దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా లాభపడింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో రూ. 47,418 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం, ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్ బంగారం బలపడేందుకు కారణమవుతున్నట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. నిన్నటి రోజున ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి 10గ్రామలు బంగారం ధర రూ.17ల స్వల్ప లాభంతో రూ.47,355 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరతలు, భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ కేసుల పెరుగుదల తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగానూ మార్కెట్‌లో 5డాలర్ల జంప్:
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆసియాలో నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం 5డాలర్లు పెరిగి 1,735 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య వాణజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ప్రపంచదేశాల్లో కరోనా కేసులు మరింత పెరగడంతో పాటు చైనాలో తాజా కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి మొదలవడం ఇన్వెస్టర్లను మరింత ఆందోళనలకు గురిచేసింది. దీంతో వారు రక్షణాత్మక చర్యల్లో భాగంగా వారు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment