ఊపందుకున్న ప్రచారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప పోరు ఊపందుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఉప ఎన్నికలు తెలంగాణ ద్రోహికి, కార్యకర్తకు మధ్య జరుగుతున్న యుద్ధమని టీఆర్‌ఎస్ నేతలు చెప్తుంటే, కేసీఆర్ మాటలతోనే మోసం చేస్తారని, ఆయన మాటలు నమ్మొద్దని బీజేపీ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేకపోతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు.
గురువారం అధికార టీఆర్‌ఎస్ పార్టీ నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ముఖ్యమైన కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, గువ్వల బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థి జంగారెడ్డిని ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పూచిక పుల్లలాగా తీసివేశారని, ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే టీఆర్‌ఎస్ నేతలు జగ్గారెడ్డిపై విమర్శలు సంధించారు. చేసిన తప్పులకు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం కోసమే జగ్గారెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రుల గోసులు పట్టుకొని తిరిగాడని విమర్శించారు. తెలంగాణ వద్దు... సమైక్యమే ముద్దు అన్న సమైక్యవాదిని చిత్తుచిత్తుగా ఓడించాలని, డిపాజిట్ రాకుండా చేయాలని టీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
బీబీ పాటిల్ ఏ ఉద్యమం చేశారు: బీజేపీ
మరో వైపు బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసింది. టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత సాదారణ ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులు టీఆర్‌ఎస్ పార్టీ కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావుకు ఎలా టిక్కెట్ ఇచ్చారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చాక జగ్గారెడ్డి ఎలా ద్రోహి అవుతారని వారు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో లేని బీబీ పాటిల్‌కు ఎలా టిక్కెట్ ఇచ్చారని, ఆయన ఏ ఉద్యమంలో పాల్గొన్నారో టీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు: కాంగ్రెస్
కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయటంలేదన్నారు.