AP Inter Exams 2021, 1st And 2nd Year Exams Postponed- Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు వాయిదా

Published Mon, May 3 2021 4:35 AM | Last Updated on Mon, May 3 2021 9:43 AM

Postponement of inter‌ examinations - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షల  నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటూ, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

మన విద్యార్థులు వెనుకబడకూడదనే..
’కోవిడ్‌ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే రూపొందించిన విషయం తెలిసిందే. కానీ 10వ తరగతి, 11, 12వ తరగతి (ఇంటర్‌) పరీక్షలకు సంబంధించి దేశమంతా వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం, ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు  నిర్వహించారు. మరికొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల పరీక్షలు రద్దు చేసి పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. పరీక్షలు రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివే విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్‌లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ, ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షలకు కూడా ఇంటర్‌లో కనీసం నిర్దిష్ట శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి.

పిల్లల కెరీర్‌ పరంగా చూసినా, ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మార్కులే పై చదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ మన విద్యార్థులు వెనకబడకుండా చూడాలనే బాధ్యతతో పరీక్షల నిర్వహణకు మనందరి ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడింది. పూర్తిగా కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావించాం. అదీగాక పిల్లల ప్రాక్టికల్స్‌ పూర్తి అయ్యాయి కాబట్టి ఇక మిగిలిన పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం 3 గంటల పరీక్ష మిగిలి ఉంది.

పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని  నిర్ణయించాం. ఇందుకోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం. అయితే దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, దీన్ని పరిగణలోకి తీసుకుంటూ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటిస్తుంది. ఇదే విషయాన్ని రేపు హైకోర్టుకు కూడా తెలియజేస్తాం.

ఇంటింటా చదువుల విప్లవం..
ఇంటింటా చదువుల విప్లవంతో ఈతరం విద్యార్థులు ప్రపంచంలో గొప్పగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 23 నెలలుగా ఎంత తాపత్రయపడుతోందో ప్రతి కుటుంబానికీ తెలుసు. జగనన్న అమ్మ ఒడి, నాడు –నేడు, ఇంగ్లీష్‌ మీడియం, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ లాంటి అనేక పథకాలను తెచ్చి కోవిడ్‌ సమయంలో కూడా వెనుకంజ వేయకుండా అమలు చేస్తోంది. నాణ్యమైన చదువుల ద్వారా ప్రతి కుటుంబం స్థితిగతులను గొప్పగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కన్న బిడ్డలమీద తల్లిదండ్రులకు ఎంత బాధ్యత, మమకారం ఉంటుందో రాష్ట్రంలో పిల్లల పట్ల మనందరి ప్రభుత్వానికీ అంతే బాధ్యత, మమకారం ఉంది. వారి భవిష్యత్తును గొప్పగా నిర్మించేందుకు ఇక మీదట కూడా ఆలోచనా చేస్తాం’. 

నేటి నుంచి జూనియర్‌ కాలేజీలకు సెలవులు
రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు సోమవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈనెల 5 నుంచి జరగాల్సిన  ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు. పరీక్షల తేదీలను ప్రకటించిన అనంతరం బోధన,  బోధనేతర సిబ్బంది అందరూ కళాశాలలకు హాజరు కావాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement