beraitis
-
మంగంపేట బెరైటీస్ బంగారం.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి. ఏకంగా 50 శాతం అధిక రేట్లను బిడ్డర్లు కోట్ చేశారు. ఈ ఖనిజం విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.925 కోట్లు ఆదాయం వస్తుంది. తాజా రేట్లతో అదనంగా రూ.260 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తోంది. అత్యంత పారదర్శక విధానాలు అవలంబిస్తోంది. అధునాతన పద్ధతుల్లో నాణ్యమైన ఖనిజాన్ని వెలికితీస్తోంది. దీంతో అంతర్జాతీయంగా బిడ్డర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఎ, బి, సి, డి గ్రేడ్ల ఖనిజం విక్రయం కోసం ఏపీఎండీసీ ఈ–ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ’ఎ’ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల ’బి’ గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి ఆక్షన్ నిర్వహించింది. ’ఎ’ గ్రేడ్ ఖనిజాన్ని మెట్రిక్ టన్నుకు అత్యధికంగా రూ.6,691కి బిడ్డర్లు కోట్ చేశారు. గతంలో దీని ధర రూ.4,625 కాగా ఇప్పుడు రూ.2,066 ఎక్కువ రేటు వచ్చింది. అలాగే టన్ను ’బి’ గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే ’బి’ గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా ఇప్పుడు రూ.1,875 ఎక్కువ లభించింది. సి, డి గ్రేడ్ ఖనిజం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయింది. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి, రికార్డు స్థాయిలో రేటు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మైనింగ్ రంగంలో పారదర్శకత, ఏపీఎండీసీని ప్రోత్సహించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీఎండీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తగిన సూచనలిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారు. బెరైటీస్‌తో పాటు బొగ్గు, గ్రానైట్, బీచ్ శాండ్, కాల్సైట్, గ్రాఫైట్, లెడ్, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను కూడా వెలికితీయడం ద్వారా ఏపీఎండీసీ మైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. లాభాల బాటలో పయనిస్తోంది. మున్ముందు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్నిస్తుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి నాణ్యత ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత ప్రమాణాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషన్స్ దాని సొంతం. గతేడాది రాయలసీమలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ, రికార్డు స్థాయిలో పెద్దమొత్తంలో బెరైటీస్‌ను వెలికితీసింది. ప్రతికూల వాతావరణంలోనూ ఖనిజాన్ని అందించడం వల్ల అంతర్జాతీయంగా పేరొచ్చింది. ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజాన్ని కూడా విక్రయించేందుకు కొనుగోలుదారులతో మాట్లాడుతున్నాం.. – ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
పేరు గ్లోబల్... అంతా గోబెల్స్
గతంలో వైఎస్సార్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వారా అంతర్జాతీయ సంస్థల మధ్య పోటీ నెలకొల్పి ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా బెరైటీస్ ధర నిర్ణయించింది. దీనికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందాలతో ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు కుట్ర పన్నింది. వాటికి అప్పనంగా లాభాలు చేకూర్చేందుకు ఏకంగా తన జీవోలను తానే సవరించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70-75 శాతం కనీస ధర నిర్ణయించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సును కాదని, బెరైటీస్ కనీస ధరను 65 శాతానికి తగ్గించింది. గ్లోబల్ టెండర్లంటూ గోబెల్స్ ప్రచారంతో స్థానిక కోటా రద్దు చేసి 218 పరిశ్రమలు మూతపడేలా చేసింది. తద్వారా సుమారు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి గండికొట్టి వీధులపాలు చేసింది. హైదరాబాద్: బెరైటీస్ విక్రయ టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. టెండర్ల ద్వారా రాబడి పెంచుకోవాల్సిన ప్రభుత్వమే ఖజానాకు గండికొట్టి ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు సహకరించింది. చంద్రబాబు సర్కారు గత జనవరి 27వ తేదీ జారీ చేసిన జీవో 22ను సవరిస్తూ ఈ నెల 4న జారీ చేసిన జీవో 163 ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ప్రత్యక్ష అండదండలుండటంతో ఈ నెల 8న జరిగిన టెండర్లలో పాల్గొన్న నాలుగు ప్రైవేటు సంస్థలు రింగ్‌గా మారి తక్కువ ధరకే ఖనిజాన్ని కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్ (కడప) జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్ ఖనిజాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని గత జనవరిలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ధర నిర్ణయించేందుకు టీడీపీ సర్కారు నిపుణుల కమిటీని నియమించింది. చెన్నైలో ప్రకటించే అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70 - 75 శాతం కనీస (బేసిక్)ధరగా నిర్ణయించి బెరైటీస్ విక్రయానికి గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. (టన్ను బెరైటీస్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. వెయ్యి ఉంటే రూ. 700 - 750 మధ్య కనీస ధర నిర్ణయించాలి). ఈ మేరకు ప్రభుత్వం జనవరి 27న జీవో 22 జారీ చేసింది. దీని ప్రకారం టన్ను ధర ‘ఎ’ గ్రేడ్ రూ.6,750, ‘బి’గ్రేడ్ రూ. 5,360 (అంతర్జాతీయ ధరలో సుమారు 71 శాతం) ఖరారు చేసి గత ఫిబ్రవరి 15న ఏపీఎండీసీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. అంతర్జాతీయ సంస్థలు పోటీకి రాకుండా స్థానిక సంస్థలు, ప్రభుత్వం రాజకీయం నడిపాయి. ముందే కుదిరిన ఒప్పందంతో... ముందే వాటితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం బెరైటీస్ కనీస ధరను అంతర్జాతీయ మార్కెట్ ధరలో 65 శాతానికి తగ్గించి టన్ను ‘ఎ’ గ్రేడ్ రూ. 6000, ‘బి’ గ్రేడ్ రూ. 4,750కి నిర్ణయించింది. ఈ మేరకు తగ్గించిన కనీస ధరతో టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం గత నెల 14న రెండో విడత టెండర్లు ఆహ్వానించింది. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ధరలో 65 - 70 శాతానికి కనీస ధరను తగ్గించేందుకు వీలుగా జీవో 22ను సవరిస్తూ ప్రభుత్వం ఈ నెల4గున జీవో 163 జారీ చేసింది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు 25 నుంచి 30 శాతం లాభం చాలదంటూ ప్రభుత్వం కనీస ధరను 65 శాతానికి తగ్గించడం ద్వారా 35 శాతం లాభం ఉండేలా చేసింది. ఈ మేరకు ముందే ధరలు తగ్గించి టెండర్లు ఆహ్వానించి తర్వాత ఈ జీవో జారీ చేసింది. నిపుణుల సిఫార్సుల మేరకు బెరైటీస్ కనీస ధరను నిర్ణయించిన ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని ధరలను తగ్గించడంలో భారీ మతలబు ఉందని, ఈ వ్యవహారం వెనుక కీలక నేత పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ధరలు తగ్గించడంవల్ల ఏపీఎండీసీ కేవలం నాలుగు లక్షల టన్నుల ఖనిజానికి రూ. 28 కోట్ల రాబడి కోల్పోయింది. టెండర్లలో పాల్గొన్న ట్రైమాక్స్, ఆశాపురం, ఓరన్ హైడ్రో కార్బన్, ఆశాపుర సంస్థలు రింగ్‌గా మారి కనీస ధరకే టెండర్లు దక్కించుకోవడంవల్ల ఏపీఎండీసీ రూ. 150 కోట్ల వరకూ ఆదాయం కోల్పోయినట్లేనని అధికారులు అంటున్నారు. పోటీ ఏర్పడితే బేసిక్ ధరపై రూ. 1500 వరకూ అదనంగా రేటు పలికేదని వారు పేర్కొన్నారు. -
12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజు రద్దు
ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని 12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గనులు విస్తారంగా ఉన్నాయి. గనులు, భూగర్భవనరులశాఖ నుంచి అనుమతి పొందిన ఈ లీజుదారులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించటంతో లీజులను రద్దు చేస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా యజమానుల్లో స్పందన కరువవ్వటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీజుకు 25 ఏళ్ల కాలపరిమితితో గతంలో అనుమతించారు. సీఎస్ పురం మండలం చినపనాయుడుపల్లిలో 53.93 ఎకరాలకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదే మండలం మూసునూరులో యూ.మల్లికార్జున రావు కు 38.29 ఎకరాల్లో క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. పెద్దారవీడు మండలం చెట్లమిట్ట పంచాయతీ పరిధిలోని రాజంపల్లిలో కృష్ణమినరల్స్కు ఇచ్చిన 11.563 హెక్టార్లు క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం వింజావతిపాడులో పి.సుబ్బారావుకు ఇచ్చిన 9.226 హెక్టార్ల క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. అదే మండలం సిద్ధవరం గ్రామంలోని ఆర్.మురళీధరరెడ్డికి ఇచ్చిన 43.769 హెక్టార్లలోని క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. పామూరు మండలం సిద్ధవరం పరిధిలోని చంద్రకాంత్ మైన్స్ అండ్ మినరల్స్ 27.409 హెక్టార్లలో ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండం పరిధిలోని 21.243 హెక్టార్లను ఎస్కే నాగూర్‌వలికి ఇచ్చిన క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువులో 21.514 హెక్టార్లలో యూబీ మినరల్స్ మేనేజింగ్ పార్టనర్ పి.ఉదయభాస్కరరావుకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదేవిధంగా కొమరోలు మండలం మొట్టుపల్లి గ్రామంలోని 4.914 హెక్టార్లలో బెరైటీస్ గనుల లీజు పొందిన బి.సుధాకర్‌కు చెందిన లీజును కూడా రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.