పేట్రేగిన ఇసుక మాఫియా.. అడ్డంగా దోచేస్తున్నారు! | Special Story On Sand Mafia In Telangana | Sakshi
Sakshi News home page

పేట్రేగిన ఇసుక మాఫియా.. పథకాల పేరుతో దోచేస్తున్నారు!

Published Mon, Apr 5 2021 12:34 AM | Last Updated on Mon, Apr 5 2021 9:20 AM

Special Story On Soil Mafia In Telangana  - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా చిన్న వాగులు, వంకలు మొదలు నదుల్లోని పెద్ద రీచ్‌ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. చిన్న ఇల్లు కట్టుకునే వారికి ఒక లారీ ఇసుక దొరకడమే కష్టమైతే.. మరోవైపు అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా వేలకొద్దీ లారీల్లో, ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికో, మరేదో స్కీమ్‌కో అని అనుమతులు తీసుకోవడం..లారీలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి ఇసుక నింపి తరలించడం.. తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముకోవడం పరిపాటి అయిపోయింది. యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాపై ‘సాక్షి’ ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది. అడ్డగోలుగా ఇసుక ఎలా తరలిపోతోంది, ఎక్కడెక్కడ, ఎలా అక్రమాలు జరుగుతున్నాయి, ఇసుక పాలసీలో లోపాలను ఎలా వాడుకుంటున్నారన్నది నిశితంగా పరిశీలించింది. అందులో గుర్తించిన అంశాలతో పరిశోధనాత్మక కథనం..

కల్వల మల్లికార్జున్‌ రెడ్డి, సాక్షి నెట్‌వర్క్‌
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి సమీపంలోని బిక్కేరు వాగు నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇవి. బిక్కేరు వాగు కేంద్రంగా నాగారం, అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో ప్రభుత్వ పథకాల పేరిట అనుమతులు తీసుకుని ఇసుకను ప్రైవేటు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.3500 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా రాత్రివేళ కూడా ఇష్టమొచ్చినట్టు ఇసుక తవ్వేస్తున్నారు. ఇసుక తరలించే కొన్ని ట్రాక్టర్లు, ట్రాలీలకు నంబర్లు కూడా లేకపోవడం గమనార్హం. 

ఈయన ఓ రైతు... అక్కడా, ఇక్కడా డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్నాడు. పునాది, పిల్లర్లు వేశాడు. శ్లాబ్‌ పని మొదలైంది. కానీ సమయానికి ఇసుక దొరక్క నిర్మాణం లేటవుతోంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుందామనుకుంటే.. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దొరకడం లేదు. తప్పనిసరిగా అడ్డగోలు రేటు పెట్టి బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయించిన రేటు లెక్కన అయితే.. ఒక లారీ ఇసుక (18 టన్నులు) సుమారు రూ. పది వేల వరకు ఉంటుంది. కానీ బ్లాక్‌లో ఏకంగా రూ.40 వేల దాకా చెల్లించి తీసుకోవాల్సి వస్తోంది. అది కూడా సమయానికి దొరకడం లేదు. ఇటు ఖర్చు పెరిగిపోయి, అటు నిర్మాణం ఆలస్యమై.. ఆయన ఉసూరుమంటున్నాడు.

జరగాల్సిందేంటి..
ప్రస్తుతం రాష్ట్రంలో 37 రీచ్‌ల నుంచి రోజూ సగటున 50వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను టీఎస్‌ఎండీసీ విక్రయిస్తోంది. వెలికి తీసిన ఇసుకను సమీపంలోని స్టాక్‌ పాయింట్లకు తరలించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా అమ్ముతోంది. ఈ విధానంలో ట్రాక్టర్‌కు 3.5 టన్నులు, 10 టైర్ల లారీకి (12 క్యూబిక్‌ మీటర్లు, 18 టన్నులు), 12 టైర్ల లారీకి (16 క్యూ.మీ, 26 టన్నులు), 14 టైర్ల లారీకి (20 క్యూ.మీ, 32 టన్నులు), 16 టైర్ల లారీకి (22 క్యూ.మీ, 35 టన్నులు) ఇసుక పరిమితి ఉంటుంది. ఒక్కో టన్నుకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

జరుగుతున్నది ఇదీ...
స్లాట్‌ బుకింగ్‌తోనే మొదలు...

ఆన్‌లైన్‌లో కొద్దిరోజుల పాటుతవ్వే ఇసుకకు సంబంధించిన స్లాట్‌ బుకింగ్‌ కేవలం ఐదు, పది నిమిషాల వ్యవధిలోనే ముగుస్తోంది. స్లాట్‌ బుకింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై సాధారణ వినియోగదారుడికి అవగాహన లేకపోవడం దళారులకు వరంగా మారింది. దళారులు, మరికొందరితో కలిసి వినియోగదారుల మాదిరిగా ఇసుకను బుక్‌ చేస్తున్నారు. దానిని బహిరంగ మార్కెట్‌కు తరలించి అమ్ముకుం టున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బందికి వాటాలు ముట్ట జెప్తున్నారు. ఇక మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కూడా స్లాట్‌ బుకింగ్‌ వరంగా మారింది. ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌తోపాటు డబ్బులను కూడా వారే చెల్లించి.. డిమాండును బట్టి ఒక్కో డీడీకి రూ.3వేల నుంచి రూ.7వేల వరకు అదనంగా వసూలు చేసుకుంటున్నారు.

తవ్వేది ఎక్కువ..చూపేది తక్కువ
రీచ్‌లలో అనుమతుల మేరకు తవ్వకాలు, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన పరిమాణాన్ని మాత్రమే లారీలు, ట్రాక్టర్లలో నింపడం, వరుస క్రమాన్ని పాటించడం టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణలో జరగాలి. రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద పర్యవేక్షణ కోసం టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారులను (పీఓ) నియమించింది. రీచ్‌లలో ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలను బట్టి ఇసుక తరలింపు పరిమితి ఉంటుంది. కానీ ఇష్టమొచ్చినట్టుగా టన్నుల కొద్దీ అదనంగా ఇసుక నింపి తరలిస్తున్నారు. ఇలా రోజూ వేలాది లారీల్లో అదనంగా ఇసుక తరలుతుండటంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇక.. స్టాక్‌ పాయింట్ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సినప్పుడు సీరియల్‌ నంబర్‌ త్వరగా వచ్చేందుకు ఒక్కో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఒకే పర్మిషన్‌తో, ఒకే నంబర్‌.. పదుల ట్రిప్పుల్లో ఇసుక


కేవలం ఒకే పర్మిషన్‌తో, ఒకే నంబర్‌ఉన్న వేర్వేరు లారీలతో పదుల సంఖ్యలో ఇసుక తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. ఇందుకు కొందరు సిబ్బంది సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఇప్పటికే పలుమార్లు లారీలు పట్టుబడ్డాయి కూడా.

‘వే బ్రిడ్జి’లలో బరువు మారుస్తూ..
అదనంగా నింపుకున్న ఇసుకతో బయలుదేరే లారీలకు దొంగ వేబిల్లులు తీసుకుంటున్నారు. పరిమితి మేరకే లోడ్‌ ఉన్నట్టుగా చూపుతున్నారు. కొందరు వేబిల్లుల నిర్వాహకులు సహకరిస్తూ తప్పుడు తూకాలు నమోదు చేస్తున్నారు. టీఎస్‌ఎండీసీ ద్వారా రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. కానీ 13 చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి.

గిరిజన సహకార సొసైటీల ముసుగులో..
1998 నాటి పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే మైనింగ్‌ లీజు ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నాయి. నదీ సంరక్షణ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాల్లో యంత్రాలను వినియోగించకూడదు. అయితే కొన్ని ఇన్‌ఫ్రా కంపెనీలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు సబ్‌ కాంట్రాక్టుల రూపంలో గిరిజనులకు కేటాయించిన ఇసుక క్వారీలను చేజిక్కించుకుంటున్నారు. ములుగు జిల్లాలోని పలు గిరిజన సొసైటీల్లో జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై గతంలో టీఎస్‌ఎండీసీకి ఫిర్యాదులు కూడా అందాయి. మణుగూరు ప్రాంతంలోని నాలుగు గిరిజన సొసైటీల లైసెన్సులు కూడా ఇతరుల చేతుల్లోనే ఉన్నాయి. ఇక.. రీచ్‌లలో ఎంత విస్తీర్ణంలో ఎంత పరిమాణంలో ఇసుక వెలికి తీశారనే లెక్కల్లోనూ తేడాలు ఉన్నట్టు తెలిసింది. 

మారీచులు!
ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ‘ఇసుక మాఫియా’ చెలరేగుతోంది. ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. డబ్బుల కక్కుర్తితో ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు ఉంటుండటంతో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఓవైపు ప్రభుత్వ పథకాల పేరిట వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వేస్తుంటే.. కృష్ణా, గోదావరి, ఇతర నదులు కేంద్రంగా సాగుతున్న ఆన్‌లైన్‌ ఇసుక విక్రయాల్లోనూ భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. రీచ్‌లలో తవ్వకాలు మొదలుకుని స్టాక్‌ పాయింట్లకు తరలింపు, విక్రయాలు, తూకం వంటివాటిలో లొసుగులు ఇసుక వ్యాపారులకు వరంగా మారాయి. ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణ లోపం ఓవైపు, కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాల్లో భాగస్వాములు కావడం మరోవైపు అక్రమార్కులకు కలిసి వస్తోంది. అంతేకాదు ఈ ఇసుక దందా అంతా కొందరు రాజకీయ నాయకుల పర్యవేక్షణలోనే కొనసాగుతోందని.. దాంతో చాలాచోట్ల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు.

‘రీచ్‌’లలో అక్రమార్కులతో కలిసి..
ఇసుక విక్రయాల్లో పారదర్శకత పాటించడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘శాండ్‌ మైనింగ్‌ పాలసీ–2014’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర అవతరణకు ముందు ఇసుక రీచ్‌లను లాటరీ పద్దతిలో కేటాయించగా.. కొత్త పాలసీ కింద టెండర్‌ విధానంలో అప్పగిస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) జిల్లాస్థాయి కమిటీల ద్వారా రీచ్‌లను గుర్తించి.. కాంట్రాక్టరుకు తవ్వకాల బాధ్యత ఇస్తోంది. కాంట్రాక్టర్లు ఇసుకను తోడి సమీపంలోని స్టాక్‌ యార్డుకు తరలిస్తారు. ఈ ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ ద్వారా ‘శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎస్‌ఎంఎంఎస్‌)’ను ప్రవేశ పెట్టింది. ఆన్‌లైన్‌ విధానంలో బుక్‌ చేసుకున్న వారికి టన్నుకు రూ.600 చొప్పున డీడీల రూపంలో తీసుకుని ఇసుకను విక్రయిస్తుంది. కానీ అక్రమార్కులు, దళారులు ఈ విధానంలోని లోపాలను ఆధారంగా చేసుకుని వినియోగదారుల ముసుగులో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

‘లోకల్‌’గా అభివృద్ధి పనుల పేరిట..
సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇస్తారు. కొందరు అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కై.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల పేరిట ఇసుక తవ్వుతూ అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో నిర్మాణంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్లు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివాటి ముసుగులో ఇసుక తవ్వుతూ.. బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. స్థానికంగా జరిగే అభివృద్ధి పనులకు అవసరమయ్యే ఇసుక కోసం పంచాయతీరాజ్‌ లేదా సంబంధిత ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు రిక్విజిషన్‌ ఇస్తారు. ఆ రిక్విజిషన్‌ ఆధారంగా స్థానిక తహసీల్దార్‌ ఇసుకను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇసుకను తవ్వి, తరలించే కాంట్రాక్టర్‌.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.330 చొప్పున జిల్లా కలెక్టర్‌ పేరిట డీడీ, రూ.120 చొప్పున స్థానిక తహసీల్దార్‌ పేరిట చలానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ట్రాక్టర్‌లో మూడు నుంచి మూడున్నర టన్నుల మేర ఇసుక రవాణా చేయడానికి వీలుంటుంది. కానీ ఈ తవ్వకాలు, పరిమాణం, రవాణాపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను వీఆర్‌ఏలకు అప్పగించినా.. వారిలో చాలా మంది దళారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకేసారి అనుమతి తీసుకున్న ‘వే బిల్లుల’పై రోజుల తరబడి ఇసుక తవ్వుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇలా తరలిస్తున్న ఇసుకను ఒక్కో ట్రాక్టరుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులే ఈ దందాలో భాగస్వాములుగా ఉండటంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇసుక దందా జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలదే ప్రధాన పాత్రగా ఉంటోంది.

అక్రమాల్లో మచ్చుకు కొన్ని!
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం టేకుల చెరువు పంచాయతీ పరిధిలోని దోమలవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఈ నెల 27న అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్టు అధికారులపై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారు దాడి చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 ములుగు జిల్లా మల్యాల సమీపంలో జంపన్నవాగులో ఇసుక మేటలు వేయడంతో వాటిని తొలగించేందుకు ఇద్దరు వ్యక్తులు రైతుల పేరిట అనుమతులు తెచ్చుకున్నారు. ఆ ఇసుక మేటలను తొలగించడానికి ముందు కొండాయి గ్రామం చుట్టూ కరకట్ట నిర్మించాలని అధికారులు షరతు విధించారు. కానీ కరకట్ట నిర్మించకుండానే ఇసుకను తోడేశారు. దీంతో గతేడాది జంపన్నవాగు వరద కొండాయి, మల్యాల గ్రామాలను చుట్టుముట్టింది. అసలు ఇక్కడ క్వారీ నిర్వాహకులు, టీఎస్‌ఎండీసీ సిబ్బంది నకిలీ వే బిల్లులు సృష్టించి దందా నడిపించారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు హైదరాబాద్‌లో 12 మందిని అరెస్టు చేశారు. బాధ్యులైన టీఎస్‌ఎండీసి సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
 నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. అన్నారం నుంచి నిర్మల్‌లోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఇçసుకను తీసుకెళ్లాల్సిన ఆ లారీ భైంసా వైపు వెళ్తూ పట్టుబడింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

అక్రమ రవాణాపై పర్యవేక్షణఏదీ?
గోదావరి, ఉప నదుల నుంచి నిత్యం వేలాది లారీల్లో ఇసుక రవాణా జరుగుతున్నా వాటిపై సంబంధిత శాఖల పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్‌ఎండీసీ, మైనింగ్, పోలీసు, రెవెన్యూ, ఆర్టీఏ విభాగాల పర్యవేక్షణ లోపంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, నకిలీ నంబరు ప్లేట్లు ఉన్న వాహనాలతో ఇసుక రవాణా జరుగుతున్నా.. ఆర్‌టీఏ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలా లేదు. అప్పుడప్పుడు పోలీసు యంత్రాంగం మాత్రమే ఓవర్‌ లోడింగ్, అనుమతులు లేకపోవడం, నకిలీ నంబరు ప్లేట్లు వంటి ఘటనల్లో కేసులు నమోదు చేసింది. భూపాలపల్లి, మహదేవపూర్, కాటారం పోలీసు స్టేషన్లలో గత ఏడాది ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

నేతల బినామీలే కాంట్రాక్టర్లు
ఇసుక రీచ్‌ల కాంట్రాక్టుల్లో చాలా వరకు  కొందరు నేతల బినామీల చేతుల్లోనే ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ నేతల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోందని అంటున్నారు. టీఎస్‌ఎండీసీ వ్యవహారాల్లో చక్రం తిప్పే ఓ ముఖ్య నేతతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఇటీవల జంట హత్యల వివాదంలో చిక్కుకున్న ఓ అధికార పార్టీ నేత, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తన మిత్రుడిని ముందు పెట్టి కాంట్రాక్టులు చేస్తున్న ఓ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ములుగు జిల్లాలో ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఇలా అన్నిచోట్లా వివిధ పార్టీల నేతలు రీచ్‌ల వద్ద చక్రం తిప్పుతున్నారని చెప్తున్నారు. ఇతరులెవరైనా రీచ్‌లు దక్కించుకున్నా వారిని నయానో భయానో లొంగదీసుకుని తమ చెప్పుచేతుల్లో తవ్వకాలు, రవాణా జరిగేలా చూసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు (దయ్యాలవాగు) నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలివెళ్తోంది. ప్రభుత్వ పనుల కోసం అని చెప్తూ ప్రైవేటు నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అనుమతులు పొందే ఇసుక ట్రాక్టర్ల యజమానులు.. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్‌కు రూ.1,800 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్‌లో లోడ్‌ చేసే కూలీలకు రూ.250 మాత్రం చెల్లించి, మిగతా సొమ్ము తాము మిగిలించుకుంటున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి వాగుల్లో ఎక్కడా మీటరు లోతు వరకు మాత్రమే ఇసుక తవ్వాలన్న నిబంధన ఉంది. కానీ ఇక్కడ రెండు మీటర్ల లోతు వరకు తవ్వుతుండటంతో జంపన్నవాగు ఎండిపోతోంది.

కేటగిరీలుగా ఇసుక రీచ్‌లు
రాష్ట్రంలోని వాగులు వంకలు, ఉప నదులు, నదులను ఐదు కేటగిరీలుగా మైనింగ్‌ విభాగం విభజించింది. ఇందులో ఒకటి, రెండు కేటగిరీలకు చెందిన స్థానిక వాగులు, చిన్న వంకల నుంచి స్థానిక అవసరాల కోసం ఇసుకను కేటాయిస్తారు. తవ్వకాలు, విక్రయం వంటి బాధ్యతలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. మూడు, నాలుగు, ఐదో కేటగిరీలో తుంగభద్ర ఎడమ గట్టు, కృష్ణా, గోదావరి నదీ తీరాలు, వాటి ఉపనదులు ఉన్నాయి. వీటి నుంచి ఇసుక వెలికితీసి విక్రయించే బాధ్యతను టీఎస్‌ఎండీసీ నిర్వహిస్తుంది. వీటితోపాటు ఇసుక మేట వేసిన వ్యవసాయ పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతులు, విక్రయాలను టీఎస్‌ఎండీసీ పర్యవేక్షిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement