ఇసుకరవాణాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ మాయల ఫకీర్ అని, దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక బకాసురులకు రారాజు చంద్రబాబునాయుడని ఎద్దేవా చేశారు. మండలంలోని జొన్నవాడ ఇసుకస్టాక్ యార్డు వద్ద గురువారం ఆయన ఇసుక వారోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు బాగా కురవడంతో నదులు, రిజర్వాయర్లు నిండి జలకళ సంతరించుకుందన్నారు. ఈ నేపథ్యంలో నదుల్లో ఇసుక తీయడం కష్టతరంగా మారిందన్నారు. ఈ క్రమంలో ఇసుక రవాణాలో జాప్యం జరిగిందని తెలిపారు. కనీసం ఈ మాత్రం జ్ఞానం లేని చంద్రబాబునాయుడు ఇసుకదీక్ష పేరిట డ్రామా ఆడడం ఆరోపణలు చేయడం అవివేకమన్నారు.
టీడీపీ హయాంలో జరిగినంత ఇసుకదోపిడీ ఎన్నడూ జరగలేదన్నారు. చంద్రబాబునాయుడి ఇంటి పక్కనే అనుమతులు లేకుండా ఇసుకను లారీల్లో తరలించారన్నారు. చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని అక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన దారుణంపై చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అటువంటి నీచమైన చరిత్ర ఉన్న చంద్రబాబునాయుడు నేడు ఇసుకదీక్ష పేరిట కొత్తనాటకానికి తెరలేపాడని ఎద్దేవా చేశారు. రాజకీయ ఓటమిని తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించినా చంద్రబాబునాయుడికి సిగ్గురాలేదన్నారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు కార్మికులపై లేనిపోని ప్రేమ ఒలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన నీచమైన సంస్కృతి అచ్చెన్నాయుడిదన్నారు.
అటువంటి వ్యక్తి నేడు కార్మికుల విషయంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కార్మికశాఖా మంత్రిగా అచ్చెనాయుడు ఏం ఉద్దరించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబునాయుడి దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు 151 మందిని విమర్శించే స్థాయి నీకెక్కడిదని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. 2014 నుంచి నేటి వరకు పవన్‌కల్యాణ్ చంద్రబాబు వద్ద సూట్‌కేసులు తీసుకుని ఇతర పార్టీలను విమర్శించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గత ఐదేళ్లలో జరిగిన ఇసుక దందాలు, అవినీతిపై ఎందుకు ప్రశ్నించలేదని ఆయన పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల పవన్‌కల్యాణ్‌ను చిత్తుగా ఓడించినా సిగ్గురాలేదన్నారు. చిరంజీవి గొప్ప వ్యక్తి అని, పవన్‌కల్యాణ్ చిరంజీవిని చూసి మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
టీడీపీ చార్జిషీట్ అంతా బోగస్
ఇసుక అక్రమ రవాణా విషయంలో టీడీపీ నేతలు విడుదల చేసి చార్జిషీట్ అంతా బోగస్ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తమ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పెట్టారని వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. సూరా శ్రీనివాసులురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు రీచ్‌కు సంబంధించి భాగం ఉన్నది వాస్తవమేనన్నారు. అయితే ఇక్కడ గుప్పెడు ఇసుక కూడా అక్రమ రవాణా జరగడం లేదనే విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక అక్రమ రవాణా విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. పట్టుబడితే రూ.2లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశానుసారం నాయకులందరూ ఆయన మాటలను పాటిస్తున్నామని, టీడీపీ నేతలు రాజకీయ ఓటమిని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారని, అధికారం పోయిందని ఇష్టానుసారం మాట్లాడితే సహించరని ఆయన తెలిపారు. ఆర్డీఓ డి. హుస్సేన్ బాషా మాట్లాడుతూ ఇసుక ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోమని ఆదేశించిందన్నారు. ఇసుక ఉత్పాదకత రోజుకు 2500 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం ఉందన్నారు. వారోత్సవాల సందర్భంగా దానిని 5వేల మెట్రిక్ టన్నులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో 188 చిన్న ఇసుకరీచ్‌లను సిద్ధంగా చేస్తున్నామని తెలిపారు. మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 12 ఇసుకరీచ్‌లకు గాను 8 రీచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. గతంలో ఇసుకను బయట జిల్లాలకు సరఫరా జరిగేదని, నేడు జిల్లా ప్రజలకే పరిమితం చేశారని తెలిపారు. ఏపీఎండీసీ డీజీఎం వెంకటరమణ మాట్లాడుతూ గతంలో ఇసుక సరఫరా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేదని, నేడు రాత్రి 10 గంటల వరకు రవాణా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ సురేష్‌బాబు, ఎస్సై జిలానీబాషా, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ తులసీమాల, ఐకేపీ ఏపీఎం లలిత, వైఎస్సార్‌సీపీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి, చెర్లో సతీష్‌రెడ్డి, గుమ్మా సుధాకరయ్య, మోహన్ మురళీకృష్ణ, సుధాకరయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment