పరిశ్రమలకు ‘చంద్ర’గ్రహణం | Small Industries Closed In TDP Governance | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు ‘చంద్ర’గ్రహణం

Published Wed, Mar 20 2019 10:38 AM | Last Updated on Wed, Mar 20 2019 10:38 AM

Small Industries Closed In TDP Governance - Sakshi

ఒకే అబద్ధాన్ని పలు మార్లు చెప్పి జనాన్ని నమ్మించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆలూచూలూ లేకుండానే  రూ.లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసిన బాబు సర్కార్‌ వాస్తవానికి ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పిన పాపానపోలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువై గతంలో ఉన్న పాత పరిశ్రమలు సైతం మూతపడగా మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. పర్యవసానంగా బాబు సర్కారు చెప్పినట్లు లక్షలాది మందికి కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు సైతం పోగొట్టుకుని రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని చంద్రబాబు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. అయితే ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్న మూడు, నాలుగు సంస్థలు సైతం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయులు లెక్కగట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం.

పారిశ్రామికవేత్తల వెనుకడుగు
కందుకూరు మండలం కోవూరు వద్ద రంగా ఫర్టికల్‌ బోర్డు(ఆగ్రో బేస్డ్‌ సంస్థ) ఏర్పాటవుతుందని చెప్పారు. దీంతో పాటు మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద బీబీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(మినరల్‌ బేస్డ్‌) పొన్నలూరు మండలం వేలటూరు వద్ద వీఎస్‌ఎల్‌ సోలార్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, వెలిగండ్ల మండలం మొగళ్లూరు వద్ద  ఆర్‌కేఎస్‌ టెక్నో విజన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవర్‌ జనరేషన్‌), పొదిలి మండలం ఓబులక్కపల్లి వద్ద  స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్‌ (ఫుడ్‌ అండ్‌ ఆగ్రో) తదితర పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు బాబు సర్కారు ప్రకటించింది.

ఇదే తరహాలో జాసన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఫెర్టిలైజర్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌), మోహన్‌ వెల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇండస్ట్రియల్‌ పార్కు), రంగా ఫర్టికల్‌ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్‌ సింటెక్స్‌ టెక్స్‌టైల్స్‌ తదితర కంపెనీలు జిల్లాలో దొనకొండ, ఇతర ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమల కోసం  దొనకొండ మండలంలోని పలు గ్రామాలలో 25,886 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో  2450 ఎకరాలను ఎపీఐఐసీకి బదలాయించారు. ఉక్రెయిన్‌ దేశానికి చెందిన టైటాన్‌ ఏవియేషన్‌ ప్రతినిధులు యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ల తయారీకి, పైలట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు నిమిత్తం మొదట మూడు విడుతలుగా పరిశీలించారు.

రూ.500 కోట్లతో, 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.   6,200 ఎకరాల భూములు అడిగారు. రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో ఎంఎస్‌ వైట్‌ స్టోన్, కేప్‌ టౌన్, సౌత్‌ ఆఫ్రికా వారి ఆర్థిక సహాకారంతో రష్యా, ఉక్రెయిన్‌ దేశ సాంకేతిక సహకారంతో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు అప్పట్లో చెప్పారు. 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. స్పెయిన్‌ దేశానికి చెందిన ఇండియానా కంపెనీ వాహనాల పరిశోధన కేంద్రం వారు రూ.1500 కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 500 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మేకింగ్‌ ఏపీలో భాగంగా యాంటనోఫ్‌ ఫర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ముడిసరుకు రవాణా సంస్థ ఎన్‌డీఆర్‌ సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నూతనంగా  400 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు.

రామాయపట్నం ఊసేది 
జిల్లాలో రామాయపట్నం నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పోర్టును పట్టించుకోలేదు. తీరా ఎన్నికల వేళ రూ.4,500 కోట్లతో రామాయపట్నం పోర్టును నిర్మిస్తున్నట్లు చంద్రబాబు శంఖుస్థాపన రాయి వేశారు. దీంతో పాటు రూ.24500 కోట్లతో ఏషియన్‌ పేపర్‌ పల్ప్‌ పరిశ్రమకు సైతం బాబు శంఖుస్థాపన చేశారు. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా పనుల్లో పురోగతి లేదు. పరిశ్రమలు ముందే పూర్తి చేసి ఉంటే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది.

ప్రాభవం కోల్పోతున్న పలకల పరిశ్రమలు 
ఒకప్పుడు వైభవంగా విరాజిల్లిన మార్కాపురం పలకల పరిశ్రమ ఆదరణ కరువై మూత దశకు చేరుకుంది. మార్కాపురం పట్టణ శివారులో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఈ పరిశ్రమ నడుస్తోంది. ఏడెనిమిదేళ్ల క్రితం 100 ఫ్యాక్టరీలతో 12 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ ప్రస్తుతం కేవలం 45 చిన్న పరిశ్రమలతో 4 వేల మందికి కూడా పని కల్పించలేని పరిస్థితికి చేరుకుంది. విద్యుత్‌ బిల్లులు పెరగడం, బ్యాంకు రుణాలు అందకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువవడంతో పలకల పరిశ్రమ మూతపడే స్థితికి చేరింది.

కష్టాల్లో కూరుకుపోయిన గ్రోత్‌ సెంటర్లు
కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992లో ఏపీఐఐసీ గ్రోత్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున మొత్తం 164 ఎకరాల భూములు కేటాయించింది. 2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్‌ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్‌ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్‌ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్‌ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు.

పసుపు, కారం పొడి ప్యాకింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్‌ చార్జీల పెంపు, జీఎస్‌టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. గ్రోత్‌ సెంటర్లో భూముల వివాదం వల్లే పరిశ్రమలు రావడం లేదని తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్‌ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందుకోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్‌ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ ఆ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

పన్ను రూపంలో వసూళ్లు  
గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమ ఏర్పాటు చేసిన స్థలాన్ని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అధికారులు వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ.7 లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు 20 ఏళ్లుగా ఇదే వ్యవహారం సాగిస్తున్నారు. ఈ నిధులతో ఇండస్ట్రియల్‌ ఏరియాలో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఆ దాఖలాలు మాత్రం లేవు. దీంతో ఇండస్ట్రియల్‌ ఏరియా చిల్లచెట్లు, మురుగుతో అధ్వానంగా తయారైంది.

గుళ్లాపల్లిలో 40 పరిశ్రమలు మూత
మద్దిపాడు మండలంలోని గుళ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో 1,271 ఎకరాల్లో గ్రోత్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 644 ప్లాట్లు వేసి పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్‌ హయాంలో ఇక్కడ 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లతో పాటు పలురకాల పరిశ్రమలు ఏర్పాటుయ్యాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు భారీ పరిశ్రమలు రాలేదు. గడిచిన నాలుగేళ్లలో పది గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు మాత్రమే ఏర్పాటు కాగా 40 పరిశ్రమలు మూతపడటం గమనార్హం. జీఎస్‌టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్‌ చార్జీలు మరింత భారం కావడంతోపాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. వైఎస్‌ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు.

వైఎస్సార్యాంలో రాయల్టీపై రాయితీ
2008–09 నుంచి ఆర్థిక మాంద్యం కారణంగా జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్‌ క్వారీలు నష్టాలలో కూరుకుపోయి మూతపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో నాటి సీఎం దివంగత వైఎస్సార్‌.. క్వారీల యజమానులు గ్రానైట్‌ రాళ్లపై ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీపై మొదటి సంవత్సరం 40 శాతం, రెండో సంవత్సరం 20 శాతం రాయితీ ఇచ్చి ఆదుకున్నారు. దీంతో చీమకుర్తిలో 75 వరకు రన్నింగ్‌ కండిషన్‌లో ఉన్న గ్రానైట్‌ క్వారీలతో పాటు 300 గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లకు కూడా మేలు కలిగింది.

గ్రానైట్‌ పరిశ్రమలకు జగన్‌ భరోసా 
పాదయాత్రలో భాగంగా చీమకుర్తిలో పర్యటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అప్పులు తెచ్చి కట్టిన గ్రానైట్‌ ఫ్యాక్టరీలు నడపలేక మూతపడుతున్నాయని యజమానులు విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీల యజమానులు క్వారీల వద్ద కొనుగోలు చేసే గ్రానైట్‌ రాయల్టీపై 40 శాతం రాయితీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. విద్యుత్‌ చార్జీల్లో కూడా రాయితీ ఇస్తానని భరోసా ఇచ్చిరు. తద్వారా 1,200 గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు మేలు కలగనుంది.

పారిశ్రామిక రాయితీలకు సర్కారు ఎగనామం
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పిస్తూ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్లపాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సు ఇవ్వాల్సి ఉన్నా అవేవి అందడం లేదు.
  
జిల్లాలో 60 శాతం పరిశ్రమలు మూత 
ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో ఇటీవల కాలంలో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. జీఎస్టీ వచ్చాక అదనపు పన్నులు వేయడం, విద్యుత్‌ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచడం తదితర కారణాలతో బ్యాంకు కిస్తీలు కూడా చెల్లించలేక చిన్న పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయి. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ.2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెబుతున్నారు. ఇవి కాక జిల్లా వ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. రూ.2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇందులో 60 శాతం పరిశ్రమలు(సుమారు 4 వేలు) మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. విద్యుత్‌ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి.

70 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి 
ప్రస్తుతం ఇండస్ట్రీస్‌ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కొంతమేర మాత్రమే చిన్న పరిశ్రమలకు వచ్చాయి. రావాల్సిన సబ్సిడీలు ఇతరత్రా రాయితీలపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. జీఎస్టీ మరింత ఇబ్బందికరంగా మారింది. 70 శాతం పరిశ్రమలు మూత దశకు చేరుకున్నాయి. 
– కొమ్మి కృష్ణయ్య, వెంగమాంబ గ్రానైట్‌ యజమాని

నష్టపోతున్నాం
ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఒక ప్లాటు తీసుకుని గ్రానైట్‌ ఇండస్ట్రీ స్థాపించా. జీఎస్‌టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నుల కారణంగా ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. ఉత్పత్తికి తగ్గట్లు డిమాండ్‌ లేకపోవడంతో పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. దీంతో భారీగా నష్టపోతున్నాం. దీనికి తోడు పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది.
– సయ్యద్‌ నజీర్, నాసా గ్రానైట్స్‌ అధినేత, సింగరాయకొండ

ఉద్యోగం లేదు.. భృతి లేదు
మార్కాపురం ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో మూడేళ్ల కిందట వివరాలు నమోదు చేసుకున్నా. ఒక్కసారి కూడా ఉద్యోగానికి రమ్మని కాల్‌ లెటర్‌ పంపలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నాలాంటి యువత అంతా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఐదేళ్ల క్రితం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది కూడా ఇటీవల కొంత మందికే ఇచ్చారు. 
– నాలి బాలగురవయ్య, బీఏ, మార్కాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement