బ్యాంకులపై ‘మొండి’బండ! | RBI Financial stability report I Bank gross NPAs may rise to 14 percent | Sakshi
Sakshi News home page

బ్యాంకులపై ‘మొండి’బండ!

Published Sat, Jul 25 2020 5:20 AM | Last Updated on Sat, Jul 25 2020 5:31 AM

RBI Financial stability report I Bank gross NPAs may rise to 14 percent - Sakshi

ముంబై: భారత్‌ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల (ఎస్‌సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ  రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్‌ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్‌బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...

► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్‌ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి.  

► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్‌పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం.  

► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్‌పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం.  

► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు.

► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి
పెరగవచ్చు.

► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి  (క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో –సీఆర్‌ఏఆర్‌) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు  పూర్తిగా విఫలం కావచ్చు.  

► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్‌ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు.  

► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్‌ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది.  

► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది.  ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం.  


భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్‌ దాస్‌
కోవిడ్‌–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్‌  రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు...  ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్‌ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ  స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం.

బ్యాంకింగ్‌ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్‌డౌన్‌ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి.  ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్‌
ఆర్‌బీఐ గవర్నర్‌ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్‌లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్‌ పటేల్‌ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్‌ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్‌కు సూచిస్తూ ఆర్‌బీఐ జారీ చేసిన  2018 ఫిబ్రవరి సర్క్యులర్‌ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement