FSR
-
పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉందని జూన్ నెలకు సంబంధించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో (ఎఫ్ఎస్ఆర్) రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో (ఎస్సీబీ) స్థూల మొండి బాకీల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 12 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.6 శాతానికి తగ్గినట్లు వివరించింది. జీఎన్‌పీఏలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2.5 శాతానికి తగ్గగలవని వివరించింది.క్రెడిట్ రిసు్కలకు సంబంధించి స్థూల స్ట్రెస్ టెస్టుల్లో ఎస్సీబీలు కనీస మూలధన అవసరాలను పాటించగలిగే స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడైందని నివేదిక పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి జీఎన్‌పీఏ నిష్పత్తి 4 శాతంగాను, రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 3.3 శాతంగాను ఉన్నట్లు తెలిపింది.భౌగోళిక–రాజకీయ ఆందోళనలు, ప్రభుత్వాలపై భారీ రుణభారాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా పురోగతి మందకొడిగా సాగుతుండటం వంటి అంశాల రూపంలో అంతర్జాతీయ ఎకానమీకి సవాళ్లు పెరిగాయని వివరించింది. సవాళ్లున్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని నివేదిక తెలిపింది.గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి.. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా నిలదొక్కుకునేలా అసెట్ క్వాలిటీ, పటిష్టత మెరుగుపడినట్లుగా అధ్యయనాలు చూపిస్తున్న నేపథ్యంలో గవర్నెన్స్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టాలంటూ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.ప్రస్తుతానికి ఆర్థిక స్థిరత్వం పటిష్టంగానే ఉందని, అయితే దాన్ని అలాగే కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపర్చుకోవడమనేది నిజమైన సవాలుగా ఉండగలదని ఎఫ్ఎస్ఆర్ నివేదిక ముందుమాటలో ఆయన పేర్కొన్నారు. సైబర్ ముప్పులు, పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలు మొదలైన వాటన్నింటినీ ఆర్బీఐ పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. టెక్నాలజీపై బ్యాంకులు తగినంత స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.నివేదికలోని మరిన్ని అంశాలు..బ్యాంక్ గ్రూపుల వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 2023–24 ప్రథమార్ధంలో జీఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా 76 శాతం మేర తగ్గింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) మెరుగుపడింది.అర్థ సంవత్సరంలో కొత్త ఎన్పీఏలు కూడా వివిధ బ్యాంకు గ్రూపుల్లో తగ్గాయి. పూర్తి సంవత్సరంలో మొండి బాకీల రైటాఫ్‌లు దిగివచి్చనప్పటికీ రైటాఫ్ నిష్పత్తి మాత్రం క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది.2023–24 ద్వితీయార్ధంలో పీఎస్‌బీలు, ఫారిన్ బ్యాంకుల్లో రుణాల మంజూరు పెరగ్గా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కాస్త నెమ్మదించింది.మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో సర్వీ సుల రంగానికి ఇచ్చిన రుణాలు, వ్యక్తిగత రుణాల వాటా పెరిగింది. ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధిలో వ్యక్తిగత రుణాల వాటా సగానికి పైగా ఉంది.ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) వాల్యూమ్స్ గణనీయంగా పెరగడమనేది రిటైల్ ఇన్వెస్టర్లకు సవాలుగా మారొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు సరైన రిస్కు మేనేజ్మెంట్ విధానాలను పాటించకపోతుండటమే ఇందుకు కారణం. కాబట్టి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కీలకం. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో 2022–23లో 65 లక్షలుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2023–24లో ఏకంగా 95.7 లక్షలకు పెరిగింది. -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్‌పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్‌పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్‌కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
ఎలాంటి సవాళ్లకైనా రెడీ!
దీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉంది.. ♦ ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక ♦ ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ఎన్పీఏలపై భయం అక్కర్లేదని భరోసా ముంబై: వర్థమాన దేశాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కటి పనితీరు ప్రదర్శిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, బ్యాంకింగ్ రంగ సమస్యలు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థకు వీటిని తట్టుకుని నిలబడే సత్తా ఉందనీ వివరించింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం నివేదికను విడుదల చేశారు. నివేదికలో రాజన్ తొలి వాక్యం రాస్తూ... రుణ వృద్ధి వేగానికి తొలుత బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు... ⇔ వర్థమాన దేశాల్లో భారత్ వృద్ధి తీరు బాగుంది. భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. ⇔ కమోడిటీ ముఖ్యంగా చమురు ధరలు తక్కువగా ఉండటం సానుకూల అంశం. ఇందుకు సంబంధించి జీ-20 దేశాల్లో అత్యధిక వాణిజ్య ప్రయోజనాలను పొందిన దేశం భారత్ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేసింది. ⇔ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధికి భారీగా పెట్టుబడులు పెరగడం, వినియోగ వృద్ధి అవసరం. ⇔ తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు (363.83 బిలియన్ డాలర్లు), తక్కువ స్థాయి వాణిజ్యలోటు అంతర్జాతీయంగా భారత్‌కు లాభదాయక అంశాలు. ⇔ రెవెన్యూ లోటును తగ్గించుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా ఈ విభాగంలో హేతుబద్ధీకరణకూ కృషి కొనసాగుతోంది. అయితే పన్ను ఆదాయాలు మరింత పెరగాలి. ఇందుకు ట్యాక్స్ బేస్ మరింత విస్తృతం కావాల్సి ఉంది. ⇔ 2016 మార్చిలో 7.6 శాతంగా ఉన్న ఎన్పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 8.5% నుంచి 9.3 శాతం శ్రేణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. 2015లో ఎన్పీఏలు 5.1 శాతం. ⇔ 2015-16 మధ్య కార్పొరేట్ల ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రుణ ఒత్తిడిలో ఉన్న కంపెనీల రేటు మార్చి 2015లో 19 శాతంకాగా 2016 మార్చిలో ఈ రేటు 14 శాతానికి తగ్గింది. ⇔ జూన్ 7న రేటు నిర్ణయానికి మెజారిటీనే ప్రాతిపదిక! జూన్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను యథాతథంగా 6.50 వద్దే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఏకాభిప్రాయం ప్రాతిపదికన తీసుకున్నారు. మంగళవారంనాడు ఇందుకు సంబంధించి మినిట్స్ అంశాలు వెల్లడయ్యాయి. ఐదుగురు సభ్యుల కమిటీలో ముగ్గురు రేటు కోతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు, ముందు ద్రవ్యోల్బణం 5% స్థాయికి రావాలని, అటు తర్వాతే రేటు కోత సమంజసమని పేర్కొన్నారు. అప్పటికి మరో వారం రోజుల్లో వెలువడనున్న అమెరికా ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయానికి వేచి చూడాలనీ వారు సూచించారు. కాగా మరో ఇరువురు సభ్యులు మాత్రం పాలసీ రేటును పావుశాతం తగ్గించాలని సూచించారు. మే 24-30 తేదీల మధ్య ఆన్లైన్ ద్వారా టీఏసీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రస్తుత విధానం ప్రకారం... వీరి అభిప్రాయాలతో పనిలేకుండా ఆర్బీఐ గవర్నర్ రెపో రేటు నిర్ణయం తీసుకునే వీలుంది. ఎన్పీఏల సమస్య పరిష్కారం కీలకం: రాజన్ మొండిబకాయిల పరిష్కారం తక్షణం కీలకాంశమని నివేదిక తొలి వాక్యంలో రాజన్ పేర్కొన్నారు. పటిష్ట దేశీయ విధానాలు, సంస్కరణలు ఇందుకు అవసరమని అన్నారు. కార్పొరేట్ రంగంలో ఉన్న ఒత్తిడికి బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు ప్రతిబింబమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వ్యాపార నిర్వహణకు ఉన్న పలు అడ్డంకుల పరిష్కారం దిశలో సంస్కరణలు మొండిబకాయిల సమస్య పరిష్కారానికీ దోహదపడతాయని వివరించారు. అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే పరిస్థితి ఉన్నా... దేశీయంగా వ్యవస్థీకృత సంస్కరణల అమలూ వృద్ధి పటిష్టతకు కీలకమని వివరించారు. అలాగే ఆర్బీఐ విధాన రుణ రేటు ప్రయోజనం బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించే వెసులుబాటు కల్పించేలా చర్యలు అవసరమన్నారు.