barities project
-
అమెరికా మార్కెట్‌పై ఏపీ దృష్టి
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలు ఉన్న ఏపీ మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ ద్వారా అమెరికా మార్కెట్లో తన వాటాను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా తొలి అడుగు వేసింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఎండీ వీజీ వెంకటరెడ్డి ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అమెరికాలో పర్యటించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్‌లో పలు సంస్థలతో భేటీ అయ్యారు. ఆయా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేస్తున్న బెరైటీస్‌పై అవగాహన కల్పించారు. దీంతో 3 కంపెనీలు రానున్న మూడేళ్లలో సుమారు రూ.750 కోట్ల విలువైన 16 లక్షల టన్నుల బెరైటీస్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికన్ మార్కెట్లో ఎక్కువగా సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్‌కు డిమాండ్ ఉంది. మంగంపేట ప్రాజెక్ట్‌లో ఇప్పటికే దాదాపు 70 లక్షల టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. వీటిని తక్షణం అమెరికన్ మార్కెట్లో విక్రయించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. చరిత్రలో తొలిసారి అమెరికాకు చెందిన మూడు కంపెనీలతో బెరైటీస్ విక్రయాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. ఏపీ ఎండీసీ చరిత్రలోనే తొలిసారి అమెరికాలోని ఇంధన సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుని మార్కెటింగ్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్పారు. మరో రూ.250 కోట్ల విలువైన బెరైటీస్ కొనుగోలుకు ఎంవోయూలు కుదిరే అవకాశం ఉందన్నారు. వివిధ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న బెరైటీస్‌తో పోలిస్తే మంగంపేట నుంచి అందించే ఖనిజం నాణ్యత, ధరల్లో వ్యత్యాసం, పారదర్శకమైన ఎగుమతి విధానంపై పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కంపెనీలు కూడా బెరైటీస్ కోసం సంప్రదింపులకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేసే బెరైటీస్‌లో లో–గ్రేడ్ ఖనిజాన్ని అమెరికా మార్కెట్లో విక్రయించడం, క్రమంగా అక్కడ మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఏపీ ఎండీసీకి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. నేరుగా అమెరికన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఏపీ ఎండీసీ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. -
మంగంపేట బెరైటీస్ బంగారం.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి. ఏకంగా 50 శాతం అధిక రేట్లను బిడ్డర్లు కోట్ చేశారు. ఈ ఖనిజం విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.925 కోట్లు ఆదాయం వస్తుంది. తాజా రేట్లతో అదనంగా రూ.260 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తోంది. అత్యంత పారదర్శక విధానాలు అవలంబిస్తోంది. అధునాతన పద్ధతుల్లో నాణ్యమైన ఖనిజాన్ని వెలికితీస్తోంది. దీంతో అంతర్జాతీయంగా బిడ్డర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఎ, బి, సి, డి గ్రేడ్ల ఖనిజం విక్రయం కోసం ఏపీఎండీసీ ఈ–ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ’ఎ’ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల ’బి’ గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి ఆక్షన్ నిర్వహించింది. ’ఎ’ గ్రేడ్ ఖనిజాన్ని మెట్రిక్ టన్నుకు అత్యధికంగా రూ.6,691కి బిడ్డర్లు కోట్ చేశారు. గతంలో దీని ధర రూ.4,625 కాగా ఇప్పుడు రూ.2,066 ఎక్కువ రేటు వచ్చింది. అలాగే టన్ను ’బి’ గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే ’బి’ గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా ఇప్పుడు రూ.1,875 ఎక్కువ లభించింది. సి, డి గ్రేడ్ ఖనిజం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయింది. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి, రికార్డు స్థాయిలో రేటు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మైనింగ్ రంగంలో పారదర్శకత, ఏపీఎండీసీని ప్రోత్సహించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీఎండీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తగిన సూచనలిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారు. బెరైటీస్‌తో పాటు బొగ్గు, గ్రానైట్, బీచ్ శాండ్, కాల్సైట్, గ్రాఫైట్, లెడ్, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను కూడా వెలికితీయడం ద్వారా ఏపీఎండీసీ మైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. లాభాల బాటలో పయనిస్తోంది. మున్ముందు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్నిస్తుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి నాణ్యత ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత ప్రమాణాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషన్స్ దాని సొంతం. గతేడాది రాయలసీమలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ, రికార్డు స్థాయిలో పెద్దమొత్తంలో బెరైటీస్‌ను వెలికితీసింది. ప్రతికూల వాతావరణంలోనూ ఖనిజాన్ని అందించడం వల్ల అంతర్జాతీయంగా పేరొచ్చింది. ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజాన్ని కూడా విక్రయించేందుకు కొనుగోలుదారులతో మాట్లాడుతున్నాం.. – ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
9 నెలలుగా పరిశ్రమలు మూత
హైదరాబాద్: మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు వైఎస్సార్ ప్రభుత్వం ఉపాధి చూపింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా అంతర్జాతీయ బిడ్డింగ్ ధరకే 40 శాతం ఖనిజాన్ని వారికి కేటాయించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తామని, భూమిని తక్కువ ధరకే ఇస్తామని, విద్యుత్తు, విలువ ఆధారిత పన్ను లాంటి పలు రాయితీలు ఇస్తామంటూ దేశ, విదేశాల్లో ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్సార్ జిల్లాలో 218 పరిశ్రమలు మూతపడేలా వైఎస్సార్ హయాంలో జారీ చేసిన జీవో రద్దు చేశారు. ప్రభుత్వాదాయానికి పైసా నష్టం లేకుండా బెరైటీస్ కొనుగోలు చేసి పరిశ్రమలకు వినియోగించుకుంటున్న తమకు అన్యాయం చేసేలా ఆ జీవోను రద్దు చేయడంపై మూతపడిన పరిశ్రమల యజమానులు, ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులైన వారికి 40 శాతం ఖనిజాన్ని బిడ్డింగ్ ధరకు ఇచ్చేలా వైఎస్సార్ ప్రభుత్వం 2004లో జీవో 296 జారీ చేసింది. టెండర్లలో అత్యధిక మొత్తానికి కోట్ చేసిన ఇచ్చే ధరకే స్థానిక పరిశ్రమలకు, నిర్వాసితులకు 40 శాతం ఖనిజాన్ని, టెండరు పొందిన వారికి 60 శాతం ఖనిజాన్ని ఎగుమతి కోసం కేటాయించాలనేది ఈ జీవో సారాంశం. ఈ జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది డిసెంబరు 15వ తేదీన జీవో నం. 206 జారీ చేసింది. జీవో గత ఏడాది డిసెంబరులో జారీ అయినా వాస్తవంగా గత ఏడాది ఆగస్టు నుంచే స్థానిక మిల్లులకు ఖనిజాన్ని సరఫరా చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానికంగా ఉన్న 218 పల్వరైజింగ్, ఇతర మిల్లులు ఖనిజం లేక మూతపడ్డాయి. దీనివల్ల వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 50 వేల మంది పనిలేక రోడ్లపాలయ్యారు. అప్పులు చేసి పరిశ్రమలు నెలకొల్పిన వారు తొమ్మిది నెలలుగా పైసా ఆదాయం లేక బ్యాంకులు, ఆర్థిక సంస్థల అప్పులకు కంతులు ఎలా కట్టాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ‘టెండర్లల్లో కోట్ అయిన అత్యధిక ధరకే స్థానిక కోటా కింద మేం ఖనిజం కొంటూ వచ్చాం. దీనివల్ల ప్రభుత్వానికి పైసా కూడా నష్టం ఉండదు. అలాంట ప్పుడు స్థానిక మిల్లులకు ఖనిజ కోటాను రద్దు చేసి పరిశ్రమలను మూతపడేలా చేయడం ఎలా సబబు? ఇదేనా బాబు మార్కు పారిశ్రామిక విధానం’ అని స్థానిక మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కోటాను రద్దు చేయడాన్ని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం తప్పుబడుతున్నారు.