ఖాజీపూర్ క్వారీలో ఇసుకను ట్రాక్టర్‌లో పోస్తున్న ప్రొక్లయినర్
రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక అక్రమ వ్యాపారం మూడు లారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్‌తో ఇసుక దందా కొత్తపుంతలు తొక్కుతోంది. తెల్లవారింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. దీన్ని నియంత్రించాల్సిన కొందరు అధికారులు కళ్లు మూసుకోవడంతో వేల టన్నుల ఇసుక పక్కదారి పడుతోంది. దోచుకునే వారికి దోచుకున్నంత అన్న చందంగా.. కళ్లముందే అక్రమ దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టార్గెట్ కోసం మొక్కుబడిగా కేసులు పెట్టి అధికారులు ‘మమ’అనిపిస్తున్నారు. ఫలితంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్రమార్కులకు ఇసుక కాసులు కురిపిస్తోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ దందాపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్..
– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్
ఇసుక మాఫియా అక్రమ దందాకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ముసుగు వేసి టన్నుల కొద్దీ ఇసుకను అక్రమమార్గం పట్టిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.వందల కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వం చెబుతున్నా.. అంతకు నాలుగింతలు ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో గోదావరి, మంజీరా, కృష్టా నదీతీరాలు ఇసుక తవ్వకాలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వం గత వేసవిలో పాత ఏడు జిల్లాల్లోని 56 చోట్ల టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలకు అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఈ ఇసుకను తరలించేందుకు 289 స్టాకు పాయింట్లను ఏర్పాటు చేసింది.
ఇసుక అవసరం ఉన్నవాళ్లు మీసేవ, ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా టీఎస్‌ఎండీసీ పేరిట డబ్బులు చెల్లించి రశీదులు పొందితే.. వారి అవసరాన్ని బట్టి లారీల్లో ఇసుక నింపాల్సి ఉంది. అయితే ఇదేమీ పట్టని కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు రశీదులకు మించి ఒక్కో లారీలో రెండు నుంచి నాలుగు టన్నుల వరకు అధికంగా ఇసుక నింపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణ జిల్లాల్లో ఈ విధానం గందరగోళంగా తయారైంది. సామాన్యుడు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ఇసుకను పొందే సరళ విధానం ఇందులో లేదు. ఆన్‌లైన్ విధానం కొందరు స్వార్థపరులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఫలితంగా ఇసుక వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి బాగానే ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయి అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడంతో ప్రభుత్వం ఉద్దేశం నీరుగారిపోతోంది.
నిబంధనలకు మంగళం..
ఇసుక తవ్వకాలకు నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల వల్ల రైతుల పంట పొలాల్లో వేసే ఇసుక మేటల తొలగింపు పేరిట వ్యవసాయ శాఖ ద్వారా అనుమతికి దరఖాస్తు చేస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయా జిల్లాల్లో జిల్లా స్థాయి శాండ్ కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) దరఖాస్తులను పరిశీలించి వ్యవసాయ, గనులు, భూగర్భజల, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన మీదట.. ఆయా ప్రాంతాలను బట్టి ఎన్ని రోజులు? ఎంత లోతు? ఎన్ని క్యూబిక్ మీటర్లు? ఎలా ఇసుక తీయాలి (మాన్యువల్/యంత్రాలు)? అన్న మార్గదర్శకాలను సూచిస్తుంది. పట్టా భూములు కాకుండా ప్రభుత్వ అవసరాలకు కూడా నదీ పరీవాహక ప్రాంతాల్లో టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ మేరకు సూచించిన మార్గదర్శకాల ప్రకారం తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా 1.5 మీటర్ల నుంచి 2.5 మీటర్ల లోతుకు మించి ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండదు. ఒకచోట అనుమతులు తీసుకుని.. మరోచోట తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులు.. నిబంధనలకు విరు ద్ధంగా 5 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు ఇసుక తవ్వేస్తున్నారు.
పట్టా భూములను వదిలి గోదావరి, మంజీరాల్లో సైతం తవ్వకాలు కానిచ్చేస్తున్నారు. ఉద యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదీ సీసీ కెమెరాల నీడలోనే ఇసుక తవ్వకాలు, రవా ణా చేయాలన్న నిబంధనలను పట్టించుకోకుండా సీసీ కెమెరాలు లేకుండా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక మేటల తొలగింపునకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ఇసుక నింపేందుకు సైతం నిబంధనలు పెట్టింది. 10 టన్నుల కెపాసిటీ గల లారీలో 6 క్యూబిక్ మీటర్ల ఇసుకను, 17 టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లోడింగ్ చేయాల్సి ఉంటుంది. పది టైర్ల లారీల్లో 20 టన్నులు(10.5 క్యూబిక్ మీటర్లు), 12 టైర్ల లారీలో 22.5 టన్నులు(13 క్యూబిక్ మీటర్లు), ఒక్కో వేబిల్లుపై లారీలో 21 టన్నులకు మించి(12 క్యూబిక్ మీటర్లు) ఇసుకను నింపకూడదు. ఇసుక మాఫియా 14 టైర్ల లారీల ద్వారా ఏకంగా 60 టన్నుల(37.50 క్యూబిక్ మీటర్లు) వరకు ఇసుకను నింపి నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఇసుక తవ్వకం, రవాణాలను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, గనులు, భూగర్భ జల, రవాణా శాఖలు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నాయి.
ఈ ఇసుకకు ‘మహా’డిమాండ్..
భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని పలుగుల 1, 2, 3 క్వారీలకు, ఇదే మండలంలోని కుంట్లం 1, 2, 3, కుదురుపల్లి, అన్నారం, మహదేవ్ పూర్‌ల్లో ఉన్న క్వారీల్లోని ఇసుకకు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్‌లో కూపన్లు ఓపెన్ చేసిన రెండు నిమిషాల్లోనే ఈ క్వారీ ల్లో ఇసుక కూపన్లు బుక్కయిపోతాయి. ఇక క్వారీల వద్ద ఒకే కూపన్‌పై రెండు మూడు లారీలను వదులు తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అధిక లోడు షరా మామూలే. ఉదయం 6 గంటల నుంచి సాయ త్రం ఆరు గంటల వరకు లారీలను అనుమతిం చాల్సిన అధికారులు 24 గంటలు తిరుగుతున్నా మిన్నకుండిపోవడంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అధిక లోడ్ల కారణంగా ఈ ఏరియాల్లోని రోడ్లపై మోకాలిలోతు గుండలు ఏర్పడ్డాయి.
‘ఆన్‌లైన్’ బాగున్నా.. అక్రమాలు ఆగట్లేదు..!
పాత ఏడు జిల్లాల్లో 56 చోట్ల టీఎస్‌ఎం డీసీ ద్వారా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఇసుకను తరలించేందుకు 289 స్టాకు పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరం ఉన్నవాళ్లు మీ – సేవ, ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా టీఎస్‌ఎండీసీ పేరిట డబ్బులు చెల్లించి రశీదులు పొందితే.. వారికి అవసరాన్ని బట్టి లారీల్లో నింపాల్సి ఉంది. ఇక్కడ పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. టీఎస్‌ఎండీసీ ఇసుక బుకింగ్‌లకు తెర తీసిన రెండు మూడు నిమిషాల్లోనే హైదరాబాద్ కేంద్రంగా దళారులు హైస్పీడ్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా బుకింగ్ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టర్లు, లారీ ఓనర్ల పాత్రే కీలకం. ఇలా స్పీడ్‌గా బుక్ చేసిన ఆపరేటర్‌కు ఒక్కో బుకింగ్‌కు రూ. వెయ్యి వరకు ముట్టచెబుతున్నట్టు సమాచారం.
హైదరాబాద్‌లో సుమారు వంద మంది వరకు బ్రోకర్లు నిత్యం ఇదే పనిలో ఉంటున్నట్టు తెలిసింది. గతంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉన్న నెట్ సెంటర్ల ద్వారా బుక్ చేసేవాళ్లు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగానే బుకింగ్ దందా కొనసాగుతోంది. హైదరాబాద్ వెలుపల నెట్ స్పీడ్ తక్కువ ఉండడంతో అక్కడ బుకింగ్‌లు కావడం లేదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా ఇసుక మాఫియానే ఉపయోగించుకుంటుండటంతో సామాన్యు లకు ఇసుక కష్టాలు ‘షరామామూలు’గా మారాయి. ఇదిలాఉంటే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే లారీలకు సంబంధించి సరైన వేబిల్లులు, టీఎస్‌ఎండీసీకి అంతర్రాష్ట్ర పన్ను చెల్లించి పొందే వేబిల్లులు చెక్‌పోస్టులలో విధిగా పరిశీలించాలి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ రశీదుల పేరిట పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమదందా ఈ తరహాలో కూడా ‘మామూలు’గా మారింది..
అన్ని జిల్లాల్లోనూ అక్రమాలే..
- కరీంనగర్ జిల్లా ఖాజీపూర్, కొత్తపల్లి ఇసుక క్వారీల నుంచి నిబంధన లకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు రేయింబవళ్లు ఇసుక వ్యాపారం చేస్తు న్నారు. వీరికి రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల అధికారుల అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ రెండు క్వారీల నుంచి రోజుకు వందలాది లారీలు, వేలాది ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక, కొడిముంజ క్వారీల్లో కూడా గతంలో ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు జరిపింది. అయితే ఇటీవల కొదురుపాక నుంచి ఇసుకను తరలిస్తున్న సమ యంలో నేరేళ్ల వద్ద ప్రమాదం జరిగి వివాదస్పదమైన నేప థ్యంలో తవ్వకాలను నిలిపివేశారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 38 చోట్ల నుంచి ఇసుక అక్రమ దందా సాగుతోంది.
- పాత నిజామాబాద్ జిల్లాలో ఏడాది క్రితం 104 హెక్టార్ల నుంచి 14,27,400 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు అనుమతులిచ్చారు. పాత జిల్లాలో 16 రీచ్‌లకు అనుమతి ఉండగా.. అనధికారికంగా మరో 8 నడుస్తున్నాయి. వాగులు, వంకలు కలిపితే 42 చోట్ల నుంచి ఇసుక అక్రమమార్గం పడుతోంది. దీనికి తోడు మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుగా ఉన్న మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూరు, తగ్గెల్లి, కలుదుర్గి గ్రామాలు మంజీరా నదికి ఆంధ్ర సరిహద్దు గ్రామాలు ఉండగా గంజిగావ్, కార్ల, మసునూరు, హున్ కుందా, సగ్రోళి, బోలెగామ్, చెల్‌గాం, చౌరాలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గత కొంతకాలంగా మన సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక క్వారీలను నిషేధించినప్పటికీ.. ఇక్కడి నుంచి హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాలకు అక్రమంగా మాఫియా ఇసుకను తరలిస్తోంది.
- మెదక్ జిల్లా రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇక్కడ ఇసుకకు డిమాండ్ పెరిగింది. మంజీరాతో పాటు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా సరిపోవడంలేదు. మంజీరాతోపాటు పటాన్‌చెరు, గిన్నారం, సంగారెడ్డి మండలాల్లో నక్కవాగు, ఊడవెల్లి వాగుల్లో మట్టిని జల్లెడ పట్టి ఫిల్టర్ ఇసుకను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.
- పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేవు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ చొరవ కారణంగా శాండ్ మేనేజ్‌మెంట్ కమిటీ ద్వారా లోకల్‌గా ఏడు ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ రీచ్‌ల ద్వారా ఇసుక స్థానిక అవసరాలకు వినియోగించుకునేందుకు ‘పాలమూరు శాండ్’పేరిట ఆన్‌లైన్ విక్రయాలకు రూపకల్పన చేశారు. గత రెండు నెలలుగా ఆన్‌లైన్ ద్వారా ఇసుక అమ్మకాలను చేపడుతున్నారు. ఇసుక అమ్మకాలకుగానూ కేవలం ట్రాక్టర్ల ద్వారానే, వాటికి జీపీఎస్ అమర్చి నిర్వహిస్తున్నారు. అయితే నాగర్‌కర్నూల్ ప్రాంతంలోని సిర్సవాడ నుంచి మేడిపూర్, లక్ష్మాపూర్, మొల్గర, చారకొండ తదితర ప్రాంతాల నుంచి ఇసుకను నిరంతరం తరలిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు.
Comments
Please login to add a commentAdd a comment