గులాబీ నేతల్లో ఇసుక గుబులు
అక్రమ దందాలోనూ ఆధిపత్య పోరు
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగానే కాదు, చివరకు అక్రమ సంపాదనలోనూ కొందరు గులాబీ నేతలు ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నారు. ‘సొంత పార్టీ వాడైతే నాకేంటి? నా మాములూ నాదే..’ అంటూ అక్రమ సంపాదనలో కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీరి మధ్య పోరుకు ఇసుక అక్రమ రవాణా వ్యాపారం కారణమవుతోంది. అత్యధిక జిల్లాల్లో టీఆర్‌ఎస్ నాయకుల మధ్య పంచాయితీ నడుస్తోందని తెలుస్తోంది.
చివరకు ఆయా జిల్లాల మంత్రులు సైతం ఈ పంచాయితీలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారని వినికిడి. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీ మేరకు గుర్తించిన అధికారిక క్వారీల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలి. కానీ, అనధికారిక క్వారీల్లోనే తవ్వకం ఎక్కువగా జరుగుతోంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి దగ్గర దారిగా కనిపిస్తున్న ఇసుక వ్యాపారంపైనే గులాబీ నేతలు ఆధారపడుతున్నారు. దీంతో ఒకరి వాహనాలను మరొకరు అడ్డుకుంటూ ఘర్షణలకు దిగుతున్నారు.
ఉత్తర తెలంగాణలో గొడవలు
ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో గులాబీ నేతలు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడంతో ఇసుక పంచాయితీలు ఎక్కువగా నడుస్తున్నాయని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరికి ఉప నదిగా ఉన్న మంజీర నదిలో భారీ ఎత్తున ఇసుక వ్యాపారం నడుస్తోంది. ఒక ప్రజాప్రతినిధి తనయుడు ఈ వ్యాపారంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. దీంతో మరో ప్రజాప్రతినిధి అనుకూల వర్గం ఆయన తీరును ఆక్షేపిస్తోంది. దీంతో ఆ జిల్లా పంచాయితీని కేబినెట్‌లో కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఒక మంత్రి తీర్చాల్సి వచ్చిందని అంటున్నారు.
ఈ జిల్లాలోని రెండు వర్గాల మధ్య ముఖ్యనేత ఒకరు రాజీ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడి ఇద్దరి మంత్రుల అనుచరులు వర్గాలుగా విడిపోయి కత్తులు దూస్తున్నారని అనుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ముందు నుంచీ ఇసుక వ్యాపారంతోనే వెనకేసుకున్నారని, ఇప్పుడాయన తన ఆధిపత్యానికి గండిపడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని తెలిసింది. దీంతో ఇతర ఎమ్మెల్యేలకు చెందిన వాహనాలనూ ఆయన అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. తన కమీషన్ తనకిస్తే ఫర్వాలేదంటూ రాజీ ఫార్ములానూ ముందు పెడుతున్నారని చెబుతున్నారు.
హైదరాబాద్‌కు తాకిన సెగ
ఖమ్మం జిల్లాలో ఇసుక పంచాయితీ మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ రెండు వర్గాలు బహిరంగంగానే పనిచేస్తున్నాయి. ఈ గ్రూపుల గొడవ తీవ్రత చివరకు హైదరాబాద్ నేతలను తాకిందని, ఓ ‘ముఖ్య’ నేత మందలింపుతో కొంత సద్దుమణిగినట్లు సమాచారం. హైదరాబాద్‌కు సరిహద్దుగా ఉన్న నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ప్రధానంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దందా ఎక్కువగా జరుగుతోంది.
ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో పాటు హాలియా వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపారంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య పేచీలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలను నియంత్రించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇసుక నిల్వలు అధికంగా ఉన్న క్వారీలనూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.