అస్థిరతలు కొనసాగొచ్చు.. | F&O expiry among six likely market drivers for the week ahead | Sakshi
Sakshi News home page

అస్థిరతలు కొనసాగొచ్చు..

Published Mon, Feb 24 2020 4:48 AM | Last Updated on Mon, Feb 24 2020 1:51 PM

F&O expiry among six likely market drivers for the week ahead - Sakshi

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్‌ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్‌ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. ‘‘ఎఫ్‌అండ్‌వో గురువారం ముగియనుండడం వల్ల సమీప కాలంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంటుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో కుదిరే వ్యాపార, వాణిజ్య ఒప్పంద వార్తలు కూడా ప్రభావం చూపిస్తాయి’’ అని బీఎన్‌పీ పారిబాస్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌ గౌరవ్‌దువా తెలిపారు.

మెటల్స్, అంతర్జాతీయంగా కమోడిటీలు పేలవ ప్రదర్శన చూపించొచ్చన్నారు. దేశీయ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చైనాలో కోవిడ్‌–19 వైరస్‌ సంబంధిత పరిస్థితులు తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయని, మరిన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రారంభమవుతోందని, దీంతో సరఫరా పరంగా ఇబ్బందులు తగ్గిపోవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. చైనా ఆర్థిక ఉద్దీపనలు ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో (ఏప్రిల్‌–జూన్‌) ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని మార్కెట్లు క్రమంగా అంచనాకు రావచ్చని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌ అంబానీ తెలిపారు.  

ఎఫ్‌పీఐలు బుల్లిష్‌...
భారత మార్కెట్ల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐలు) బుల్లిష్‌ ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్‌ తర్వాత వీరు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,102 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఇందులో రూ.10,750 కోట్లు ఈక్విటీల్లో, రూ.12,352 కోట్లు డెట్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో నికర పెట్టుబడిదారులుగానే ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. అయితే సమీప భవిష్యత్తు పెట్టుబడు లపై కోవిడ్‌–19 ప్రభావం ఉండవచ్చని అంచనా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement