పసిడి పెట్టుబడికి దారేదీ..? | Benefits of investing Gold ETFs or Sovereign Gold | Sakshi
Sakshi News home page

పసిడి పెట్టుబడికి దారేదీ..?

Published Mon, Nov 23 2020 5:55 AM | Last Updated on Mon, Nov 23 2020 5:55 AM

Benefits of investing Gold ETFs or Sovereign Gold - Sakshi

బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. ఆభరణాల రూపంలో మహిళలు, పెట్టుబడి రూపంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ను కొంటుంటారు. ఈమధ్య కాలంలో ఆన్‌లైన్‌లో గోల్డ్‌ కొనడమూ పెరిగింది. మరి, డిజిటల్‌ రూపంలో బంగారం కొనడం ఉత్తమమేనా? బంగారంలో పెట్టుబడి భద్రంగా ఉండాలంటే? రెట్టింపు రాబడి రావాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. రియల్‌ ఎస్టేట్, షేర్‌ మార్కెట్, మ్యూచువల్‌ ఫండ్లు, బంగారం.. ఇవీ భారతీయుల పెట్టుబడి సాధనాలు.

గోల్డ్‌లో పెట్టుబడులు అత్యంత భద్రమైనవని నిపుణులు చెబుతున్నారు. మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా బంగారాన్ని డిజిటల్‌గా కొనడం ఒక మార్గం. అయితే ఇలాంటి ఉత్పత్తుల కొనుగోళ్లు రెగ్యులేటరీ పరిధిలోకి రావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణకు సెబీ తరహాలో బంగారాన్ని విక్రయించే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షించడానికి ఎలాంటి నియంత్రణ సంస్థ లేదు. రెగ్యులేటరీ నిబంధనలు వర్తించే, సురక్షితమైన బంగారు పెట్టుబడులు ఏంటో ఓసారి చూద్దాం...

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను (ఎస్‌జీబీ)లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేస్తుంది. ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన బాండ్లను ఇస్తుంది. ఎస్‌జీబీ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. బాండ్‌ ముఖ విలువపై సంవత్సరానికి 2.5 శాతం కూపన్‌తో సార్వభౌమ హామీని కలిగి ఉంటారు. ఇది బాండ్‌ మెచ్యూరిటీ విలువ, బంగారం ధరల మీద ఆధారపడి ఉంటుంది. బంగారం రాబడిలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ క్యాపిటల్‌ అప్రిసియేషన్‌గా గుర్తింపు పొందాయి. ఈ బాండ్ల మెచ్యూరిటీ వరకు గనక ఇన్వెస్టర్‌ వెయిట్‌ చేస్తే.. వ్యక్తిగత పెట్టుబడిదారులకు మూలధన లాభాల పన్ను మినహాయించబడుతుంది. అయితే మెచ్యూరిటీ సమయం ఎనిమిది సంవత్సరాలుగా ఉంది.

ఈ బాండ్లను ఆర్‌బీఐ తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రీ–మెచ్యూర్‌ ఎగ్జిట్‌కు అనుమతించబడుతుంది. ఒకవేళ మీరు ఈ బాండ్లను ఆర్‌బీఐకి కాకుండా సెకండరీ మార్కెట్లో విక్రయించినట్లయితే మూలధన లాభాలపై 20 శాతం (ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌తో కలిపి) పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సడెన్‌గా ప్రీ–మెచ్యుర్‌ కంటే ముందే ఎగ్జిట్‌ కావాలనుకుంటే మాత్రం.. కూపన్‌ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంక్‌ లేదా బ్రోకర్‌ను సంప్రదించాలి. ఐదేళ్లు పూర్తికాకముందే పెట్టుబడిదారులు ఎస్‌జీబీలను సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. కానీ, సంబంధిత ఇన్వెస్టర్‌ మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 36 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంచినట్లయితే స్లాబ్‌ రేట్, 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌తో కలిపి 20% క్యాపిటల్‌ ట్యాక్స్‌ భరించాల్సి ఉంటుంది.


ఎస్‌జీబీలో ప్రధాన సమస్య ఏంటంటే..
ఎస్‌జీబీల విషయంలో ప్రధాన సమస్య ఏంటంటే.. సెకండరీ మార్కెట్లో కొనడం లేదా అమ్మడం అంత సులువైన అంశం కాదు. పెట్టుబడిదారుడు, బ్రోకర్‌కు ఒకే డిపాజిటరీ పార్టిసిపెంట్‌ (డీపీ)తో  డిపాజిటరీ అకౌంట్‌ ఉంటే తప్ప ఎస్‌జీబీల బదిలీ కఠినం. ఎందుకంటే ఇంటర్‌ డిపాజిటరీ బదిలీని అనుమతించని ఎస్‌జీబీలను మాత్రమే ప్రభుత్వ సెక్యూరిటీలుగా పరిగణిస్తారు కాబట్టి! ఎస్‌జీబీలలో ఇంటర్‌ డిపాజిటరీ బదిలీకి ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చినప్పటికీ.. డిపాజిటరీలు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పూర్తిగా క్రమబద్ధీకరించలేదు. రిటైల్‌ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక పన్ను విధానం ఉండగా.. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు మాత్రం ఎస్‌జీబీల ఎంట్రీ, ఎగ్జిట్‌లో ప్రతికూలతలున్నాయి.ఎస్‌జీబీలలో సెకండరీ మార్కెట్‌ ట్రేడింగ్‌ పరిమితం. కొత్త ఆఫర్లు తెరిచినప్పుడు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్‌బీఐ బైబ్యాక్‌ విండోను తెరిచినప్పుడు ఆయా బాండ్లను విక్రయించాల్సి ఉంటుంది.

గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌

మ్యూచువల్‌ ఫండ్లలోని గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌) ఈ ఏడాది రికార్డ్‌ స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీల కంటే కొంచెం తక్కువ రాబడిని ఇస్తాయి. కానీ, బంగారం మీద కాగితపు రహిత, దీర్ఘకాలిక పెట్టుబడులకు, స్నేహపూర్వక ఎంపికలకు మాత్రం ఈటీఎఫ్‌లు సరైనవి. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) జారీ చేసిన ప్రతి యూనిట్‌ ఈటీఎఫ్‌.. భౌతికంగా కొనుగోలు చేసిన బంగారానికి సమానవైన విలువను కలిగి ఉంటుంది. ఏఎంసీలను సెబీ రిజిస్టర్డ్‌ కస్టోడియన్‌ ధ్రువీకరిస్తారు. బంగారాన్ని భద్రపరిచే బాధ్యత కస్టోడియన్‌దే.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లను స్వతంత్ర ఖజానా ప్రొవైడర్‌ నిల్వ చేస్తారు. ఈయన రోజువారీ రికార్డ్‌లను నిర్వహిస్తుంటాడు. బార్‌ నంబర్, స్వచ్ఛత ధ్రువీకరణ పత్రాలతో రోజువారీ బంగారం ధరల కదలికలను ట్రాక్‌ చేస్తుంటాడు కూడా. మొబైల్‌ వాలెట్స్‌ జారీ చేసినవి కాకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇష్యూ చేసే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నెలవారీ వివరాలను సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)కి బహిర్గత పరచాల్సి ఉంటుంది. ఎంఎఫ్‌ల గోల్డ్‌ హోల్డింగ్స్‌లకు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ ఆడిట్‌ కూడా జరుగుతుంది.

ఈటీఎఫ్‌లలో టాస్క్‌ ఏంటంటే..
ఈటీఎఫ్‌ల ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీలతో పోల్చితే ఈటీఎఫ్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంఎఫ్‌లు ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజులను విధిస్తాయి. అన్ని బంగారు ఈటీఎఫ్‌లు సెకండరీ మార్కెట్లో చురుకుగా ట్రేడ్‌ కావు. అలాగే ధరలు అంతర్లీనంగా నికర ఆస్తి విలువల (ఎన్‌ఏవీ) కంటే దూరంగా ఉంటాయి. అందుకే పెట్టుబడిదారులు తమ ఎన్‌ఏవీలకు దగ్గరగా కోట్‌ చేసే ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌తో గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఎంచుకోవటం ఉత్తమం. అంతేకాకుండా ఎస్‌జీబీల మాదిరిగా కాకుండా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల మీద మూలధన లాభాల పన్ను ఉంటుంది. అది భౌతిక బంగారంపై ఎంతైతే పన్ను విధించబడుతుందో అంతే ఉంటుంది.

గోల్డ్‌ ఫ్యూచర్స్‌...
ఇండియాలో అతిపెద్ద సెక్యూరిటీస్‌ అండ్‌ కమొడిటీస్‌ ఎక్స్‌ఛేంజ్‌ కంపెనీ మల్టి కమొడిటీ ఎక్స్‌ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌) తీసుకొచ్చిన గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షనే గోల్డ్‌ ఫ్యూచర్స్‌. ఎంసీఎక్స్‌లో ఒక గ్రాము విలువ నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఎంసీఎక్స్‌ సెబీ నియంత్రణలో ఉంటుంది. గోల్డ్‌ పెటల్‌ అనేది బాగా సక్సెస్‌ అయిన రిటైల్‌ గోల్డ్‌ ఇన్వెస్టర్‌ కాంట్రాక్ట్‌. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్‌), లిక్విడ్‌ ఆర్డర్‌ బుక్‌ చేసే వీలుండటమే రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణాలని ఎంసీఎక్స్‌ హెడ్‌ శివాన్షు మెహతా చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో గోల్డ్‌ పెటల్‌ ప్రారంభమైంది. 2019–20లో గోల్డ్‌ పెటల్‌ కాంట్రాక్ట్‌లో సగటు రోజువారీ టర్నోవర్‌ రూ.10,163 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇది అత్యధికంగా రూ.54,415 కోట్లుగా ఉంది.

ఇతర రకాల గోల్డ్‌ పెట్టుబడులతో పోలిస్తే.. గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. పెట్టుబడిదారులు బంగారం విలువ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్‌ విలువలో ఆరు శాతం మార్జిన్‌ను చెల్లించవచ్చు. లేదా పూర్తి విలువను చెల్లించవచ్చు. కాకపోతే మీరు బంగారాన్ని కూడబెట్టుకోవాలనుకున్నా లేదా డెలివరీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒప్పంద గడువు ముగిసే సమయానికి పూర్తి విలువను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్‌ ధర, అస్థిరతను బట్టి అదనపు మార్జిన్లను వసూలు చేయవచ్చు. గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో వచ్చే ఆదాయాన్ని కమొడిటీస్‌ ఇన్‌కమ్‌తో కలుపుతారు. దీనికి స్లాబ్‌ రేట్‌ను బట్టి పన్ను విధించబడుతుంది.

బంగారం... భారతీయులకు బంగారమే
భారతీయులకు బంగారం అంటే.. సాంప్రదాయం, సరదా, పెట్టుబడి.. అన్నీ కలిసిన సాధనం. ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన అనిశ్చితి కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. పసిడిలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇప్పుడు పలు మార్గాలు ఉన్నాయి.  ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ద్వారా కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా రూ. 2,400 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఫండ్స్‌కి ప్రాచుర్యం పెరుగుతోందనడానికి నిదర్శనం. ఫిజికల్‌గా కనీసం ఒక్క గ్రాము బంగారం నాణేన్ని కొనాలంటే  రూ. 5,000 దాకా వెచ్చించాల్సి ఉంటోంది. అలా కాకుండా పసిడి ఈటీఎఫ్‌లలో అత్యంత తక్కువగా రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఇవి కాకపోతే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ వంటి వాటి ద్వారా నెలవారీ కొద్ది కొద్దిగా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుంటుంది.

– డీపీ సింగ్, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement