దోచుకున్నోళ్లకు దోచుకున్నంత..!
మెదక్‌టౌన్ : ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుంది. అధికార పార్టీ అండదండలతో పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి, మెదక్ మండలం ముత్తాయిపల్లిలో జోరుగా ఇసుక దందా సాగిస్తున్నారు. జలవనరులను జలగల్లా పీల్చేస్తూ.. మంజీరా.. హల్దీ..పుష్పలవాగులను జల్లెడ పడుతున్నారు. వాగులు..వంకలు అన్న తేడా లేకుండా ఇసుక కనిపిస్తే చాలు అధికారులకు మస్కా కొట్టి చీకటి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. అధికారపార్టీ ‘పెద్దదొర’కు ఇసుక మాఫియా ముడుపులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మాఫియా అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ తమ ప్రతాపం చూపుతోంది. ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారనే కోపంతో హల్దీవాగు వద్ద కాపలాగా ఉన్న మున్సిపల్ సిబ్బందిపై గతేడాది అర్ధరాత్రి అక్రమార్కులు బండరాయితో మోది హత్యాయత్నం చేశారు.
పాపన్నపేట, మెదక్ మండలాల సరిహద్దు ప్రాంతమైన మంజీరా నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ పనుల పేరిట ఇసుకను బయటకు తెస్తూ...ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తమ వ్యాపారాన్ని మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా కొనసాగిస్తున్నారు.
ఎవరైనా అడ్డుకుంటే వారిపై దాడులకు వెనకాడటం లేదు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.4వేల నుంచి 5000ల వరకు విక్రయిస్తున్నారు. మంజీర తీర ప్రాంతమైన పొడ్చన్‌పల్లిలో టీఆర్‌ఎస్ , కాంగ్రెస్ నేతలు సిండికేట్‌గా మారి దోపిడీని యధేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇదేగ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుడు గ్రామ పొలిమేరలో ఎక్కడపడితే అక్కడ వందలకొద్ది ఇసుక డంపులను ఏర్పాటు చేశారు. మెదక్ మండలం ముత్తాయిపల్లిలో సైతం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుడు అదేబాటలో పయనిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తన వ్యాపారానికి అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తానని ఓ నేత బహిరంగంగా హెచ్చరించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ అండదండలే వారికి రక్ష
రాత్రి, పగలు తేడాలేకుండా కొంతమంది ఇసుక దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలు చూసుకొని అడ్డొచ్చిన అధికారులపై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోక పోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి.