వాషింగ్టన్: లక్షలాది మంది ప్రాణాలు బలిగొని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసిన కరోనా వైరస్ తీవ్రతను తక్కువగా అంచనా చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తానే క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా కోవిడ్-19 బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్, నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తదితరులు ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటన విడుదల చేశారు. అయితే కాస్త ఆలస్యంగానైనా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సైతం ఈ విషయంపై స్పందించారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ షినువా రెండు లైన్లతో కూడిన వార్తను ప్రచురితం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ త్వరగా కోలుకోవాలని చైనా అధ్యక్షుడు ఆకాంక్షిచారని పేర్కొంది.(చదవండి: భారత్- అమెరికాల మధ్య కీలక ఒప్పందం..)
అయితే అంతకు ముందు చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్-ఇన్- చీఫ్ హు షిజిన్ మాత్రం.. ‘‘కోవిడ్-19ను తక్కువ చేసి చూపుతూ గాంబ్లింగ్ చేసినందుకు ప్రయత్నించిన ట్రంప్, ఆయన భార్య మెలానియా భారీ మూల్యమే చెల్లించారు’’ అంటూ ట్విటర్ వేదికగా శుక్రవారం విమర్శలు గుప్పించారు. కానీ కాసేపటి తర్వాత తన ట్వీట్‌ను తొలగించి, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యాంగ్ ట్వీట్‌తో రీప్లేస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం విచారకరం. వాళ్లు త్వరగా కోలుకుని, సంపూర్ల ఆరోగ్యంతో తిరిగి రావాలన్న ఆమె మాటలను ఉటంకిస్తూ మరో ట్వీట్ చేశారు.
చైనీస్ వైరస్ అంటూ ఆగ్రహం
డ్రాగన్ దేశంలోని వుహాన్ నగరంలో తొలిసారిగా కరోనా ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో ట్రంప్ పదే పదే.. కరోనాను చైనీస్ వైరస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక వైరస్ గురించిన సమాచారం ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టి, ఇంతటి ఆరోగ్య సంక్షోభానికి కారణమైన చైనాకు వంత పాడిందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై సైతం ఆయన నిప్పులు చెరిగారు. అంతేగాక ఆ సంస్థకు నిధులు కూడా నిలిపివేశారు. అంతేగాక హాంకాంగ్‌కు స్వయంప్రత్తిని కాలరాస్తూ అక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్న డ్రాగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తైవాన్ విషయంలోనూ చైనా తీరును తప్పుబట్టారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో పలు చైనీస్ యాప్‌లపై నిషేధం విధించడంతో వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చైనాను ఎద్దేవా చేసిన తైవాన్
అదే సమయంలో చైనా ఆధిపత్యాన్ని ప్రశ్నించే తైవాన్ వంటి దేశాలకు ట్రంప్ అభయహస్తమిస్తూ మద్దతుగా నిలవడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం వద్దంటూ పెద్దన్నను హెచ్చరించింది. అయితే తైవాన్ మాత్రం డ్రాగన్ బెదిరింపులకు ఏమాత్రం భయపడలేదు సరికదా.. అమెరికా అండ చూసుకుని చైనాపై మాటల యుద్ధానికి దిగింది. అంతేగాక యూఎస్ ప్రతినిధి తమ దేశంలో పర్యటించడాన్ని ఆక్షేపించిన డ్రాగన్‌కు కౌంటర్‌కు ఇస్తూ ఎద్దేవా చేసింది. ఇలాంటి తరుణంలో, 74 ఏళ్ల వయసున్న కరోనా బారిన పడటం, ఇప్పటికే ఒబేసిటీతో బాధడపడుతున్న ఆయన ఆరోగ్యం ఆందొళనకరంగా మారిందన్న వార్తల నేపథ్యంలో డ్రాగన్ ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటుందా అన్న సందేహాలు తలెత్తాయి. (చదవండి: చైనా హెచ్చరికలపై తైవాన్ ఘాటు స్పందన)
ఈ క్రమంలో తుర్పు ఆసియా రాజకీయాలపై పట్టు ఉన్న అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు షెల్లీ రిగ్గర్.. ‘‘ట్రంప్.. ప్రస్తుతం వాల్టర్ రీడ్‌లో ఉండటం, కొన్ని దేశాలు దీన్ని గొప్ప అవకాశంగా భావించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సున్నితమైన సమయాల్లో దుందుడుకు చర్యలకు పాల్పడటం ఎంత ప్రమాదకరమో కూడా వారికి ఓ అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకంటే అమెరికాను తక్కువగా అంచనా వేసే అవకాశం ఉండదు. జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తూనే ఉంటారు. అందుకే ట్రంప్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయంపై వారు అతిగా స్పందించలేదు. అలా అని స్పందించకుండా ఉండలేదు’’అంటూ పరోక్షంగా చైనా మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
చైనా మాపై దాడి చేస్తుందేమో!
నిజానికి గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడగానే వివిధ దేశాధినేతలు ఈ విషయంపై స్పందించారు. కానీ చైనా మీడియాలో మాత్రం రెండు రోజుల తర్వాత అధ్యక్షుడి పేరిట ప్రకటన వెలువడటం గమనార్హం. ఇక సోషల్ మీడియాలోనూ ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ట్రంప్ అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమను లక్ష్యంగా చేసుకుని చైనా దాడులకు పాల్పడుతుందేమోనని తైవాన్ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తే.. తమపై అక్కసు వెళ్లగక్కినందుకు ట్రంప్‌కు తగిన శాస్తి జరిగిందంటూ కొంతమంది చైనీయులు కామెంట్లు చేశారు. స్పూఫ్ వీడియోలతో హల్‌చల్ చేశారు.
సర్‌ప్రైజ్ చేసి.. విమర్శల పాలు
అయితే ట్రంప్ మాత్రం వీళ్లందరికీ షాకిస్తూ సోమవారం వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి ప్రత్యేక వాహనంలో బయటకు వచ్చారు. తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ సరికొత్త వివాదంతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అంతేకాదు మహమ్మారి కరోనా గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని, స్కూలుకు వెళ్లినట్లుగా ఉందంటూ ట్వీట్ చేసి తాను బాగానే ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. అంతేగాకుండా తనకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు.. ‘‘చైనీస్ వైరస్‌ను జయించి త్వరలోనే మీరు మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సత్తా చాటుతారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయినా తాను సకల సౌకర్యాలు ఉన్న శ్వేతసౌధంలో నివాసం ఉండే అమెరికా అధ్యక్షుడి శరీరంలో ప్రవేశించానా లేదా పూరి గుడిసెలో బతుకు వెళ్లదీస్తున్న ఉన్న నిరుపేదపై దాడి చేస్తున్నానా అన్న విషయంతో వైరస్‌కు సంబంధం ఉండదు కదా. తనను సమర్థవంతంగా అడ్డుకోగల వ్యాధి నిరోధక వ్యవస్థ ఉన్న మనిషి జోలికి పోదు. పోయినా అక్కడ ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు. కాకపోతే తనను తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించకతప్పదన్న వాస్తవం ట్రంప్ విషయంలో మరోసారి రుజువైందంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment