విద్యార్థులకు నైపుణ్య శిక్షణ | Skill training for students in AP | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

Published Sat, Apr 24 2021 3:31 AM | Last Updated on Sat, Apr 24 2021 3:31 AM

Skill training for students in AP - Sakshi

సాక్షి, అమరావతి: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మక ఐటీ దిగ్గజ సంస్థ.. మైక్రోసాఫ్ట్‌ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో మైక్రోసాఫ్ట్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావడంగమనార్హం. శుక్రవారం వర్చువల్‌ విధానంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మైక్రోసాఫ్ట్‌ ఆసియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ మజ్‌హరి, ఆ సంస్థ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి, ఆ సంస్థ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఒమిజ్వాన్‌ గుప్తా, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్‌ హరికృష్ణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం సంస్కరణలే ప్రధాన కారణం..
గుజరాత్‌ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నా.. తొలుత ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన వెంటనే చక్కటి ఉపాధి పొందే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు 42 రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం వల్ల వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత మహేశ్వరి మాట్లాడుతూ.. ఏపీతో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని చెప్పారు. దేశంలో డిజిటల్‌ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి ఈ డిజిటల్‌ స్కిల్లింగ్‌ పునాదిలా పనిచేస్తుందన్నారు. ఏపీ యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి.. వారు మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి తాము కంకణబద్ధులై ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ఆయనకి కరోనా పాజిటివ్‌ రావడంతో పాల్గొనలేదు. 

వెంటనే ఉద్యోగం పొందే వీలు..
శిక్షణ పూర్తి చేసుకున్నవారికి మైక్రోసాఫ్ట్‌ ఇచ్చే సర్టిఫికెట్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా సంబంధిత కోర్సుకు సంబంధించిన రంగాల్లో వెంటనే ఉద్యోగం పొందే వీలు కలుగుతుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారిలో 70 శాతం మందికి తక్షణంఉద్యోగం లభించే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి లింక్డ్‌ఇన్‌ లెర్నింగ్‌ అందించే 8,600 కోర్సుల్లో శిక్షణ తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్‌ 100 అమెరికన్‌ డాలర్ల గిఫ్ట్‌ వోచర్‌  ఇవ్వనుంది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్‌ అందించే ఇతర కోర్సులను నేర్చుకోవడం ద్వారా మరిన్ని నైపుణ్యాలు పెంచుకోవచ్చు. 

42 కోర్సుల్లో శిక్షణ, సర్టిఫికెట్‌ 
ఈ ఒప్పందం ద్వారా మైక్రోసాఫ్ట్‌ రాష్ట్రంలో 300కుపైగా కాలేజీల్లోని విద్యార్థులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల్లోని 1,62,000 మందికి 42 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్‌ లెర్నింగ్‌ కింద ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365 వంటి 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ఇందులో కొన్ని కోర్సుల సమయం 40 గంటలు, కొన్ని కోర్సుల నిడివి 160 గంటల వరకు ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement