మాంద్యం ఎఫెక్ట్‌.. బడ్జెట్‌ కట్‌ | Economic Slowdown Effect Telangana Drafting Budget | Sakshi
Sakshi News home page

మాంద్యం ఎఫెక్ట్‌.. బడ్జెట్‌ కట్‌

Published Fri, Sep 6 2019 2:11 AM | Last Updated on Fri, Sep 6 2019 5:21 AM

Economic Slowdown Effect Telangana Drafting Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ తగ్గనుంది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే త్వరలో ప్రవేశపెట్ట బోతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో కేటాయింపులను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోత పడనుందని తెలుస్తోంది. రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను సుమారు రూ.లక్షా 65 వేల కోట్లకు కుదించే అవకాశాలున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం నెలకొని ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాబడుల్లో వృద్ధి సైతం మందగించిందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి.

ఆర్థిక మాంద్యానికి తోడు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు కూడా తగ్గాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాస్తవికతతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని స్పష్టమవుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాలపరిమితి సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఆరు నెలల పాటు అమలు చేయాల్సిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు తుదిరూపునిచ్చే పనిలో సీఎం కేసీఆర్‌ తలమునకలై ఉన్నారు. గత నెలాఖ రులో తొలి దఫా కసరత్తు చేసిన ఆయన.. గత బుధ, గురువారాల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్‌కు తుదిరూపునిచ్చారు. ఈ నెల 9న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర శాసనసభను సమావేశపరిచి అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

రూ.20 వేల కోట్లకు గండి!
రాష్ట్ర ఆదాయం–అవసరాలను బేరీజు వేసుకుని ప్రభుత్వం బడ్జెట్‌కు తుది రూపునిస్తోంది. రోజురోజుకూ ఆర్థిక మాంద్యం తీవ్రరూపం దాల్చుతుండ డంతో లక్ష్యాలతో పోల్చితే వచ్చే ఆరేడు నెలల్లో సుమారు రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. 2018–19లో రాష్ట్రం రూ.72,777 కోట్ల సొంత రెవెన్యూ రాబడులు సాధించగా, 2019–20లో రూ.94,776 కోట్లు సాధించే అవకాశాలున్నాయని ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం లెక్కకట్టింది.

అలాగే కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో రూ.28,042 కోట్లు రానున్నాయని అంచనా వేసింది. అయితే మాంద్యం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులు రూ.80వేల కోట్లకు మించే అవకాశాలు లేవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ.. పెట్రోల్‌ ఉత్పత్తులు, రవాణా రంగాల నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం కొంత తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు కూడా తగ్గాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించాల్సిన కేంద్ర ప్రన్నుల్లో రాష్ట్ర వాటాలో రూ.840 కోట్లు కోత పెట్టింది. దీంతో ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులను సైతం ప్రభుత్వం తగ్గించనుంది.

రైతుబంధు భారం తగ్గింపు దిశగా..
ఆర్ధికంగా రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడున్న పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు మారినందున దాదాపు అన్ని శాఖలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కొంత వరకు కోతలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారవర్గాలు చెబుతున్న ప్రకారం.. సాగు, సంక్షేమం, విద్యుత్‌ రంగాలకు ప్రాధాన్యతను కొనసాగించి మిగిలిన రంగాలకు కోతలు పెట్టే అవకాశాలున్నట్లు తెలిసింది. ఓటాన్‌ అకౌంట్‌లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లను కేటాయించగా, పూర్తిస్థాయి బడ్జెట్‌లో దాదాపు రూ.20వేల కోట్లకు తగ్గించే అవకాశాలున్నాయి. వ్యవసాయాభివృద్ధి కేటాయింపులు రూ.20,107 కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు తగ్గనున్నట్టు సమాచారం.

రైతుబంధు పథకం భారాన్ని కొంత వరకు తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్‌ సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.4,650 కోట్ల విద్యుత్‌ సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌లో కొత్త పథకాలకు కేటాయింపులు, కొత్త ప్రకటనలకు ఉండే అవకాశాలు సన్నగిల్లాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన సామాజిక పింఛన్ల పెంపును ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇంకా అమలు చేయాల్సిన ఇతర హామీలకు ఈ ఏడాది కేటాయింపులు ఉండే అవకాశాలు లేనట్లే. కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులు మినహా మిగిలినవాటికి బడ్జెట్‌లో భారీగా కోతలకు అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించవచ్చని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement