హైదరాబాద్: మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు వైఎస్సార్ ప్రభుత్వం ఉపాధి చూపింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా అంతర్జాతీయ బిడ్డింగ్ ధరకే 40 శాతం ఖనిజాన్ని వారికి కేటాయించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తామని, భూమిని తక్కువ ధరకే ఇస్తామని, విద్యుత్తు, విలువ ఆధారిత పన్ను లాంటి పలు రాయితీలు ఇస్తామంటూ దేశ, విదేశాల్లో ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్సార్ జిల్లాలో 218 పరిశ్రమలు మూతపడేలా వైఎస్సార్ హయాంలో జారీ చేసిన జీవో రద్దు చేశారు.
ప్రభుత్వాదాయానికి పైసా నష్టం లేకుండా బెరైటీస్ కొనుగోలు చేసి పరిశ్రమలకు వినియోగించుకుంటున్న తమకు అన్యాయం చేసేలా ఆ జీవోను రద్దు చేయడంపై మూతపడిన పరిశ్రమల యజమానులు, ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులైన వారికి 40 శాతం ఖనిజాన్ని బిడ్డింగ్ ధరకు ఇచ్చేలా వైఎస్సార్ ప్రభుత్వం 2004లో జీవో 296 జారీ చేసింది. టెండర్లలో అత్యధిక మొత్తానికి కోట్ చేసిన ఇచ్చే ధరకే స్థానిక పరిశ్రమలకు, నిర్వాసితులకు 40 శాతం ఖనిజాన్ని, టెండరు పొందిన వారికి 60 శాతం ఖనిజాన్ని ఎగుమతి కోసం కేటాయించాలనేది ఈ జీవో సారాంశం.
ఈ జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది డిసెంబరు 15వ తేదీన జీవో నం. 206 జారీ చేసింది. జీవో గత ఏడాది డిసెంబరులో జారీ అయినా వాస్తవంగా గత ఏడాది ఆగస్టు నుంచే స్థానిక మిల్లులకు ఖనిజాన్ని సరఫరా చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానికంగా ఉన్న 218 పల్వరైజింగ్, ఇతర మిల్లులు ఖనిజం లేక మూతపడ్డాయి. దీనివల్ల వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 50 వేల మంది పనిలేక రోడ్లపాలయ్యారు. అప్పులు చేసి పరిశ్రమలు నెలకొల్పిన వారు తొమ్మిది నెలలుగా పైసా ఆదాయం లేక బ్యాంకులు, ఆర్థిక సంస్థల అప్పులకు కంతులు ఎలా కట్టాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.
‘టెండర్లల్లో కోట్ అయిన అత్యధిక ధరకే స్థానిక కోటా కింద మేం ఖనిజం కొంటూ వచ్చాం. దీనివల్ల ప్రభుత్వానికి పైసా కూడా నష్టం ఉండదు. అలాంట ప్పుడు స్థానిక మిల్లులకు ఖనిజ కోటాను రద్దు చేసి పరిశ్రమలను మూతపడేలా చేయడం ఎలా సబబు? ఇదేనా బాబు మార్కు పారిశ్రామిక విధానం’ అని స్థానిక మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కోటాను రద్దు చేయడాన్ని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం తప్పుబడుతున్నారు.
9 నెలలుగా పరిశ్రమలు మూత
Published Thu, May 21 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement