
చంద్రబాబు చెంచాలకు ఉలుకెందుకు?: నల్లపరెడ్డి
రాష్ట్రంలో చంద్రబాబు ఆరాచక పాలన ఈనాటిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.
నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ఆరాచక పాలన ఈనాటిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వంచించడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. నయవంచక పాలన బాబు నైజం అని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నంద్యాల బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సీఎం చంద్రబాబు గురించి పొరపాటుగా ఏమీ మాట్లాడలేదన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి వంచించినందుకు ప్రజాక్షేత్రంలో ప్రజలే కాల్చి చంపినా ఫరవాలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రజల తరపున మాట్లాడారని చెప్పారు. హామీలను అమలు చేయాలని నిలదీస్తే చంద్రబాబుకు, ఆయన చెంచాలకు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. వారంతా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అవాకులు, చవాకులు పేలడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమస్యలను గాలికొదిలిన నాయకులను ప్రజలు మట్టి కరిపించడం ఖాయమని స్పష్టం చేశారు.