Markets Trend
-
వ్యాక్సిన్ల వార్తలే కీలకం..!
ముంబై: కోవిడ్ –19 వ్యాక్సిన్లపై ఆశలు, అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజీ వార్తలే ఈ వారంలో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, రెండో దశ కరోనా కేసుల నమోదు పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. కొన్ని వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ ప్రకటనతో పాటు వారంతపు రోజున ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య పాలసీ విధానం మార్కెట్‌ను మెప్పించడంతో మార్కెట్ వరుసగా ఐదోవారమూ లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లన్నీ వ్యాక్సి న్ల వైపే దృష్టి సారించాయి. ఇప్పటికే ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. అమెరికా సైతం ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతి కోరింది. తాజాగా దేశీయ ఫార్మా సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు పరీక్షల్లో సత్ఫలితాలను ఇస్తుండడంతో మార్కెట్లో మరింత ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఓకు సిద్ధమైన ఐఆర్ఎఫ్సీ ప్రభుత్వ రంగానికి చెందిన తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రాథమిక మార్కెట్లో నిధుల సమీకరణకు సిద్ధమైంది. భారత రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) కంపెనీ రూ.4600 కోట్ల ఐపీఓ ఇష్యూ డిసెంబర్ మూడోవారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఓ ఆఫర్ ద్వారా ఐఆర్ఎఫ్సీ 178.21 కోట్ల ఈక్విటీ షేర్లను, అలాగే 118.80 కోట్ల తాజా ఈక్విటీలను ఆఫర్ చేయనుంది. మార్కెట్ పరిస్థితులు సవ్యంగా ఉంటే ఈ డిసెంబర్ మూడో వారంలో ఇష్యూ ప్రక్రియను చేపడతామని లేదంటే జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఐపీఓ ఉండొచ్చని కంపెనీ చైర్మన్ అమితాబ్ బెనర్జీ తెలిపారు. రిటైల్, పారిశ్రామిక గణాంకాలు కీలకమే ఈ శుక్రవారం(11న) నవంబర్ నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు, అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజున డిసెంబర్ 4తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ విడుదల చేయనుంది. ద్రవ్యపాలసీ విధాన ప్రకటన సందర్భంగా జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్బీఐ అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెల్లువలా విదేశీ పెట్టుబడులు ఇటీవల కాలంలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా రు. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఎఫ్ఐఐలు రూ.17 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొన్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వచ్చే ఏడాది(2021) జనవరి వరకు ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో డీఐఐ(దేశీ ఫండ్స్) లాభాల స్వీకరణతో నికర అమ్మకందారులుగా మారారు. ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా ఉందని విశ్లేషకులంటున్నారు. 9 నెలల గరిష్టానికి క్రూడాయిల్ ధర భారత్ లాంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల క్రూడాయిల్ కదలికలూ ఈ వారం కీలకంగా మారాయి. కోవిడ్ మృతుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ఆర్థిక పురోగతి ఆశలతో గత శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధర 9 నెలల గరిష్ట స్థాయి 49.25 డాలర్లను అందుకుంది. క్రూడాయిల్ కదలికలు కేవలం స్టాక్ మార్కెట్‌పై మాత్రమే కాకుండా రూపాయి ట్రేడింగ్‌పైనా ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ పరిణామాలు సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ మంగళవారం (డిసెంబర్ 4న) యూరోజోన్‌తో పాటు జపాన్ దేశపు క్యూ3 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్నాయి. చైనా బుధవారం(డిసెంబర్ 5న) నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. గురువారం(డిసెంబర్ 6న) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్లపై తన విధానాన్ని ఇదేరోజున అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడి చేయనుంది. -
మెరిసిన బంగారం
ముంబై: పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్–19 (కరోనా) వైరస్... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం, ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యెల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి వేగంగా పెట్టుబడులు పసిడివైపు మరలుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం ఏకంగా దాదాపు 42 డాలర్లు ఎగసింది. ట్రేడింగ్ ఒక దశలో 1,700 డాలర్లకు 10 డాలర్ల దూరంలో 1,691.56ను తాకింది. ఈ వార్తరాసే రాత్రి 9 గంటల సమయంలో 31.35 డాలర్ల లాభంతో 1,680.15 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర దాదాపు 8 సంవత్సరాల గరిష్టస్థాయి. దేశీయంగా రూపాయి బలహీనత తోడు... ఇక భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణితోపాటు, దేశీయంగా రూపాయి బలహీనత పసిడి పరుగుకు కారణమవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర ఈ వార్త రాసే 9 గంటల సమయంలో రూ.953 లాభంతో రూ.43,619 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో రూ.43,788నూ తాకింది. ఢిల్లీ సహా పలు పట్టణాల్లోని స్పాట్ మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.1,000 వరకూ పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు స్వచ్ఛత పసిడి ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరింది. పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలోనూ ధర దాదాపు రూ.1,000 వరకూ పెరిగి రూ.44,000 పైనే ధర పలికింది. -
అస్థిరతలు కొనసాగొచ్చు..
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. ‘‘ఎఫ్‌అండ్‌వో గురువారం ముగియనుండడం వల్ల సమీప కాలంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో కుదిరే వ్యాపార, వాణిజ్య ఒప్పంద వార్తలు కూడా ప్రభావం చూపిస్తాయి’’ అని బీఎన్పీ పారిబాస్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ గౌరవ్‌దువా తెలిపారు. మెటల్స్, అంతర్జాతీయంగా కమోడిటీలు పేలవ ప్రదర్శన చూపించొచ్చన్నారు. దేశీయ ఇన్స్టిట్యూషన్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చైనాలో కోవిడ్–19 వైరస్ సంబంధిత పరిస్థితులు తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయని, మరిన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రారంభమవుతోందని, దీంతో సరఫరా పరంగా ఇబ్బందులు తగ్గిపోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. చైనా ఆర్థిక ఉద్దీపనలు ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో (ఏప్రిల్–జూన్) ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని మార్కెట్లు క్రమంగా అంచనాకు రావచ్చని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ తెలిపారు. ఎఫ్‌పీఐలు బుల్లిష్... భారత మార్కెట్ల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్ తర్వాత వీరు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,102 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ.10,750 కోట్లు ఈక్విటీల్లో, రూ.12,352 కోట్లు డెట్ విభాగంలో పెట్టుబడులు పెట్టారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో నికర పెట్టుబడిదారులుగానే ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. అయితే సమీప భవిష్యత్తు పెట్టుబడు లపై కోవిడ్–19 ప్రభావం ఉండవచ్చని అంచనా. -
ఎన్నికల ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రథమార్ధంలో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపనున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే దాకా అనిశ్చితి నెలకొనవచ్చని పేర్కొన్నారు. ‘మార్కెట్‌కు దీర్ఘకాలికంగా దిశా నిర్దేశం చేయగల పరిణామం ఈ వారం చోటు చేసుకోనుంది. సంపద సృష్టిలో కూడా ఇదే కీలకాంశం కాగలదు. సాధారణంగా ఎన్నికల ఫలితాల్లాంటి పరిణామాలు కొన్ని సంవత్సరాల దాకా ట్రెండ్స్‌ను నిర్దేశిస్తుంటాయి. కాబట్టి ఎకానమీకి, ఇన్వెస్టర్లకు ఇలాంటివి చాలా కీలకం‘ అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. సాధారణంగానైతే మార్కెట్లు ఏదో ఒక వైపు భారీగా కదిలే అవకాశం ఉన్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్ కారణంగా కొంత అనిశ్చితి కూడా నెలకొందని ఆయన పేర్కొన్నారు. ‘ఈ వారంలో అందరి దృష్టి స్టాక్ కోట్స్ కాకుండా వోట్ కోట్స్‌పై ఉంటుంది‘ అని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ వ్యవస్థాపక సీఈవో జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ‘మార్కెట్లు ఇప్పటికీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో ట్రేడవుతోంది. దానికి భిన్నంగా జరిగితే తీవ్ర నిరుత్సాహం ఉంటుంది. అదే సానుకూల ఫలితాలు వస్తే మార్కెట్లు ఓ మోస్తరుగా ర్యాలీ చేయొచ్చు‘ అని ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ ఫారెక్ అండ్ రేట్స్ విభాగం హెడ్ సజల్ గుప్తా తెలిపారు. కంపెనీలపై ఆర్థిక ఫలితాల ప్రభావం.. టాటా మోటార్స్, కెనరా బ్యాంక్, సిప్లా వంటి దిగ్గజ సంస్థలు ఈ వారంలోనే తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. భారత్ ఫోర్జ్, గ్లాక్సోస్మిత్‌క్లై¯Œ ఫార్మా, హిందుస్తాన్ పెట్రోలియం, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, ఇండియా సిమెంట్స్, ఎ¯Œ టీపీసీ మొదలైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల షేర్లపై వాటి ప్రభావం ఉండనుంది. ఇవి కాకుండా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ముడి చమురు రేట్లు, రూపాయి కదలికలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణి మొదలైనవి ట్రేడింగ్ సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు చెప్పారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి సుదీర్ఘ సమయం, అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై అస్పష్టత కొనసాగుతున్నప్పటికీ దేశీ మార్కెట్లు పటిష్టతని కనపర్చాయని సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వీపీ జగన్నాధం తూనుగుంట్ల చెప్పారు. క్రితం వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 37,931 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,407 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సాంకేతికంగా నిఫ్టీకి 11–227–11,180 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసాని పేర్కొన్నారు. పుల్‌బ్యాక్ ర్యాలీ గానీ జరిగితే 11,457 వద్ద నిరోధం ఉండొచ్చని తెలిపారు. రూపాయి మారకం విలువ గత వారం 31 పైసలు క్షీణించి 70.23 వద్ద క్లోజయ్యింది. ఈ వారం రూపాయి 69.20–70.80 మధ్య ట్రేడ్ కావొచ్చని ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. రూ. 6వేల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వెనక్కి.. గత మూడు నెలలుగా భారత క్యాపిటల్ మార్కెట్స్‌లో (ఈక్విటీ, డెట్) ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ. 6,399 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే, మే లో ఇందుకు భిన్నమైన ట్రెండ్ నమోదైంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే 2–17 మధ్య కాలంలో ఈక్విటీల నుంచి రూ. 4,786 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ. 1,613 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించారు. ఇది పూర్తిగా ఊహించని పరిణామమేమీ కాదని.. దేశ, విదేశాల్లో ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణమని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. -
పతనం తాత్కాలికమే: జైట్లీ
మార్కెట్ల ధోరణిపై ప్రధాని మోదీతో సమాలోచన న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలే సోమవారం నాటి దేశీ మార్కెట్ల భారీ పతనానికి కారణమని, ఇది క్షణికం, తాత్కాలికమైనదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్ ఫండమెంటల్స్ పటిష్టంగానే ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కస్టమ్స్, సెంృటల్ ఎక్సయిజ్, సర్వీస్ ట్యాక్స్ ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీతో అరుణ్ జైట్లీ సమావేశమై స్టాక్ మార్కెట్ భారీ పతనంపై చర్చించారు.