సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలు ఉన్న ఏపీ మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ ద్వారా అమెరికా మార్కెట్‌లో తన వాటాను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా తొలి అడుగు వేసింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఎండీ వీజీ వెంకటరెడ్డి ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అమెరికాలో పర్యటించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్‌లో పలు సంస్థలతో భేటీ అయ్యారు.
ఆయా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేస్తున్న బెరైటీస్‌పై అవగాహన కల్పించారు. దీంతో 3 కంపెనీలు రానున్న మూడేళ్లలో సుమారు రూ.750 కోట్ల విలువైన 16 లక్షల టన్నుల బెరైటీస్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికన్ మార్కెట్‌లో ఎక్కువగా సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్‌కు డిమాండ్ ఉంది. మంగంపేట ప్రాజెక్ట్‌లో ఇప్పటికే దాదాపు 70 లక్షల టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. వీటిని తక్షణం అమెరికన్ మార్కెట్‌లో విక్రయించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
చరిత్రలో తొలిసారి
అమెరికాకు చెందిన మూడు కంపెనీలతో బెరైటీస్ విక్రయాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. ఏపీ ఎండీసీ చరిత్రలోనే తొలిసారి అమెరికాలోని ఇంధన సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుని మార్కెటింగ్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్పారు.
మరో రూ.250 కోట్ల విలువైన బెరైటీస్ కొనుగోలుకు ఎంవోయూలు కుదిరే అవకాశం ఉందన్నారు. వివిధ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న బెరైటీస్‌తో పోలిస్తే మంగంపేట నుంచి అందించే ఖనిజం నాణ్యత, ధరల్లో వ్యత్యాసం, పారదర్శకమైన ఎగుమతి విధానంపై పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మరికొన్ని కంపెనీలు కూడా బెరైటీస్ కోసం సంప్రదింపులకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేసే బెరైటీస్‌లో లో–గ్రేడ్ ఖనిజాన్ని అమెరికా మార్కెట్‌లో విక్రయించడం, క్రమంగా అక్కడ మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఏపీ ఎండీసీకి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. నేరుగా అమెరికన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఏపీ ఎండీసీ ప్రతిష్ట పెరుగుతుందన్నారు.
అమెరికా మార్కెట్‌పై ఏపీ దృష్టి
Published Tue, May 24 2022 6:01 AM | Last Updated on Tue, May 24 2022 8:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment