![Sakshi Editorial On Donald Trump](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/trup1.jpg.webp?itok=CYF7z4ra)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్‌ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు.
గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట.
గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు.
2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది.
చివరకు హమాస్‌తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి.
అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది.
పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్‌ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్‌ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది.
వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి.
అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్‌ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు.
3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్‌కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు.
Comments
Please login to add a commentAdd a comment