gold futures
-
పసిడి పెట్టుబడికి దారేదీ..?
బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. ఆభరణాల రూపంలో మహిళలు, పెట్టుబడి రూపంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ను కొంటుంటారు. ఈమధ్య కాలంలో ఆన్లైన్లో గోల్డ్ కొనడమూ పెరిగింది. మరి, డిజిటల్ రూపంలో బంగారం కొనడం ఉత్తమమేనా? బంగారంలో పెట్టుబడి భద్రంగా ఉండాలంటే? రెట్టింపు రాబడి రావాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బంగారం.. ఇవీ భారతీయుల పెట్టుబడి సాధనాలు. గోల్డ్‌లో పెట్టుబడులు అత్యంత భద్రమైనవని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ వ్యాలెట్ ద్వారా బంగారాన్ని డిజిటల్‌గా కొనడం ఒక మార్గం. అయితే ఇలాంటి ఉత్పత్తుల కొనుగోళ్లు రెగ్యులేటరీ పరిధిలోకి రావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణకు సెబీ తరహాలో బంగారాన్ని విక్రయించే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షించడానికి ఎలాంటి నియంత్రణ సంస్థ లేదు. రెగ్యులేటరీ నిబంధనలు వర్తించే, సురక్షితమైన బంగారు పెట్టుబడులు ఏంటో ఓసారి చూద్దాం... సావరిన్ గోల్డ్ బాండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన బాండ్లను ఇస్తుంది. ఎస్జీబీ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. బాండ్ ముఖ విలువపై సంవత్సరానికి 2.5 శాతం కూపన్‌తో సార్వభౌమ హామీని కలిగి ఉంటారు. ఇది బాండ్ మెచ్యూరిటీ విలువ, బంగారం ధరల మీద ఆధారపడి ఉంటుంది. బంగారం రాబడిలో సావరిన్ గోల్డ్ బాండ్స్ క్యాపిటల్ అప్రిసియేషన్గా గుర్తింపు పొందాయి. ఈ బాండ్ల మెచ్యూరిటీ వరకు గనక ఇన్వెస్టర్ వెయిట్ చేస్తే.. వ్యక్తిగత పెట్టుబడిదారులకు మూలధన లాభాల పన్ను మినహాయించబడుతుంది. అయితే మెచ్యూరిటీ సమయం ఎనిమిది సంవత్సరాలుగా ఉంది. ఈ బాండ్లను ఆర్బీఐ తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రీ–మెచ్యూర్ ఎగ్జిట్‌కు అనుమతించబడుతుంది. ఒకవేళ మీరు ఈ బాండ్లను ఆర్బీఐకి కాకుండా సెకండరీ మార్కెట్లో విక్రయించినట్లయితే మూలధన లాభాలపై 20 శాతం (ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి) పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సడెన్‌గా ప్రీ–మెచ్యుర్ కంటే ముందే ఎగ్జిట్ కావాలనుకుంటే మాత్రం.. కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంక్ లేదా బ్రోకర్‌ను సంప్రదించాలి. ఐదేళ్లు పూర్తికాకముందే పెట్టుబడిదారులు ఎస్జీబీలను సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. కానీ, సంబంధిత ఇన్వెస్టర్ మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 36 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంచినట్లయితే స్లాబ్ రేట్, 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి 20% క్యాపిటల్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీలో ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీల విషయంలో ప్రధాన సమస్య ఏంటంటే.. సెకండరీ మార్కెట్లో కొనడం లేదా అమ్మడం అంత సులువైన అంశం కాదు. పెట్టుబడిదారుడు, బ్రోకర్‌కు ఒకే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)తో డిపాజిటరీ అకౌంట్ ఉంటే తప్ప ఎస్‌జీబీల బదిలీ కఠినం. ఎందుకంటే ఇంటర్ డిపాజిటరీ బదిలీని అనుమతించని ఎస్జీబీలను మాత్రమే ప్రభుత్వ సెక్యూరిటీలుగా పరిగణిస్తారు కాబట్టి! ఎస్జీబీలలో ఇంటర్ డిపాజిటరీ బదిలీకి ఆర్బీఐ అనుమతులు ఇచ్చినప్పటికీ.. డిపాజిటరీలు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పూర్తిగా క్రమబద్ధీకరించలేదు. రిటైల్ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక పన్ను విధానం ఉండగా.. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు మాత్రం ఎస్‌జీబీల ఎంట్రీ, ఎగ్జిట్‌లో ప్రతికూలతలున్నాయి.ఎస్జీబీలలో సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ పరిమితం. కొత్త ఆఫర్లు తెరిచినప్పుడు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ బైబ్యాక్ విండోను తెరిచినప్పుడు ఆయా బాండ్లను విక్రయించాల్సి ఉంటుంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లలోని గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీల కంటే కొంచెం తక్కువ రాబడిని ఇస్తాయి. కానీ, బంగారం మీద కాగితపు రహిత, దీర్ఘకాలిక పెట్టుబడులకు, స్నేహపూర్వక ఎంపికలకు మాత్రం ఈటీఎఫ్‌లు సరైనవి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) జారీ చేసిన ప్రతి యూనిట్ ఈటీఎఫ్.. భౌతికంగా కొనుగోలు చేసిన బంగారానికి సమానవైన విలువను కలిగి ఉంటుంది. ఏఎంసీలను సెబీ రిజిస్టర్డ్ కస్టోడియన్ ధ్రువీకరిస్తారు. బంగారాన్ని భద్రపరిచే బాధ్యత కస్టోడియన్దే. గోల్డ్ ఈటీఎఫ్‌లను స్వతంత్ర ఖజానా ప్రొవైడర్ నిల్వ చేస్తారు. ఈయన రోజువారీ రికార్డ్లను నిర్వహిస్తుంటాడు. బార్ నంబర్, స్వచ్ఛత ధ్రువీకరణ పత్రాలతో రోజువారీ బంగారం ధరల కదలికలను ట్రాక్ చేస్తుంటాడు కూడా. మొబైల్ వాలెట్స్ జారీ చేసినవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇష్యూ చేసే గోల్డ్ ఈటీఎఫ్‌ల నెలవారీ వివరాలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి బహిర్గత పరచాల్సి ఉంటుంది. ఎంఎఫ్‌ల గోల్డ్ హోల్డింగ్స్‌లకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా జరుగుతుంది. ఈటీఎఫ్‌లలో టాస్క్ ఏంటంటే.. ఈటీఎఫ్‌ల ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీలతో పోల్చితే ఈటీఎఫ్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంఎఫ్‌లు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజులను విధిస్తాయి. అన్ని బంగారు ఈటీఎఫ్‌లు సెకండరీ మార్కెట్లో చురుకుగా ట్రేడ్ కావు. అలాగే ధరలు అంతర్లీనంగా నికర ఆస్తి విలువల (ఎన్ఏవీ) కంటే దూరంగా ఉంటాయి. అందుకే పెట్టుబడిదారులు తమ ఎన్ఏవీలకు దగ్గరగా కోట్ చేసే ట్రేడింగ్ వాల్యూమ్స్‌తో గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవటం ఉత్తమం. అంతేకాకుండా ఎస్‌జీబీల మాదిరిగా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద మూలధన లాభాల పన్ను ఉంటుంది. అది భౌతిక బంగారంపై ఎంతైతే పన్ను విధించబడుతుందో అంతే ఉంటుంది. గోల్డ్ ఫ్యూచర్స్... ఇండియాలో అతిపెద్ద సెక్యూరిటీస్ అండ్ కమొడిటీస్ ఎక్స్ఛేంజ్ కంపెనీ మల్టి కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) తీసుకొచ్చిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే గోల్డ్ ఫ్యూచర్స్. ఎంసీఎక్స్‌లో ఒక గ్రాము విలువ నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఎంసీఎక్స్ సెబీ నియంత్రణలో ఉంటుంది. గోల్డ్ పెటల్ అనేది బాగా సక్సెస్ అయిన రిటైల్ గోల్డ్ ఇన్వెస్టర్ కాంట్రాక్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్), లిక్విడ్ ఆర్డర్ బుక్ చేసే వీలుండటమే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణాలని ఎంసీఎక్స్ హెడ్ శివాన్షు మెహతా చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో గోల్డ్ పెటల్ ప్రారంభమైంది. 2019–20లో గోల్డ్ పెటల్ కాంట్రాక్ట్‌లో సగటు రోజువారీ టర్నోవర్ రూ.10,163 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇది అత్యధికంగా రూ.54,415 కోట్లుగా ఉంది. ఇతర రకాల గోల్డ్ పెట్టుబడులతో పోలిస్తే.. గోల్డ్ ఫ్యూచర్స్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. పెట్టుబడిదారులు బంగారం విలువ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ విలువలో ఆరు శాతం మార్జిన్‌ను చెల్లించవచ్చు. లేదా పూర్తి విలువను చెల్లించవచ్చు. కాకపోతే మీరు బంగారాన్ని కూడబెట్టుకోవాలనుకున్నా లేదా డెలివరీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒప్పంద గడువు ముగిసే సమయానికి పూర్తి విలువను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ ధర, అస్థిరతను బట్టి అదనపు మార్జిన్లను వసూలు చేయవచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్‌లో వచ్చే ఆదాయాన్ని కమొడిటీస్ ఇన్‌కమ్‌తో కలుపుతారు. దీనికి స్లాబ్ రేట్‌ను బట్టి పన్ను విధించబడుతుంది. బంగారం... భారతీయులకు బంగారమే భారతీయులకు బంగారం అంటే.. సాంప్రదాయం, సరదా, పెట్టుబడి.. అన్నీ కలిసిన సాధనం. ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన అనిశ్చితి కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పలు మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2,400 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఫండ్స్‌కి ప్రాచుర్యం పెరుగుతోందనడానికి నిదర్శనం. ఫిజికల్‌గా కనీసం ఒక్క గ్రాము బంగారం నాణేన్ని కొనాలంటే రూ. 5,000 దాకా వెచ్చించాల్సి ఉంటోంది. అలా కాకుండా పసిడి ఈటీఎఫ్‌లలో అత్యంత తక్కువగా రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వాటి ద్వారా నెలవారీ కొద్ది కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. – డీపీ సింగ్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ -
పసిడి@1800 డాలర్లు- 8 ఏళ్ల గరిష్టం
కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలన్నిటా కోరలు చాస్తున్న కరోనా వైరస్ ఇటీవల మరింత విస్తరిస్తుండటంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. వెరసి విదేశీ మార్కెట్లో ఔన్స్(31.1 గ్రాములు) 1800 డాలర్లను అధిగమించింది. ఇది 2011 తదుపరి అత్యధికంకాగా.. దేశీయంగానూ పసిడి బలపడింది. 10 గ్రాముల ధర రూ. 48,450 నుంచి రూ. 48,700కు ఎగసింది. ఈ బాటలో కేజీ వెండి ధర రూ. 49,200 నుంచి రూ. 50,020కు బలపడింది. కేంద్ర బ్యాంకులతోపాటు.. సామాన్య ప్రజలవరకూ సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావిస్తుండటమే దీనికి కారణమని బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివిధ మార్కెట్లలో దేశీయంగా ఎక్సయిజ్ డ్యూటీ, రాష్ట్ర పన్నులు, తయారీ చార్జీల కారణంగా వివిధ మార్కెట్లో విభిన్న ధరలు పలుకుతుంటాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెరసి ఢిల్లీ మార్కెట్లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,500కు చేరగా.. చెన్నైలో రూ. 46,780ను తాకింది. ఇక ముంబైలో రూ. 46,600 వద్దకు చేరింది. గోల్డ్ రిటర్న్స్ వివరాల ప్రకారం చెన్నై మార్కెట్లో 24 క్యారట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 50,990ను తాకింది. ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో అంటే ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఆగస్ట్ గోల్డ్ 0.75 శాతం పుంజుకుని 10 గ్రాములు రూ. 49,165కు చేరింది. ఇదే విధంగా వెండి కేజీ జులై ఫ్యూచర్స్ రూ. 51,594ను తాకింది. బుధవారం పసిడి ఫ్యూచర్స్ రూ. 49,045 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి(ఫ్యూచర్స్) 1821 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ ధర 1811 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్స్ 19.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా.. దేశీ రిఫైనరీలలో శుద్ధి చేసిన పసిడి బార్లను అనుమతించనున్నట్లు ఎంసీఎక్స్ తాజాగా పేర్కొంది. అయితే ఇందుకు నియంత్రణ సంస్థలు అనుమతించవలసి ఉన్నట్లు తెలియజేసింది. మరోపక్క గోల్డ్ మినీ ఆప్షన్స్(100 గ్రాములు)ను ప్రవేశపెట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు పేర్కొంది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కోవిడ్(సెకండ్ వేవ్) విస్తరిస్తుండటంతో ఫెడరల్ రిజర్వ్ మరోసారి సహాయక ప్యాకేజీల రూపకల్పనకు ఉపక్రమించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
స్వల్పంగా పెరిగిన బంగారం
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా లాభపడింది. ఎంసీఎక్స్ మార్కెట్లో శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో 10గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో రూ. 47,418 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం, ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్ బంగారం బలపడేందుకు కారణమవుతున్నట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. నిన్నటి రోజున ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి 10గ్రామలు బంగారం ధర రూ.17ల స్వల్ప లాభంతో రూ.47,355 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరతలు, భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ కేసుల పెరుగుదల తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగానూ మార్కెట్లో 5డాలర్ల జంప్: అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆసియాలో నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం 5డాలర్లు పెరిగి 1,735 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య వాణజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ప్రపంచదేశాల్లో కరోనా కేసులు మరింత పెరగడంతో పాటు చైనాలో తాజా కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి మొదలవడం ఇన్వెస్టర్లను మరింత ఆందోళనలకు గురిచేసింది. దీంతో వారు రక్షణాత్మక చర్యల్లో భాగంగా వారు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. -
రూ.250 దిగివచ్చిన పసిడి
దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర దిగివచ్చింది. నేటి ఉదయం 10 గంటలకు ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.250లు నష్టపోయి రూ.47,317 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో పాటు, భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరలేపినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.541లు లాభపడి రూ.47,026 వద్ద స్థిరపడింది. పసిడి ఇన్వెస్టర్లు భారత్-చైనా సరిహద్దు వివాదాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ట్రేడర్లు రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాల్లో పసిడిలో పెట్టుబడులను రక్షణాత్మక చర్యగా భావిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,734.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో అమెరికా డాలర్ బలపడటం పసిడి ఫ్యూచర్లపై ట్రేడింగ్‌పై ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు కరోనా వైరస్ రెండోదశ వ్యాధి భయాలు పసిడి ఫ్యూచర్ల పతనాన్ని అడ్డుకుంటున్నాయి. బీజింగ్‌లో వరుసగా 6రోజూ రెండో దశ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో 6రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. -
పసిడి: 2రోజుల నష్టాలకు బ్రేక్..!
రెండురోజుల పాటు నష్టాలను చవిచూసిన పసిడి ఫ్యూచర్లకు మంగళవారం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధర రూ.200లు పెరిగింది. కోవిడ్-19 వైరస్ రెండో దశ వ్యాప్తి భయాలతో పాటు ఇటీవల ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో ట్రేడర్లు రక్షణాత్మకంగా పసిడి ప్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు బులియన్ పండితులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు కీలక మద్దతు స్థాయి 1700 డాలర్ల స్థాయిని అధిగమించింది. దీంతో రానున్న రోజుల్లో పసిడి మరింత ర్యాలీ చేయవచ్చనే నిపుణుల అభిప్రాయం కూడా దేశీయ పసిడి ఫ్యూచర్లు బలపడేందుకు కారణమైందని వారు అంటున్నారు. ఇక సోమవారం ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి పసిడి ధర రూ.308లు నష్టపోయి రూ.47,026 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ 14డాలర్లు జంప్: అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ఫ్యూచర్స్ ధర 14డాలర్ల పెరిగి 1,741 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ భయాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కార్పోరేట్ బాండ్ల కొనుగోలు కార్యక్రమానికి తెరతీసింది. నేటి నుంచి కార్పోరేట్ బాండ్లు కొనుగోలు చేసే కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రకటించారు. ఫెడ్ చర్యలతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ విలువ తగ్గుముఖం పట్టింది. డాలర్ క్షీణత పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్ ముగిసే సరికి అంతర్జాతీయంగా ఔన్స్ పసిడి ఫ్యూచర్ల ధర 10డాలర్లు నష్టపోయి 1,727.20 వద్ద స్థిరపడింది. -
స్వల్ప నష్టంతో ముగిసిన పసిడి
దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్ప నష్టంతో ముగిసింది. ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.80లు నష్టపోయి రూ. 47334.00 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు ఊహించని రీతిలో నష్టాల నుంచి రికవరీ కావడంతో పసిడి ఫ్యూచర్లపై ఒత్తిడిని కలిగించింది. అలాగే అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్ అవడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా నష్టాల ముగింపే : అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ఫ్యూచర్స్ ధర నష్టంతో ముగిసింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 2.50డాలర్లు క్షీణించి 1,737.30డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్‌తో పాటు బాండ్ ఈల్స్ బలపడటం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గించాయి. అలాగే అమెరికా ఈక్విటీ మార్కెట్ల లాభాల ముగింపు కూడా పసిడి ఫ్యూచర్ల నష్టాలకు కారణమైంది. ఇక వారం మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 3శాతం లాభపడ్డాయి. అమెరికా ఫెడ్‌రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఛైర్మన్ పావెల్ ఆర్థిక వృద్ది, రికవరిపై ఆందోళన వ్యక్తం చేయడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. అలాగే అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభం కావచ్చనే భయాలు పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. -
రూ.600 పెరిగిన పసిడి
దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో గురువారం ఉదయం సెషన్లో పసిడి ఫ్యూచర్స్ ధర రూ.600 లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వారం గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ పెరిగినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. నేడు ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ. 46,750 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచే పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో రూ.608లు లాభపడి రూ.47,234 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు నిన్నటి ముగింపు(రూ.46626)తో పోలిస్తే రూ.559లు పెరిగి రూ.47185 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫెడ్ వడ్డీరేట్ల ప్రకటన కోసం ఎదురుచూపుల నేపథ్యంలో నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర రూ.32 స్వల్ప నష్టంతో రూ. 46626 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా వారం గరిష్టానికి: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర వారం గరిష్టాన్ని అందుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నిన్నరాత్రి కీలకమైన వడ్డీరేట్ల రేట్లపై తన వైఖరి ప్రకటించింది. కోవిద్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా సున్నా స్థాయిలోనే ఉంచుతున్నట్లు ఫెడ్ ఛైర్మన్ పావెల్ తెలిపారు. ఈ సందర్భంగా పావెల్ ఆర్థిక వృద్ధి, రికవరీ పై ఆందోళన వ్యక్తం చేశారు. పావెల్ నిరాశజనకమైన వాఖ్యలతో ఇన్వెసర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన పసిడి ఫ్యూచర్లలోకి మళ్లించారు. ఫలితంగా ఆసియాలో నేటి ఉదయం ఔన్స్ పసిడి ఫ్యూచర్స్ ధర 30డాలర్లు లాభపడి 1,749.70డాలర్లను అందుకుంది. ఈ ధర పసిడికి వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. -
రూపాయి క్షీణతతో పసిడి దూకుడు..
ముంబై: రూపాయి బలహీనతే ప్రధాన కారణంగా పసిడి పరుగులు పెడుతోంది. దేశంలోని ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్ ముంబైలో పూర్తి స్వచ్ఛత పసిడి 10గ్రాముల ధర బుధవారం రూ.700 ఎగసి రూ. 33,430కి చేరింది. ఆభరణాల పసిడి ధర రూ.630 పెరిగి రూ.33,265కు ఎగసింది. ఇక్కడ మార్కెట్లో ఈ ధరలు ఆల్‌టైమ్ రికార్డు చేసుకున్నాయి. వెండి ధర కూడా రికార్డు స్థాయిలో ఎగసింది. ఒకేరోజు కేజీ వెండి ధర రూ.2,800 ఎగసి రూ. 59,470కి చేరింది. దేశంలోని పలు బులియన్ మార్కెట్లలో సైతం మేలిమి బంగారం ధరలు రూ.32,000-రూ.32,500 శ్రేణిలో ఉన్నాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్లో కడపటి సమాచారం మేరకు ఔన్స్(31.1గ్రా) పసిడి ధర క్రితం ముగింపు వద్దే 1,420 డాలర్ల వద్ద ఉంది. వెండి కూడా అదే స్థాయిలో 25 డాలర్ల వద్ద ఉంది. దేశీ యంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో కడపటి సమాచారం మేరకు పసిడి స్వల్ప లాభాలతో రూ.33,900 వద్ద ట్రేడవుతోంది. వెండి రూ.560 ఎగసి రూ.56,730 వద్ద ట్రేడవుతోంది. -
బంగారం.. భగభగ!
ముంబై: బంగారం ధరలు సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లలో భారీగా పెరిగాయి. ఇక్కడ ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్లో ధర రూ.29 వేలు పైబడింది. 24, 22 క్యారెట్ల ధరలు రూ.715, రూ. 710 చొప్పున ఎగసి వరుసగా రూ. 29,400, రూ. 29,250కి చేరాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఇక వెండి ధర సైతం భారీగా పెరిగింది. కేజీ ధర రూ. 1,825 పెరిగి రూ. 45,115కు చేరింది. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో స్పాట్ మార్కెట్లలో సైతం బంగారం ధరలు భారీగా ఎగశాయి. హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల రేట్లు వరుసగా రూ.29,500, రూ.28,500గా నమోదయ్యాయి. కారణాలు ఏమిటి? డాలర్ మారకంలో రూపాయి బలహీనత, అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్లో సానుకూల సంకేతాలు బంగారం ధర పెరగడానికి కారణం. దీనికితోడు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) కట్టడికి బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు మరింత పెరగనున్నాయని. ఇందుకు సంబంధించిన కస్టమ్స్ నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నదన్న వార్తలు బంగారం ధర స్పీడ్‌ను పెంచాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో భారీ జంప్... కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే ఔన్స్ (31.1 గ్రా) 23 డాలర్లు ఎగసి, 1,336 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 4 శాతం లాభంతో 21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.989 పెరిగి, రూ. 28,895 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర సైతం 6 శాతానికి పైగా ఎగసి (రూ.2,923) రూ. 45,621 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మంగళవారం స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు (రూపాయి విలువ కదలికలకు లోబడి) భారీగాా పెరిగే అవకాశం ఉంది. కాగా అమెరికాలో సహాయక ప్యాకేజ్‌లు మరికొంత కాలం కొనసాగవచ్చన్న వార్తలు, అలాగే చైనాలో బంగారం వినిమయం భారీగా పెరిగిందన్న నివేదికలు అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.