అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి! | Two women learned they were switched at birth after more than 50 years | Sakshi
Sakshi News home page

అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!

Published Mon, Nov 4 2024 6:02 AM | Last Updated on Mon, Nov 4 2024 3:10 PM

Two women learned they were switched at birth after more than 50 years

సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్లో టాకాఫ్‌ ద టౌన్‌గా మారిందిప్పుడు. 

డీఎన్‌ఏ కిట్‌తో... 
2021 క్రిస్మస్‌. లండన్‌లోని వెస్ట్‌ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్‌ఏ హోమ్‌ టెస్టింగ్‌ కిట్‌ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్‌ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్‌ కోసం తన శాంపిల్‌ను డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా రిజల్ట్‌ మెయిల్‌ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్‌ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. 

తామిద్దరి డీఎన్‌ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్‌ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్‌ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్‌ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్‌ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్‌ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్‌ కూడా పుట్టిందని తేలింది. 

ఏం జరిగిందంటే... 
జోన్‌ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్‌ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్‌ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. 

ఇద్దరూ నా కూతుళ్లే 
ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్‌ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్‌ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్‌ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. 

న్యాయపరమైన చిక్కులు..  
తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్‌ సరి్టఫికెట్‌ మొదలుకుని పాస్‌పోర్ట్‌ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్‌హెచ్‌ఎస్‌)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement