వెస్ట్‌ చేయాలన్నది నా యోచన. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్‌కు ఇది మంచి వ్యూహమే అవుతుందా? – జయదేవ్‌

రూ.35 లక్షల పెట్టుబడులను 8–10 ఏళ్ల కాలానికి, వివిధ పథకాల పరిధిలో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, ఏడు పథకాల పరిధిలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది పెద్దగా ఫలితం ఇవ్వదు. దీనికి బదులు మొత్తం పథకాల సంఖ్యను ఐదుకు తగ్గించుకోవడాన్ని పరిశీలించండి. అప్పుడు ఒక్కో పథకానికి 20 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. కొన్ని పథకాలపైనే దృష్టి సారించడం వల్ల వాటికి అర్థవంతంగా కేటాయింపులు చేసుకోవడానికి వీలుంటుంది. ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల వాటి పనితీరును ఎప్పటికప్పుడు సులభంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే సర్దుబాట్లు చేసుకోవచ్చు. పెట్టుబడులను ఎక్కువ పథకాల మధ్య విస్తరించడం వల్ల అది సంతృప్తిని ఇవ్వొచ్చు. కానీ, విడిగా ఒక్కో పథకానికి తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యపడకపోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement