12 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గిన మొండిబాకీలు
జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ వెల్లడి
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉందని జూన్ నెలకు సంబంధించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో (ఎఫ్‌ఎస్‌ఆర్) రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో (ఎస్‌సీబీ) స్థూల మొండి బాకీల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 12 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి, నికర ఎన్‌పీఏల నిష్పత్తి 0.6 శాతానికి తగ్గినట్లు వివరించింది. జీఎన్‌పీఏలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2.5 శాతానికి తగ్గగలవని వివరించింది.
క్రెడిట్ రిసు్కలకు సంబంధించి స్థూల స్ట్రెస్ టెస్టుల్లో ఎస్‌సీబీలు కనీస మూలధన అవసరాలను పాటించగలిగే స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడైందని నివేదిక పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) సంబంధించి జీఎన్‌పీఏ నిష్పత్తి 4 శాతంగాను, రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌వోఏ) 3.3 శాతంగాను ఉన్నట్లు తెలిపింది.
భౌగోళిక–రాజకీయ ఆందోళనలు, ప్రభుత్వాలపై భారీ రుణభారాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా పురోగతి మందకొడిగా సాగుతుండటం వంటి అంశాల రూపంలో అంతర్జాతీయ ఎకానమీకి సవాళ్లు పెరిగాయని వివరించింది. సవాళ్లున్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని నివేదిక తెలిపింది.
గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి..
ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా నిలదొక్కుకునేలా అసెట్ క్వాలిటీ, పటిష్టత మెరుగుపడినట్లుగా అధ్యయనాలు చూపిస్తున్న నేపథ్యంలో గవర్నెన్స్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టాలంటూ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
ప్రస్తుతానికి ఆర్థిక స్థిరత్వం పటిష్టంగానే ఉందని, అయితే దాన్ని అలాగే కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపర్చుకోవడమనేది నిజమైన సవాలుగా ఉండగలదని ఎఫ్‌ఎస్‌ఆర్ నివేదిక ముందుమాటలో ఆయన పేర్కొన్నారు. సైబర్ ముప్పులు, పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలు మొదలైన వాటన్నింటినీ ఆర్‌బీఐ పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. టెక్నాలజీపై బ్యాంకులు తగినంత స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.
నివేదికలోని మరిన్ని అంశాలు..
బ్యాంక్ గ్రూపుల వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) 2023–24 ప్రథమార్ధంలో జీఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా 76 శాతం మేర తగ్గింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) మెరుగుపడింది.
అర్థ సంవత్సరంలో కొత్త ఎన్‌పీఏలు కూడా వివిధ బ్యాంకు గ్రూపుల్లో తగ్గాయి. పూర్తి సంవత్సరంలో మొండి బాకీల రైటాఫ్‌లు దిగివచి్చనప్పటికీ రైటాఫ్ నిష్పత్తి మాత్రం క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది.
2023–24 ద్వితీయార్ధంలో పీఎస్‌బీలు, ఫారిన్ బ్యాంకుల్లో రుణాల మంజూరు పెరగ్గా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కాస్త నెమ్మదించింది.
మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో సర్వీ సుల రంగానికి ఇచ్చిన రుణాలు, వ్యక్తిగత రుణాల వాటా పెరిగింది. ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధిలో వ్యక్తిగత రుణాల వాటా సగానికి పైగా ఉంది.
ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) వాల్యూమ్స్ గణనీయంగా పెరగడమనేది రిటైల్ ఇన్వెస్టర్లకు సవాలుగా మారొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు సరైన రిస్కు మేనేజ్‌మెంట్ విధానాలను పాటించకపోతుండటమే ఇందుకు కారణం. కాబట్టి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కీలకం. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో 2022–23లో 65 లక్షలుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2023–24లో ఏకంగా 95.7 లక్షలకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment