బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) అక్టోబర్‌లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్‌లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్‌లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్‌లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!
కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment