ఆరోగ్య వరం | Warangal Health University | Sakshi
Sakshi News home page

ఆరోగ్య వరం

Published Fri, Sep 26 2014 2:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Warangal Health University

  • వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ
  •  కాళోజీ పేరిట క్యాంపస్
  •  నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  •  ఎడ్యుకేషనల్ హబ్‌గా రూపుదిద్దుకోనున్న నగరం
  •  హర్షం వ్యక్తంచేసిన టీఆర్‌ఎస్ నేతలు, ప్రజలు
  • సాక్షి, హన్మకొండ: ప్రతిష్టాత్మక హెల్త్ యూనివర్సిటీ వరంగల్‌నే వరించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెల్త్‌వర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేయూలని గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ పేరుతో ఈ వర్సిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక యూనిట్‌గా విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీ ఉంది.

    1986లో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రస్తుతం 40 మోడ్రన్ మెడిసిన్, 21 డెంటల్, 7 ఆయుర్వేద, 6 హోమియోపతి , 2 యూనాని, 213 నర్సింగ్, 2 న్యూరోపతి యోగ, 38 ఫిజియోథెరపీ, 54 మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సగం కాలేజీలు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఈ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, సమాధాన పత్రాల మూల్యాంకనం వంటి కీలకమైన బాధ్యతలను పక్క రాష్ట్రంలో ఉన్న వర్సిటీకి ఆధీనంలో ఉండడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

    ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో హెల్త్‌వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం సూచించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న తాటికొండ రాజయ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెల్త్‌వర్సిటీని వరంగల్‌లో సాధించేందుకు కృషి చేశారు. రాష్ట్రం ఏర్పాటైన మూడు నెలల తర్వాత వరంగల్‌లో హెల్త్‌వర్సిటీని ఏర్పాటు చేయూలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
     
    ఎడ్యుకేషనల్ హబ్‌గా వరంగల్

    కాకతీయ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకతీయ మెడికల్ కాలేజీ, అనంతలక్ష్మీ ఆయుర్వేద కాలేజీలు వరంగల్ నగరంలో ఇప్పటికే ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఏర్పాటు చేయనుండడంతో తెలంగాణలో వరంగల్ నగరం ఎడ్యుకేషనల్ హబ్‌గా రూపుదిద్దుకోనుంది. మిగిలిన ప్రాంతాలతో పోల్చితే  హెల్త్‌వర్సిటీ ఏర్పాటుకు వరంగల్ అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

    ఇప్పటికిప్పుడు వర్సిటీ పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్, అకాడమిక్ సెనేట్ సభ్యులు, బోర్డు ఆఫ్ స్టడీస్ మెంబర్ వంటి తదితర కీలకమైన పోస్టులను భర్తీ చేసేందుకు కాకతీయ మెడికల్ కాలేజీతో పాటు వేయి పడకల సామర్థ్యం ఉన్న మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో పని చేస్తున్న వైద్యులకు అర్హతలు ఉన్నాయి. అంతేకాదు... వరంగల్ నగరానికి చక్కని రైలు, రోడ్డురవాణా మార్గాలు ఉన్నాయి.

    త్వరలోనే ఎయిర్‌పోర్టును పునరుద్ధరించే అవకాశం ఉంది. పైగా ఉత్తర, దక్షిణ తెలంగాణలకు మధ్యలో వరంగల్ నగరం ఉండడం వల్ల ఈ ప్రాంతం భౌగోళికంగా  అనువైనదిగా భావించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే ఖర్‌రావు వరంగల్‌లో హెల్త్‌వర్సిటీ ఏర్పాటుకు మొగ్గు చూపారు.
     
    కేంద్ర కారాగార స్థలంలో ఏర్పాటు ?

    కాకతీయ మెడికల్ కాలేజీ ప్రస్తుతం 120 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో ప్రస్తుతం సుమారు 50 ఎకరాల స్థలం ఖాళీగానే ఉంది. వర్సిటీ ఏర్పాటుకు ఈ భూములను వినియోగించవచ్చు. కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీని అనుకుని వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో హెల్త్‌వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కారాగారాన్ని వేరే చోటుకు తరలించే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ సెంట్రల్ జైలును నగరం చివర్లో ఉన్న చర్లపల్లికి తరలించి, ఆ స్థలంలో మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను నూతనంగా నిర్మించారు. అదే నమూనాను వరంగల్‌లో అమలు చేసే అవకాశం ఉంది. గతంలో  డిప్యూటీ సీఎం రాజయ్యనే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
     
    టీఆర్‌ఎస్ సంబరాలు

    హన్మకొండ చౌరస్తా : జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ మంజూరుకావడంతో టీఆర్‌ఎస్ అర్బన్ నాయకులు అలంకార్ జంక్షన్ సమీపంలోని జక్రియ ఫంక్షన్ హాల్ ఆవరణలో స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సంబరాల్లో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాకు హెల్త్ యూనివర్సిటీని మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు హర్షం వ్యక్తం చేస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మక హెల్త్ వర్సిటీని వరంగల్‌కు కేటాయించడం, ఈ జిల్లా అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి నిదర్శనమని ఆయన అన్నారు. కోరబోయిన సాంబయ్య, బోడ డిన్నా, పులి రజనీకాంత్, అబూబక్కర్, ఎండీ నయిమొద్దీన్, నలుబోలు సతీష్, అబూబక్కర్, సారంగపాణి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.  
     
    డీహెచ్, ఐఎంఏ హర్షం

    ఎంజీఎం : వరంగల్‌కు  హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేయడంపై డెరైక్టర్ ఆఫ్ హెల్త్ పిల్లి సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు శ్రీనివాస్, రాష్ట్ర ఎథికల్ కమిటీ సభ్యుడు శేషుమాధవ్ ‘సాక్షి’తో మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఓరుగల్లుకు అరుదైన స్థానం దక్కిందన్నారు. ఐఎంఏ ప్రమాణాస్వీకారం సందర్భంగా హరీశ్‌రావు వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ మంజూరుకు కృషి చేస్తామన్న హామీతోపాటు డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చొరవతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ మంజూరైందని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement