రెండురోజుల పాటు నష్టాలను చవిచూసిన పసిడి ఫ్యూచర్లకు మంగళవారం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధర రూ.200లు పెరిగింది. కోవిడ్-19 వైరస్ రెండో దశ వ్యాప్తి భయాలతో పాటు ఇటీవల ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో ట్రేడర్లు రక్షణాత్మకంగా పసిడి ప్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు బులియన్ పండితులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు కీలక మద్దతు స్థాయి 1700 డాలర్ల స్థాయిని అధిగమించింది. దీంతో రానున్న రోజుల్లో పసిడి మరింత ర్యాలీ చేయవచ్చనే నిపుణుల అభిప్రాయం కూడా దేశీయ పసిడి ఫ్యూచర్లు బలపడేందుకు కారణమైందని వారు అంటున్నారు. ఇక సోమవారం ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి పసిడి ధర రూ.308లు నష్టపోయి రూ.47,026 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ 14డాలర్లు జంప్:
అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ఫ్యూచర్స్ ధర 14డాలర్ల పెరిగి 1,741 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ భయాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కార్పోరేట్ బాండ్ల కొనుగోలు కార్యక్రమానికి తెరతీసింది. నేటి నుంచి కార్పోరేట్ బాండ్లు కొనుగోలు చేసే కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రకటించారు. ఫెడ్ చర్యలతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ విలువ తగ్గుముఖం పట్టింది. డాలర్ క్షీణత పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్ ముగిసే సరికి అంతర్జాతీయంగా ఔన్స్ పసిడి ఫ్యూచర్ల ధర 10డాలర్లు నష్టపోయి 1,727.20 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment