దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో శుక్రవారం 10గ్రాముల బంగారం ధర రూ.335 లాభపడి రూ.51035.00 వద్ద స్థిరపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా బంగారం ధర బలపడినట్లు బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫండల్‌మెంటల్స్ పరిశీలిస్తే బంగారం ధర మరింత ర్యాలీ చేసే అవకాశం ఉందని వారంటున్నారు.ఈ వారంలో బుధవారం తొలిసారి రూ.50వేల స్థాయిని అందుకుంది. కొనుగోళ్ల మద్దతు మరింత పెరగడంతో రూ.51,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ వారం మొత్తం మీద బంగారం ధర రూ.2068(4.22శాతం) లాభపడింది.
వచ్చేవారంలో రూ.52వేలకు: చిరాగ్ మెహతా
వచ్చేవారంలోనూ బంగారం ధర రూ.52వేల స్థాయిని అందుకుంటుందని క్వాంటమ్ అసెట్ మేనేజ్‌మెంట్ అధికారి చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. ‘‘కరోనా వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థకు నష్టం రోజురోజూ మరింత పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ.., ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోనేందుకు సెంట్రల్ బ్యాంకులు కొన్నేళ్లపాటు బాండ్-కొనుగోళ్లు, వడ్డీరేట్ల కోత లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఈ సులభమైన ద్రవ్యపాలసీ విధానంతో ఆర్థికవ్యవస్థలోకి నిధులు భారీగా చేరుకునే అవకాశం ఉంది. ఇది బంగారానికి మరింత డిమాండ్ పెంచుతుంది’’ అని క్వాంటమ్ అసెట్ మేనేజ్‌మెంట్ అధికారి చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా తక్కువ వడ్డీ రేట్ల విధానం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో నిజమైన వ్యాల్యూ కోసం బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు. అధిక ద్రవ్య లభ్యత కారణంగా రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కరెన్సీకి కొనుగోలు శక్తి తగ్గించడంతో పాటు బంగారానికి మరింత డిమాండ్ పెంచుతుందని మెహతా తెలిపారు.
ప్రపంచ మార్కెట్లో రికార్డు ముగింపు:
ఇక ప్రపంచమార్కెట్లో బంగారం ధర తొలిసారి రికార్డు స్థాయి వద్ద ముగిసింది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 7.50డాలర్ల లాభంతో 1,897.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 1,900 డాలర్లను అధిగమించి 1,904.60డాలర్ల స్థాయిని అందుకుంది. ఈ ధర బంగారానికి 9ఏళ్ల గరిష్టస్థాయి కావడం విశేషం. అంతర్జాతీయంగా బంగారం జీవితకాల గరిష్టస్థాయి 1,923.70డాలర్లగా ఉంది. ఈ వారం మొత్తం మీద ప్రపంచమార్కెట్లో బంగారం 4.8శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment