వాషింగ్టన్: మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ.. ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను చైనానే ప్రపంచం మీదకు వదిలిందన్న ఆరోపణలు తీవ్రతరమవుతున్నాయి. బయోవార్‌కు తెరతీసి ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యానికై చైనా ఈ ప్రాణాంతక వైరస్‌ను సృష్టిందని.. అది బెడిసికొట్టడంతో చైనీయులే మొదటి బాధితులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలపై అమెరికా సహా ఇతర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ఆనవాళ్లు తొలిసారిగా బయటపడ్డ వుహాన్‌లో కరోనా మరణాలను 1,290 ఎక్కువగా చూపుతూ తాజా గణాంకాలు విడుదల చేయడంతో వాటికి బలం చేకూరినట్లైంది. (కరోనా: చైనా లెక్కలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో)
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ చానెల్ వెలువరించిన కథనం సంచలనంగా మారింది. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తున్న ఇంటర్న్ అనుకోకుండా ఈ వైరస్‌ను లీక్ చేశారని సదరు మీడియా పేర్కొంది. కరోనా సహజంగానే ఉద్భవించిందని... అయితే ఇది గబ్బిలాల నుంచి మనిషికి సోకిన అనంతరం దానిపై ల్యాబ్‌లో పరిశోధనలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే ఉద్యోగికి వైరస్ సోకిందని.. తనకు తెలియకుండానే సదరు వ్యక్తి దీనిని వ్యాప్తి చేశారని పేర్కొంది. అమెరికాపై పైచేయి సాధించేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వైరస్‌ను ఉపయోగించుకోవాలని భావించిందని విశ్వసనీయ వర్గాలు తమకు వెల్లడించినట్లు తెలిపింది. (చైనాపై పెరిగిన అనుమానాలు?)
ఇక కరోనా వ్యాప్తి కట్టడి- ఆర్థిక వ్యవస్థ పునురుద్ధరణ తదితర అంశాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ‘‘సరైన సురక్షిత చర్యలు తీసుకోకపోవడం వల్లే కరోనా వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని అమెరికా నమ్ముతోందా. అక్కడ ఇంటర్న్‌కు కరోనా సోకగా.. ఆమె నుంచి బాయ్‌ఫ్రెండ్‌కు.. అక్కడి నుంచి వుహాన్ మార్కెట్‌లో వ్యాప్తి చెందింది కదా’’అని ప్రశ్నించగా... ఈ విషయం గురించి అనేక కథలు వింటున్నామని... త్వరలోనే ఈ విపత్కర పరిస్థితికి కారణాన్ని కనిపెడతామని ట్రంప్ సమాధానమిచ్చారు. ఇక ఈ విషయం గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడారా అని ట్రంప్‌ను అడుగగా... ఆయనతో మాట్లాడిన విషయాలను మీడియాతో పంచుకోలేనని స్పష్టం చేశారు.(భారత్ వంటి దేశాలకు సెల్యూట్: యూఎన్ చీఫ్)
Comments
Please login to add a commentAdd a comment