సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక విక్రయాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వమే ఇసుక విక్రయించాలని నిర్ణయించిన విషయంవిధితమే. ఈ మేరకు ప్రత్యేక ఇసుక పాలసీని ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) ద్వారా ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో తొలిసారిగా వేమనపల్లి మండల పరిధిలో ప్రవహించే నీల్వాయి నది నుంచి ఇసుక తవ్వకాలు జరుపనున్నారు.
ఇక్కడి నుంచి ఇసుకను సమీపంలోని ఓ డంప్ యార్డుకు తరలించి విక్రయించేందుకు టీఎస్‌ఎండీసీ ఏర్పాట్లు చేస్తోంది. నీల్వాయి నది నుంచి డంప్ యార్డుకు ఇసుకను తరలించేందుకు టీఎస్‌ఎండీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇసుక డంప్ యార్డు కోసం ప్రభుత్వ భూమిని ఇవ్వాలని టీఎస్‌ఎండీసీ అధికారులు మంచిర్యాల ఆర్డీవోకు లేఖ రాశారు. నీల్వాయిలో ఇసుక నిల్వలపై సంయుక్త అధికారుల బృందం ఇటీవల సర్వే చేపట్టింది.
ఇందులో సుమారు 1.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. దీన్ని డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి విక్రయించనున్నారు. ఇసుక అవసరం ఉన్న వారు నిర్ణీత మొత్తాన్ని చెల్లించి, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వారికి టీఎస్‌ఎండీసీనే ఇసుకను సరఫరా చేస్తుంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇసుక విక్రయ కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలో కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది.
మరో రెండు రీచ్‌ల గుర్తింపు..
జిల్లాలో ఇసుక లభ్యతపై జిల్లా ఉన్నతాధికారుల బృందం ప్రత్యేక సర్వే నిర్వహించింది. గనులు, భూగర్భ జలాలు, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సంయుక్త పరిశీలన చేపట్టారు. గోదావరి నదిలో 16 ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఇందులో 14 రీచ్‌లలో ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ లేనట్లు గుర్తించారు.
రెండు రీచ్‌లు కోటపల్లి మండలం కోనంపేట్‌లో 2,500 క్యూబిక్ మీటర్లు, జైపూర్ మండలం వేలాలలో మరో 2,500 క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులో ఉంది. ఈ రెండు రీచ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. వాల్టా చట్టం ప్రకారం నదిలో 500 మీటర్ల మధ్యలో తవ్వకాలు చేపట్టాలి. ఆరు మీటర్ల మేరకు ఇసుక పేరుకుపోతే కేవలం ఒక మీటరు మాత్రమే తవ్వాలి. ఎనిమిది మీటర్లు ఇసుక ఉంటే రెండు మీటర్లు తీయూలి. అయితే అధికారుల బృందం గుర్తించిన 14 రీచ్‌లలో ఈ పరిస్థితులు లేవు.
సర్కారు ఇసుకకు సన్నాహాలు
Published Thu, Feb 26 2015 3:31 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement