leaders of TRS
-
గులాబీ నేతల్లో ఇసుక గుబులు
అక్రమ దందాలోనూ ఆధిపత్య పోరు సాక్షి, హైదరాబాద్: రాజకీయంగానే కాదు, చివరకు అక్రమ సంపాదనలోనూ కొందరు గులాబీ నేతలు ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నారు. ‘సొంత పార్టీ వాడైతే నాకేంటి? నా మాములూ నాదే..’ అంటూ అక్రమ సంపాదనలో కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీరి మధ్య పోరుకు ఇసుక అక్రమ రవాణా వ్యాపారం కారణమవుతోంది. అత్యధిక జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకుల మధ్య పంచాయితీ నడుస్తోందని తెలుస్తోంది. చివరకు ఆయా జిల్లాల మంత్రులు సైతం ఈ పంచాయితీలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారని వినికిడి. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీ మేరకు గుర్తించిన అధికారిక క్వారీల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలి. కానీ, అనధికారిక క్వారీల్లోనే తవ్వకం ఎక్కువగా జరుగుతోంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి దగ్గర దారిగా కనిపిస్తున్న ఇసుక వ్యాపారంపైనే గులాబీ నేతలు ఆధారపడుతున్నారు. దీంతో ఒకరి వాహనాలను మరొకరు అడ్డుకుంటూ ఘర్షణలకు దిగుతున్నారు. ఉత్తర తెలంగాణలో గొడవలు ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో గులాబీ నేతలు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడంతో ఇసుక పంచాయితీలు ఎక్కువగా నడుస్తున్నాయని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరికి ఉప నదిగా ఉన్న మంజీర నదిలో భారీ ఎత్తున ఇసుక వ్యాపారం నడుస్తోంది. ఒక ప్రజాప్రతినిధి తనయుడు ఈ వ్యాపారంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. దీంతో మరో ప్రజాప్రతినిధి అనుకూల వర్గం ఆయన తీరును ఆక్షేపిస్తోంది. దీంతో ఆ జిల్లా పంచాయితీని కేబినెట్లో కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఒక మంత్రి తీర్చాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ జిల్లాలోని రెండు వర్గాల మధ్య ముఖ్యనేత ఒకరు రాజీ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడి ఇద్దరి మంత్రుల అనుచరులు వర్గాలుగా విడిపోయి కత్తులు దూస్తున్నారని అనుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ముందు నుంచీ ఇసుక వ్యాపారంతోనే వెనకేసుకున్నారని, ఇప్పుడాయన తన ఆధిపత్యానికి గండిపడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని తెలిసింది. దీంతో ఇతర ఎమ్మెల్యేలకు చెందిన వాహనాలనూ ఆయన అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. తన కమీషన్ తనకిస్తే ఫర్వాలేదంటూ రాజీ ఫార్ములానూ ముందు పెడుతున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు తాకిన సెగ ఖమ్మం జిల్లాలో ఇసుక పంచాయితీ మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ రెండు వర్గాలు బహిరంగంగానే పనిచేస్తున్నాయి. ఈ గ్రూపుల గొడవ తీవ్రత చివరకు హైదరాబాద్ నేతలను తాకిందని, ఓ ‘ముఖ్య’ నేత మందలింపుతో కొంత సద్దుమణిగినట్లు సమాచారం. హైదరాబాద్‌కు సరిహద్దుగా ఉన్న నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ప్రధానంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దందా ఎక్కువగా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో పాటు హాలియా వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య పేచీలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలను నియంత్రించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇసుక నిల్వలు అధికంగా ఉన్న క్వారీలనూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. -
ఆరోగ్య వరం
వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ కాళోజీ పేరిట క్యాంపస్ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ హబ్‌గా రూపుదిద్దుకోనున్న నగరం హర్షం వ్యక్తంచేసిన టీఆర్ఎస్ నేతలు, ప్రజలు సాక్షి, హన్మకొండ: ప్రతిష్టాత్మక హెల్త్ యూనివర్సిటీ వరంగల్నే వరించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెల్త్‌వర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేయూలని గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ పేరుతో ఈ వర్సిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక యూనిట్‌గా విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ ఉంది. 1986లో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రస్తుతం 40 మోడ్రన్ మెడిసిన్, 21 డెంటల్, 7 ఆయుర్వేద, 6 హోమియోపతి , 2 యూనాని, 213 నర్సింగ్, 2 న్యూరోపతి యోగ, 38 ఫిజియోథెరపీ, 54 మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సగం కాలేజీలు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఈ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, సమాధాన పత్రాల మూల్యాంకనం వంటి కీలకమైన బాధ్యతలను పక్క రాష్ట్రంలో ఉన్న వర్సిటీకి ఆధీనంలో ఉండడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో హెల్త్వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం సూచించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న తాటికొండ రాజయ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెల్త్‌వర్సిటీని వరంగల్‌లో సాధించేందుకు కృషి చేశారు. రాష్ట్రం ఏర్పాటైన మూడు నెలల తర్వాత వరంగల్‌లో హెల్త్‌వర్సిటీని ఏర్పాటు చేయూలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషనల్ హబ్‌గా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ మెడికల్ కాలేజీ, అనంతలక్ష్మీ ఆయుర్వేద కాలేజీలు వరంగల్ నగరంలో ఇప్పటికే ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఏర్పాటు చేయనుండడంతో తెలంగాణలో వరంగల్ నగరం ఎడ్యుకేషనల్ హబ్‌గా రూపుదిద్దుకోనుంది. మిగిలిన ప్రాంతాలతో పోల్చితే హెల్త్వర్సిటీ ఏర్పాటుకు వరంగల్ అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇప్పటికిప్పుడు వర్సిటీ పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్, అకాడమిక్ సెనేట్ సభ్యులు, బోర్డు ఆఫ్ స్టడీస్ మెంబర్ వంటి తదితర కీలకమైన పోస్టులను భర్తీ చేసేందుకు కాకతీయ మెడికల్ కాలేజీతో పాటు వేయి పడకల సామర్థ్యం ఉన్న మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో పని చేస్తున్న వైద్యులకు అర్హతలు ఉన్నాయి. అంతేకాదు... వరంగల్ నగరానికి చక్కని రైలు, రోడ్డురవాణా మార్గాలు ఉన్నాయి. త్వరలోనే ఎయిర్‌పోర్టును పునరుద్ధరించే అవకాశం ఉంది. పైగా ఉత్తర, దక్షిణ తెలంగాణలకు మధ్యలో వరంగల్ నగరం ఉండడం వల్ల ఈ ప్రాంతం భౌగోళికంగా అనువైనదిగా భావించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే ఖర్‌రావు వరంగల్‌లో హెల్త్వర్సిటీ ఏర్పాటుకు మొగ్గు చూపారు. కేంద్ర కారాగార స్థలంలో ఏర్పాటు ? కాకతీయ మెడికల్ కాలేజీ ప్రస్తుతం 120 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో ప్రస్తుతం సుమారు 50 ఎకరాల స్థలం ఖాళీగానే ఉంది. వర్సిటీ ఏర్పాటుకు ఈ భూములను వినియోగించవచ్చు. కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీని అనుకుని వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో హెల్త్‌వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కారాగారాన్ని వేరే చోటుకు తరలించే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ సెంట్రల్ జైలును నగరం చివర్లో ఉన్న చర్లపల్లికి తరలించి, ఆ స్థలంలో మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను నూతనంగా నిర్మించారు. అదే నమూనాను వరంగల్‌లో అమలు చేసే అవకాశం ఉంది. గతంలో డిప్యూటీ సీఎం రాజయ్యనే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. టీఆర్ఎస్ సంబరాలు హన్మకొండ చౌరస్తా : జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ మంజూరుకావడంతో టీఆర్ఎస్ అర్బన్ నాయకులు అలంకార్ జంక్షన్ సమీపంలోని జక్రియ ఫంక్షన్ హాల్ ఆవరణలో స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సంబరాల్లో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాకు హెల్త్ యూనివర్సిటీని మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హర్షం వ్యక్తం చేస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మక హెల్త్ వర్సిటీని వరంగల్‌కు కేటాయించడం, ఈ జిల్లా అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి నిదర్శనమని ఆయన అన్నారు. కోరబోయిన సాంబయ్య, బోడ డిన్నా, పులి రజనీకాంత్, అబూబక్కర్, ఎండీ నయిమొద్దీన్, నలుబోలు సతీష్, అబూబక్కర్, సారంగపాణి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. డీహెచ్, ఐఎంఏ హర్షం ఎంజీఎం : వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేయడంపై డెరైక్టర్ ఆఫ్ హెల్త్ పిల్లి సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు శ్రీనివాస్, రాష్ట్ర ఎథికల్ కమిటీ సభ్యుడు శేషుమాధవ్ ‘సాక్షి’తో మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఓరుగల్లుకు అరుదైన స్థానం దక్కిందన్నారు. ఐఎంఏ ప్రమాణాస్వీకారం సందర్భంగా హరీశ్‌రావు వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ మంజూరుకు కృషి చేస్తామన్న హామీతోపాటు డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చొరవతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ మంజూరైందని పేర్కొన్నారు. -
ఊపందుకున్న ప్రచారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప పోరు ఊపందుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఉప ఎన్నికలు తెలంగాణ ద్రోహికి, కార్యకర్తకు మధ్య జరుగుతున్న యుద్ధమని టీఆర్ఎస్ నేతలు చెప్తుంటే, కేసీఆర్ మాటలతోనే మోసం చేస్తారని, ఆయన మాటలు నమ్మొద్దని బీజేపీ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేకపోతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. గురువారం అధికార టీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ముఖ్యమైన కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, గువ్వల బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి జంగారెడ్డిని ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పూచిక పుల్లలాగా తీసివేశారని, ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే టీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిపై విమర్శలు సంధించారు. చేసిన తప్పులకు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం కోసమే జగ్గారెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రుల గోసులు పట్టుకొని తిరిగాడని విమర్శించారు. తెలంగాణ వద్దు... సమైక్యమే ముద్దు అన్న సమైక్యవాదిని చిత్తుచిత్తుగా ఓడించాలని, డిపాజిట్ రాకుండా చేయాలని టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బీబీ పాటిల్ ఏ ఉద్యమం చేశారు: బీజేపీ మరో వైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత సాదారణ ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులు టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావుకు ఎలా టిక్కెట్ ఇచ్చారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక జగ్గారెడ్డి ఎలా ద్రోహి అవుతారని వారు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో లేని బీబీ పాటిల్‌కు ఎలా టిక్కెట్ ఇచ్చారని, ఆయన ఏ ఉద్యమంలో పాల్గొన్నారో టీఆర్ఎస్ నేతలు ప్రజలకు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు: కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయటంలేదన్నారు.