
ముంబై: పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్–19 (కరోనా) వైరస్... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం, ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యెల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి వేగంగా పెట్టుబడులు పసిడివైపు మరలుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం ఏకంగా దాదాపు 42 డాలర్లు ఎగసింది. ట్రేడింగ్ ఒక దశలో 1,700 డాలర్లకు 10 డాలర్ల దూరంలో 1,691.56ను తాకింది. ఈ వార్తరాసే రాత్రి 9 గంటల సమయంలో 31.35 డాలర్ల లాభంతో 1,680.15 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర దాదాపు 8 సంవత్సరాల గరిష్టస్థాయి.
దేశీయంగా రూపాయి బలహీనత తోడు...
ఇక భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణితోపాటు, దేశీయంగా రూపాయి బలహీనత పసిడి పరుగుకు కారణమవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర ఈ వార్త రాసే 9 గంటల సమయంలో రూ.953 లాభంతో రూ.43,619 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో రూ.43,788నూ తాకింది. ఢిల్లీ సహా పలు పట్టణాల్లోని స్పాట్ మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.1,000 వరకూ పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాములు స్వచ్ఛత పసిడి ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరింది. పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలోనూ ధర దాదాపు రూ.1,000 వరకూ పెరిగి రూ.44,000 పైనే ధర పలికింది.
Comments
Please login to add a commentAdd a comment