సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన అమెరికా కార్నర్ (అమెరికా స్పేస్) దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. దేశంలో అహ్మదాబాద్ తరువాత అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండో కార్నర్ ఇది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఈ కార్నర్‌కు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సరేష్ సమక్షంలో అమెరికా కాన్సులేట్ అధికారులు, ఆంధ్రా వర్సిటీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఈ కార్నర్ ఆరంభమైనట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి సంబంధించి ఇది చాలా కీలక పరిణామమన్నారు.
రాష్ట్రంలో పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించాలని.. విదేశీ విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ కల్పించడంతో పాటు, విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడానికి వీలుగా అమ్మఒడి పథకం అమలుచేస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసి పేద విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి మన రాష్ట్ర విద్యార్థులు, యువతకు అమెరికా కార్నర్ చాలా ఉపయుక్తమవుతుందన్నారు. విద్యార్థులు, యువతలో నైపుణ్యాలు పెంపొందించి వారు మంచి అవకాశాలు పొందడానికి వీలుగా ఈ కేంద్రం పనిచేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
ఏపీతో బంధం బలోపేతం
ఆంధ్రా వర్సిటీలో అమెరికా స్పేస్ ఏర్పాటుచేయడం ద్వారా అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య బంధం మరింత బలోపేతం కానుందని అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకురావడంలో, మహిళా సాధికారతకు, యువతకు ఉత్తమ విద్య అందించి, ఉపాధి అవకాశాలు లభించేలా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషి.. అందిస్తున్న సహకారం ఎంతో శ్లాఘనీయమన్నారు. ఈ కేంద్రం తప్పకుండా ఆయన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఫలితాలు సాధిస్తుందన్నారు. అమెరికా–భారత్‌ల మధ్య విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సహకారం, బంధాల బలోపేతానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు.
ఏయూకి కలికితురాయి
విశాఖపట్నానికి.. ప్రత్యేకించి ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఈ రోజు ఒక సుదినమని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఈ కార్నర్‌ను దేశంలోనే అత్యుత్తమ కార్నర్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మాట్లాడుతూ.. ఈ కార్నర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అమెరికా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, అమెరికా పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయెర్, ఢిల్లీ నుంచీ రీజినల్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ స్పెషలిస్ట్ మార్క్ బుర్రెల్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో ‘అమెరికా కార్నర్’
Published Wed, Mar 24 2021 3:32 AM | Last Updated on Wed, Mar 24 2021 4:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment