416 ప్రకటనల్లో 15 మాత్రమే నిలిపివేశాం  | CEO Vikasraj Reacts On News Of Suspension Of Elections Campaign Ads, Says Out Of 416 Ads We Stopped Only 15 - Sakshi
Sakshi News home page

Telangana Elections Ad Campaigns: 416 ప్రకటనల్లో 15 మాత్రమే నిలిపివేశాం 

Published Wed, Nov 15 2023 4:45 AM | Last Updated on Wed, Nov 15 2023 12:00 PM

Out of 416 ads we stopped only 15  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారం కోసం సమర్పించిన ప్రకటనల్లో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి 15 ప్రకటనలు మాత్రమే నిలిపివేస్తూ ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ప్రచార ప్రకటనల నిలిపివేతపై వస్తున్న వార్తలపై స్పందించిన సీఈవో మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల సంఘం నియమించిన ప్రకటనల పరిశీలన, అనుమతి కమిటీ మొత్తం 416 ప్రకటనలకు అనుమతినిచ్చిందని తెలిపారు.

అనుమతించిన వాటిలో కొన్నింటి రూపురేఖలు మార్చడం, వక్రీకరించి తప్పుగా అన్వయించడం వంటివి జరిగినట్లు పేర్కొన్నారు. అనుమతి నిబంధనలను ఉల్లంఘించి వాటిని ప్రసారం చేయడం అంటే ఆ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని, వాటిని యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అయితే రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్‌తో పాటు ఇతర వేదికలలో కూడా ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం ఈనెల 8, 9, 10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలు నిర్వహించిందని, ఈ సమావేశాల్లో ప్రచార, ప్రచార అనుమతి (ధ్రువీకరణ/ సర్టిఫికేషన్‌) పొందడానికి మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించామన్నారు. అదే విధంగా అనుమతుల్లేని ప్రకటనల ద్వారా తలెత్తే సమస్యలను కూడా తెలిపామన్నారు. ఎన్నికల సంఘం సూచనలను, మార్గదర్శకాలను అనుసరిస్తామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
 
ఎన్నికల సంఘం అనుమతి పొందాల్సిందే 
రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు ధ్రువీకరణ పొందిన ప్రకటనలేనా కాదా అనేది మీడియా సరిచూసుకోవాలని కోరింది. ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని వికాస్‌రాజ్‌ తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలకు అనుమతి ధ్రువీకరణ ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియని వివరించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థి అయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధ్రువీకరణ కోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్‌ కమిటీకి ప్రకటనలను పంపుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  

ఉపసంహరించిన ప్రకటనలు ఇలా.... 
బీజేపీ 
డబుల్‌ బెడ్రూం, దొంగ చేతికి తాళం, రైతు, నేతి బీరకాయ, పేనుకు పెత్తనం  

బీఆర్‌ఎస్‌ 
దేఖ్‌ లేంగే (తెలుగు పాట), మొదటి ఓటు ఎవరికి (వీడియో ప్రకటన), రైతుల అండదండ– కేసీఆర్‌ (వీడియో ప్రకటన), కల్యాణలక్ష్మి  

కాంగ్రెస్‌ 
కారు (30 సెకన్లు), జాబ్‌ (15 సెకన్లు), 
రైతు (40 సెకన్లు), రైతు (30 సెకన్లు), 
రైతు (15 సెకన్లు), రైతు (15 సెకన్లు)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement