సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, గత ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌తోపాటు మంత్రులు స్మృతి ఇరానీ, సంజయ్ ధోత్రే, ప్రకాష్ జవదేకర్, గోవా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. 12వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పలు అంశాలను వివరించారు.
‘కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేపట్టాం. పరీక్షల నిర్వహణలో ఒక విధానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఏదైనా ఆదేశాలు వస్తాయని భావించాం. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటేషన్‌తోపాటు ప్రతి చోటా ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. విద్యా రంగం ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ బోధన, ఉపాధ్యాయులకు శిక్షణతోపాటు సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షలు నిర్వహించే ముందే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ల కోటాను కేంద్రం పెంచాలి’ అని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
నీట్, జేఈఈ సెప్టెంబర్‌లో నిర్వహించాలి
జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి సురేష్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఇంటర్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నా రెండు నెలల సమయం కావాలి. పరీక్షల నిర్వహణ అనంతరం మూల్యాంకనం, ఫలితాల విడుదలకు మరో 15 రోజులు అవసరం. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఇప్పటికే నిర్వహించాం. ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులు తమ దగ్గరలోని సెంటర్‌లో రాసేందుకు వీలుగా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తున్నాం. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేలా యాప్ రూపొందించాం. సీబీఎస్‌ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర బోర్డు ద్వారా ఇంటర్ పరీక్షల నిర్వహణకు ముందుకు వెళ్తాం. జేఈఈ, నీట్ లాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు గత ఏడాది మాదిరిగా ఈసారి కూడా సెప్టెంబర్‌లో నిర్వహిస్తే మంచిది. అదే సమయంలో రాష్ట్రంలోని ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తాం’ అని చెప్పారు.
పరీక్షల నిర్వహణపై సీబీఎస్‌ఈ ప్రతిపాదనలు
పరీక్షల నిర్వహణపై సమావేశంలో సీబీఎస్‌ఈ కొన్ని ప్రతిపాదనలను చేసింది. పరీక్షలను యథాతథంగా మూడు గంటల పాటు ముఖ్యమైన పేపర్ల మేరకు నిర్వహించాలన్నది ఒక ప్రతిపాదన. పరీక్షల సమయాన్ని సగానికి తగ్గించి అందుకు అనుగుణంగా ప్రశ్నపత్రాల్లో, ప్రశ్నల్లో మార్పులు చేయడం, వ్యాసరూప ప్రశ్నలకు బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వడం, పరీక్షలను ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే నిర్వహించి అక్కడే మూల్యాంకనం చేసి ఫలితాలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీబీఎస్‌ఈ ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను ఈనెల 25వ తేదీలోగా పంపాక వాటిని అనుసరించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment