బంగారం.. భగభగ!
బంగారం.. భగభగ!
Published Tue, Aug 13 2013 12:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
ముంబై: బంగారం ధరలు సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లలో భారీగా పెరిగాయి. ఇక్కడ ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్‌లో ధర రూ.29 వేలు పైబడింది. 24, 22 క్యారెట్ల ధరలు రూ.715, రూ. 710 చొప్పున ఎగసి వరుసగా రూ. 29,400, రూ. 29,250కి చేరాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఇక వెండి ధర సైతం భారీగా పెరిగింది. కేజీ ధర రూ. 1,825 పెరిగి రూ. 45,115కు చేరింది. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో స్పాట్ మార్కెట్లలో సైతం బంగారం ధరలు భారీగా ఎగశాయి. హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల రేట్లు వరుసగా రూ.29,500, రూ.28,500గా నమోదయ్యాయి.
కారణాలు ఏమిటి?
డాలర్ మారకంలో రూపాయి బలహీనత, అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు బంగారం ధర పెరగడానికి కారణం. దీనికితోడు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) కట్టడికి బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు మరింత పెరగనున్నాయని. ఇందుకు సంబంధించిన కస్టమ్స్ నోటిఫికేషన్లను ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నదన్న వార్తలు బంగారం ధర స్పీడ్‌ను పెంచాయి.
ఫ్యూచర్స్ మార్కెట్‌లో భారీ జంప్...
కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే ఔన్స్ (31.1 గ్రా) 23 డాలర్లు ఎగసి, 1,336 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 4 శాతం లాభంతో 21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.989 పెరిగి, రూ. 28,895 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర సైతం 6 శాతానికి పైగా ఎగసి (రూ.2,923) రూ. 45,621 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మంగళవారం స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు (రూపాయి విలువ కదలికలకు లోబడి) భారీగాా పెరిగే అవకాశం ఉంది. కాగా అమెరికాలో సహాయక ప్యాకేజ్‌లు మరికొంత కాలం కొనసాగవచ్చన్న వార్తలు, అలాగే చైనాలో బంగారం వినిమయం భారీగా పెరిగిందన్న నివేదికలు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Advertisement