Stubborn dues
-
నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి
ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు యస్ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్ చెల్లించనుంది. ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్ ప్రకారం ఏఆర్‌సీలో యస్ బ్యాంక్ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. -
కేఎస్కే మహానది ఖాతా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) మొండిబకాయి(ఎన్పీఏ)గా మారిన కేఎస్కే మహానది పవర్ కంపెనీ రుణ ఖాతాను విక్రయించింది. ఆదిత్య బిర్లా ఏఆర్సీకి రూ. 1,622 కోట్లకు ఖాతాను బదిలీ చేసింది. ఈ(2022) ఏప్రిల్‌కల్లా కేఎస్కే మహానది చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 3,815 కోట్లుకాగా.. 58 శాతం కోత(హెయిర్‌కట్)తో ఖాతాను ఏఆర్సీకి ఎస్బీఐ విక్రయించింది. కేఎస్కే మహానది పవర్ ఎన్పీఏ ఖాతాను ఎస్బీఐ నగదు ప్రాతిపదికగా ఈవేలం నిర్వహించింది. ఇందుకు రూ. 1,544 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. కాగా.. మొత్తం 15 ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ లభించినప్పటికీ ఏబీ ఏఆర్సీ నుంచి రూ. 1,544 కోట్లకు ఒకే బిడ్ దాఖలుకావడం గమనార్హం! స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టిన వేలం విధానంలో పోటీ బిడ్స్ దాఖలుకానప్పటికీ తదుపరి చర్చలతో బిడ్‌ను రూ. 1,622 కోట్లకు ఏబీ ఏఆర్సీ సవరించింది. ఇందుకు తగిన అనుమతులు పొందాక ఈ నెల 12న ఎస్బీఐ విక్రయాన్ని పూర్తి చేసింది. 2009లో ఏర్పాటైన కేఎస్కే మహానది పవర్ రెండేళ్లుగా కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. -
మొండి బకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారం, రుణ వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థికశాఖ కీలక వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, ఇతర కీలక కార్యక్రమాల వల్ల ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. దీనితో సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ ఖరాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు, బ్యాంకుల ఎండీ, సీఈఓలు పాల్గొన్న ఈ సమావేశం వివిధ ప్రభుత్వ పథకాలపై బ్యాంకుల పనితీరు, పురోగతిపై చర్చించింది. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పథకాలపై సమావేశం చర్చించింది. బ్యాంకింగ్‌కు అవసరమైన మూలధన సమకూర్చడం, దేశంలో అందరికీ ఆర్థిక సేవలు వంటి అంశాలపై సమావేశం దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు సవాళ్లను తట్టుకునే సామర్థ్యం ఇదిలాఉండగా, భారత్ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, సుస్థిర ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడం, దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు వంటి కీలక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థికశాఖ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉందని కూడా నివేదిక భరోసాను ఇచ్చింది. తోటి వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది. -
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిల (ఎన్పీఏ) పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది. ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారం ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయంతో ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్ (ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది. ప్రభుత్వ గ్యారెంటీ తొలి దశలో దాదాపు రూ.31,000 కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేస్తోంది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్్ట్స’ ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. లైసెన్స్‌కు ఇప్పటికే దరఖాస్తు.. రూ.6,000 కోట్ల బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి లైసెన్స్‌కు ఐబీఏ గతవారం ఆర్బీఐని సంప్రదించింది. వచ్చే రెండు నెలల్లో ఈ లైసెన్స్ జారీ అవకాశం ఉంది. ఎన్ఏఆర్సీఎల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉందామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్‌పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్‌పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్‌కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
మార్కెట్ పంచాంగం
కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం విక్రయిస్తున్నారు. ఈ రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగితే...వీటికే సూచీల్లో అధిక వెయిటేజీ వున్నందున, మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం వుంటుంది. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... అక్టోబర్ 4తో ముగిసిన నాలుగురోజుల వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 38,923 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 37,633 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 1150 పాయింట్ల భారీ నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా 37,950 పాయింట్ల తొలి అవరోధాన్ని అధిగమించి, స్థిరపడితేనే డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుంది. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే 38,300–38,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే క్రమేపీ 38,850 పాయింట్ల వద్దకు చేరే అవకాశం వుంటుంది. ఈ వారం సెన్సెక్స్ తొలి అవరోధంపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,540 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 37,305 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 37,000 పాయింట్ల వద్దకు పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 11,260 గతవారం ప్ర«థమార్థంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,554 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన తర్వాత ... చివరిరోజున 11,158 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 337 పాయింట్ల నష్టంతో 11,175 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి తొలుత 11,260 పాయింట్ల సమీపంలో గట్టి నిరోధం ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితేనే మార్కెట్ క్షీణతకు అడ్డుకట్టపడుతుంది. అటుపైన 11,370–11,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 11,500 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 11,110 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,060 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,950 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
యూనియన్ బ్యాంక్ లాభం 30 శాతం డౌన్
ముంబై: మొండి బాకీలు, భారీ ప్రొవిజనింగ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 117 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్థులు ఏకంగా 10.16 శాతం నుంచి 12.63 శాతానికి ఎగిశాయి. నికర నిరర్థక ఆస్తులు 6.16 శాతం నుంచి 7.47 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం పెరిగినప్పటికీ మొండిబాకీలకు కేటాయింపుల వల్ల వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం క్షీణించిందని బ్యాంక్ సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రుణాల్లో మరో 4 శాతం కొత్తగా మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరో 10 ఎన్పీఏ ఖాతాలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు పంపాలని యోచిస్తున్నట్లు వివరించారు.