వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ కోత | Asian Development Bank lowers India's growth projection to 7.2% for FY20 | Sakshi
Sakshi News home page

వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ కోత

Published Thu, Apr 4 2019 6:04 AM | Last Updated on Thu, Apr 4 2019 6:04 AM

Asian Development Bank lowers India's growth projection to 7.2% for FY20 - Sakshi

న్యూఢిల్లీ: ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) భారత్‌ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020) వృద్ధి రేటు 7.2 శాతమే ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతం. ఇందుకు ప్రధాన కారణాల్లో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు, ఆదాయాల్లో క్షీణతని ఏడీబీ బుధవారం విడుదల చేసిన తన ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) 2019 నివేదికలో పేర్కొంది. నివేదికలోని  ముఖ్యాంశాలు చూస్తే...  

► 2018–19 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను కూడా ఏడీబీ తగ్గించింది. డిసెంబర్‌లో ఈ రేటును 7.3 శాతంగా అంచనావేయగా, దీనిని తాజాగా 7 శాతానికి కుదించింది.  
► 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (7.2 శాతం) ఈ రేటు తగ్గిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం రేటు కోతకు వ్యవసాయ ఉత్పత్తి బలహీనత, వినియోగ వృద్ధి మందగమనం కారణమని పేర్కొంది. అధిక అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం కూడా వృద్ధి తగ్గడానికి కారణమని విశ్లేషించింది.  
► 2020లో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్న ఏడీబీ, పాలసీ రేటు కోత, రైతులకు ఆదాయ మద్దతు, దేశీయ డిమాండ్‌ పెరుగుదల దీనికి ప్రధాన కారణాలు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు, వ్యాపార, పెట్టుబడుల వాతావరణంలో సానుకూల మార్పులు కూడా రానున్న కాలంలో భారత్‌ వృద్ధికి కారణమవుతాయి.  
► భారత్‌ అంతర్జాతీయంగా తక్షణం ఎదుర్కొంటున్న కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి. అంతర్జాతీయ డిమాండ్‌ మందగమనం, ద్రవ్య పరిస్థితుల్లో క్లిష్టత, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం ముగింపుపై అనిశ్చితి, అభివృద్ధి చెందిన దేశాల్లో బలహీన ఆర్థిక పరిస్థితులు ఇందులో ప్రధానమైనవి.  
► దేశీయంగా చూస్తే, ఆదాయాలు తగ్గడం తీవ్ర ప్రతికూలాంశం. ఇది ద్రవ్యలోటు సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఇక బ్యాంకింగ్‌ మొండిబకాయిల సమస్యనూ ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.  
► ఇన్ని సమస్యలున్నా, 2019–20లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుంది.  
► కుటుంబాల పొదుపులు, కార్పొరేట్‌ మూలాల పటిష్టత భారత్‌ ఎకానమీకి సానుకూల అంశాలని ఏడీబీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ యసుయుకీ సవాడా పేర్కొన్నారు. యువత ఎక్కువగా ఉండడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డం, పెరుగుతున్న ఎగుమతులూ దేశానికి లాభిస్తున్నాయని అన్నారు.  
► వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2019–20లో సగటున 4.3 శాతంగా ఉంటే, 2020–21లో 4.6 శాతంగా ఉంటుందని ఏడీబీ పేర్కొంది. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం దేశంలో డిమాండ్‌ పటిష్టతకు దోహదపడే అంశంగా విశ్లేషించింది.  
► దేశంలో డిమాండ్‌ పరిస్థితులు బాగుండడం వల్లే దిగుమతులు పెరుగుతున్నాయి.  
► ఇక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతం (జీడీపీ విలువలో పోల్చి), 2020–21లో 2.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. అయితే క్యాడ్‌ సమస్యను భారత్‌ విజయవంతంగా అధిగమించే అవకాశం ఉంది. దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుండడమే దీనికి కారణం.  
► దక్షిణాసియాలో మందగమన పరిస్థితులు మొత్తం ఆసియాపై ప్రతికూలత చూపవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement