26,000 దిగువకు సెన్సెక్స్
వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టపోయాయి. వారం రోజుల తరువాత మళ్లీ సెన్సెక్స్ 26,000 పాయింట్ల దిగువకు చేరింది. 136 పాయింట్లు క్షీణించి 25,991 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా 25,900ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 7,749 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆయిల్ రంగాలు 3-1.5% మధ్య నీర సించాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకావడం, గురువారం ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలినుంచీ అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని నిపుణులు పేర్కొన్నారు. కాగా, వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయింది.
హెచ్‌యూఎల్ జోష్: క్యూ1 ఫలితాల కారణంగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ దాదాపు 4% పుంజుకోగా, గత మూడు వారాల్లోలేని విధంగా కోల్ ఇండియా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, హీరోమోటో, ఆర్‌ఐఎల్, ఓఎన్ జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి. రియల్టీ షేర్లలో డీఎల్‌ఎఫ్, ఫీనిక్స్, డీబీ, శోభా, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్ 5-2% మధ్య పడ్డాయి.
నేడు మార్కెట్లకు సెలవు
ముంబై: ఈదుల్ ఫితర్(రంజాన్) సందర్భంగా మంగళవారం(29న) ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలతోపాటు, ఫారెక్స్, మనీ, మెటల్, ఆయిల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్, చక్కెర మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.
నేటి బోర్డ్ మీటింగ్స్
ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ర్యాన్‌బాక్సీ, సెసాస్టెరిలైట్, ఐడీఎఫ్‌సీ, డీసీఎం శ్రీరామ్, ఎస్కార్ట్స్, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, వీగార్డ్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్.