సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీ పవర్) సొంతం చేసుకుంది. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్దదైన హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కేందాన్ని నిర్వహిస్తోంది. మూడు ప్యాకేజీలకు జేపీ పవర్ ఎక్కువ ధర కోట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) దానికే టెండర్లు ఖరారు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం లభిస్తుంది. గతేడాది కంటే ఇది 20 శాతం అధికం. పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకాలు జరిపేందుకు అర్హత గల సంస్థను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర గనుల శాఖ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకు అప్పగించింది. ఎంఎస్‌టీసీ ఈ–టెండర్లు ఆహ్వానించగా కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
మూడు సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించి ఎక్కువ ధర కోట్ చేసిన జయప్రకాష్ పవర్ వెంచర్స్‌కు టెండర్‌ను కట్టబెట్టారు. ఈ సంస్థ ఒకటో ప్యాకేజీకి రూ.477.50 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.745.50 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.305.60 కోట్లను కోట్ చేయగా మిగిలిన రెండు సంస్థలు అంతకంటే తక్కువ ధర కోట్ చేశాయి. రెండేళ్లపాటు జేపీ పవర్ ఇసుక తవ్వకాలను నిర్వహించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానంలో ప్రభుత్వానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.161.30 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ.380.00 కోట్ల నికర ఆదాయం లభించింది. కాగా టెండర్‌ను దక్కించుకున్న జేపీ గ్రూప్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ ప్రైవేటు సంస్థగా ఉంది. విద్యుత్ రంగంలోనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణం, సిమెంట్, రోడ్ల నిర్మాణం, ఆతిథ్యం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, క్రీడా, విద్యా రంగాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది.
ఆన్‌లైన్ దరఖాస్తు అవసరం లేదు..
► రీచ్‌ల వద్దే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నేరుగా ర్యాంపుల దగ్గర ఇసుక నాణ్యతను పరిశీలించి నచ్చిన రీచ్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకోవచ్చు. అక్కడ కావాల్సినంత ఇసుకను తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లవచ్చు.
► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రీచ్ వద్ద ఒకే ధర ఉంటుంది. దూరం ఆధారంగా, ప్రాంతాల వారీగా అప్పర్ సీలింగ్‌తో ఒక ధర నిర్ణయిస్తారు.
► ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఫిర్యాదులపై కఠిన చర్యలుంటాయి.
► ఇసుక అమ్మకాల్లో సిఫార్సులకు ఏమాత్రం అవకాశం ఉండదు.
► ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
► ఇసుక సరఫరాలో రవాణా కాంట్రాక్టర్, దళారీల ప్రమేయం ఉండదు.
► ఇకపై పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు అనుమతించరు.
► ఓపెన్ రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలను అనుమతించడం వల్ల నాణ్యమైన ఇసుక దొరుకుతుంది.
జేపీ పవర్‌కు ఇసుక తవ్వకం పనులు
Published Sun, Mar 21 2021 3:20 AM | Last Updated on Sun, Mar 21 2021 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment